రైతుల పేరిట రచ్చ రచ్చ!
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:52 AM
భీమవరంలో ఆక్వా రైతుల పేరిట సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వైసీపీ శ్రేణులు రచ్చ రచ్చ చేశాయి.
భీమవరం సభలో ఆత్మస్తుతి.. పరనిందలా సాగిన జగన్ ప్రసంగం
పెద్దగా కనిపించని రైతులు.. ఉన్న వారి సమస్యలు విన్నదీ లేదు
సభలో తోపులాట.. స్తంభాలు, బాక్సులపైకి ఎక్కిన కార్యకర్తలు.. పలువురికి గాయాలు
మంచినీళ్లు కూడా లేక అవస్థలు..
పట్టణంలో మూడు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్
సైలెన్సర్లు తీసేసి బైక్‌లపై క్యాడర్ హంగామా
చోద్యం చూసిన పోలీసులు
భీమవరం టౌన్/క్రైం, జూలై 15(ఆంధ్ర జ్యోతి):భీమవరంలో ఆక్వా రైతుల పేరిట సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వైసీపీ శ్రేణులు రచ్చ రచ్చ చేశాయి. సభను విజయవంతం చే యాలని పార్టీ నాయకులు నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించారు. బుధవారం జరిగిన సభ చూస్తే వచ్చిన రైతులకంటే వైసీపీ క్యాడరే ఎక్కువగా కనిపించింది. ఇక వేదికపై రైతులకంటే మూడు జిల్లాల పార్టీ నేతలే కనిపిం చారు. సభలో జగన్ రైతులతో మమేకమై వారి సమస్యలను వింటారని అంతా భావించారు. కాని, ఎక్కడా రైతులతో మాట్లాడింది లేదు. తమ హయాంలో ఆక్వాకు స్వర్ణయుగమని, కూటమి పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పా రు. ఆయన ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి.. పర నిందలా జరిగింది.
నిర్వహణ ఘోరం.. తప్పిన ప్రమాదం
పార్టీ నాయకులు ఆటోలను ఏర్పాటుచేసి గ్రామాల నుంచి జన సమీకరణ చేశారు. దీనిపై వున్న శ్రద్ధ నిర్వహణలో లేకపోయింది. వచ్చిన వారికి కనీస సదుపాయాలు కల్పించడంలో విఫ లమయ్యారు. సభ జరుగుతున్నంత సేపు చాలా మంది స్తంభాలపైకి ఎక్కారు. ఒకరు కింద పడి పోవడంతో దెబ్బలు తగిలాయి. జగన్ సభకు వచ్చే సమయంలోను, వెళ్లే సమయంలోను గ్యాలరీలో తోపులాట జరిగింది. మీడియా ప్రతినిధు లు భయపడి బారీకేడ్లను దాటి వేదిక వద్దకు వెళ్లిపోయారు. మహిళలు ఇబ్బందులు పడ్డారు. ఒక మహిళ పడిపోవడంతో మహిళా కానిస్టేబు ల్ మంచినీళ్లు ఇచ్చి బయటకు తీసుకువచ్చింది. వేదికపై నుంచి నాయకులు సహకరించాలని, వెనక్కి జరగాలని కోరినా క్యాడర్ నుంచి స్పందన కనిపించలేదు. జగన్ వేదికపై నుంచి మాట్లాడుతున్న సమయంలో కుడి వైపున ఉన్న బాక్సులపై కొందరు యువకులు ఎక్కడంతో అవి పడిపోయాయి. లైట్లు ప్రజలపై పడడంతో గందరగోళం ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై అక్కడి నుంచి జనాన్ని చెదరగొట్టారు. లేకుంటే కరెంటు షాక్‌తో పెను ప్రమాదం జరిగేది. సభా వేదిక వద్ద తోపులాటలో ఒక యువకుడికి కాలు విరిగిపోవడంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చాలా వరకు కుర్చీలు విరిగిపోయాయి. ఓ వైపు ఎండ, ఉక్క పోతతో జనం అల్లాడిపోవడంతో సభా ప్రాంగణంలో కనీసం మంచినీళ్లు కూడా దొరక్క అవ స్థలు పడ్డారు. మహిళలకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో వారి బాధలు వర్ణాణాతీతం. చాలా మంది వేదిక బయట ఉన్నవారు ఎండ వేడికి తట్టుకోలేకపోవటంతో దగ్గరలోని శీతల పానీయాల షాపులను ఆశ్రయించారు. జగన్ రాక సందర్భంగా పట్టణం లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్‌లో జనం చిక్కుకుని విలవిల్లాడారు. లూథరన్ హైస్కూల్ గ్రౌండ్‌లో జగన్ హెలీకాప్టర్ ల్యాండ్ అవ్వడంతో అక్కడి నుంచి పోలీసులు వాహనాలను నిలిపి వేశారు. మూడు గంటలపాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. పట్టణంలో ఉదయం 9 నుంచి చాలా మంది యువకులు రచ్చ రచ్చ చేశారు. బైక్‌లకు సైలెన్సర్లు తీసేసి పట్టణ ప్రధాన సెంటర్లలో నడుపుతూ హల్‌చల్ చేశారు. ఆ శబ్ధాలకు ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఆక్వా సమస్యలపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు : తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి
తణుకు, జూలై 15(ఆంధ్రజ్యోతి): ‘భీమవరంలో వైఎస్ జగన్ ఆక్వాపై చేసి న వ్యాఖ్యలు పూర్తి గా రాజకీయ ఉద్దేశా లతో చేసినవే. ఆక్వా రైతులను పూర్తిగా నష్టపరిచిన వ్యక్తికి వారి సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదు. గత వైసీపీ హయాంలో మత్స్యరంగ వృద్ధి రేటు ఒక శాతానికి పడి పోయి ఆక్వా రంగం దెబ్బ తింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో 7.38 శాతం, 25–26లో 14.9 శాతం వృద్ధి రేటు సాధించేలా కార్యాచ రణ అమలుచేస్తోంది. వైసీపీ హయాంలో ఫిష్ ఫీడ్ ధరలను ఆరు ధపాల్లో 27 శాతం పెంచి రైతులపై భారం మోపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ ఫీడ్ ధరను 5.60 తగ్గించి రూ.102లకు తీసుకువచ్చింది’ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం తణుకులో ఆయన విలే కరుల సమావేశంలో మాట్లాడారు. ‘గత వైసీ పీ హయాంలో జోన్, నాన్ జోన్ విధానంలో రైతులను ఇబ్బందులకు గురిచేసింది. కూట మి ప్రభుత్వం జోన్‌ల విధానం రద్దు చేసి విస్తీర్ణంతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి రైతుకు యూనిట్ రూ.1.50కే అందించేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఆక్వా సవాళ్ల నేపథ్యంలో రైతులకు శాశ్వత పరిష్కారం కోసం ఎండ్ టు ఎండ్ పాలసీ రూపొందిస్తున్నాం’ అని వివరించారు.