పోటెత్తారు..!
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:10 AM
ఏలూరు పడమరవీధిలోని ఆదిమహాలక్ష్మీ, గంగానమ్మ, వినుకొండ అంక మ్మ, పోతురాజుబాబుల జాతరలో భాగంగా ఆదివారం మహాకుంభ నివేదనను భక్తులు నిర్వహించారు.
ఏలూరు పడమర వీధి జాతర..కిక్కిరిసిన నగరం.. నేడు కొర్లబండిపై పొలిమేర్లకు అమ్మవార్లు
ఏలూరుకార్పొరేషన్/ఏలూరు క్రైం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఏలూరు పడమరవీధిలోని ఆదిమహాలక్ష్మీ, గంగానమ్మ, వినుకొండ అంక మ్మ, పోతురాజుబాబుల జాతరలో భాగంగా ఆదివారం మహాకుంభ నివేదనను భక్తులు నిర్వహించారు. ఆదివారం వేకువ జాము 2 గంటల నుంచే కుంభం పోసేందుకు భక్తులు విరివిగా వచ్చారు మొక్కుబడులు చెల్లించుకు న్నారు. స్థానిక ప్రజలు ఆత్మీయ, బంధు మిత్ర వర్గానికి ముందస్తుగా ఆహ్వానాలు ఇవ్వడంతో వారంతా హేలాపురికి తరలిరావడతో నగర మంతా భక్తజనంతో నిండిపోయింది. నివా సాల ముందు తాత్కాలిక టెంట్‌లు వేసి ఆత్మీ య విందులు నిర్వహించారు. సోమవారం ఉదయం 8.36 గంటలకు అమ్మవార్లను కొర్లబండిపై భారీ ఊరేగింపు నడుమ ఊరి పొలిమేర్ల వరకు సాగనంపుతామని జాతర అధ్యక్షుడు చోడే బాలసుబ్రహ్మణ్యం(బాలు), కార్యవర్గ సభ్యులు తెలిపారు.
వాహనాల రద్దీ..ట్రాఫిక్ జామ్
నగరంలో వేకువజాము నుంచే వాహనాల రద్దీ పెరిగింది. పడమర వీధి ప్రాంతానికి ద్విచక్ర వాహనదారులను సైతం పోలీసులు అనుమతించలేదు. వన్‌టౌన్ ప్రాంతంలో అన్ని రోడ్లు భక్తులతో నిండిపోయింది. పాత బస్టాం డ్, వసంతమహల్, జూట్‌మిల్లు సెంటర్, ఫైర్‌స్టేషన్, కొత్తబస్టాండ్, శాంతినగర్, వట్లూ రు వరకు ట్రాఫిక్‌లో వాహనాలు నిలిచి పోయాయి. శనివారపుపేట లోబ్రిడ్జి ట్రాఫిక్ తో నిండడంతో ఏకంగా రైలు పట్టాలపై నుంచి మోటారు సైకిళ్లను దాటించి తీసు కెళ్లారు. దీంతో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకున్నారు. నగరానికి సుమారు 50 వేల కార్లు వచ్చినట్టు అంచనా వేశారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిం చారు. సోమవారం ఉదయం కొర్రలబండి ఊరేగింపు నేపథ్యంలో ముందస్తు భద్రత చర్యలను డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణ లో చేపట్టారు. జాతర బందోబస్తు ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఎస్పీ కిశోర్ పరిశీలించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ విభాగాన్ని, సీసీ కెమెరాల విభాగాలను పరిశీలించారు.