Share News

బడి బస్సు భద్రమేనా..?

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:59 AM

విద్యా సంస్థలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు బయలుదేరుతున్నారు.

బడి బస్సు భద్రమేనా..?

ఈనెల 15 నుంచి స్పెషల్‌డ్రైవ్‌

చేస్తామంటున్న రవాణా అధికారులు

వృద్ధులు, అనుభవం లేని డ్రైవర్లతో కాలక్షేపం..

నిబంధనలు గాలికి

కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యం

భీమవరం క్రైం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) :విద్యా సంస్థలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు బయలుదేరుతున్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు మాత్రం ఇంకా సన్నద్ధం కాలేదు రాలేదు. సుమారు రెండు నెలలపాటు సెలవులు ఉన్నా ఇప్పటి వరకు పాఠశాలలు, కళాశాల బస్సులకు మాత్రం ఫిట్‌నెస్‌లు (ఎఫ్‌/సీ) పూర్తికాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 55 శాతం మాత్రమే ఫిట్‌నెస్‌ పూర్తయ్యాయి. ఇంకా 45 శాతం బస్సులకు ఫిట్‌నెస్‌లు పూర్తి కాలేదు. అంటే ఆయా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణుకు రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో 1,570 బస్సుల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 900 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌లు పూర్తి చేసుకున్నాయి.ఇంకా 670 బస్సులకు ఫిట్‌నెస్‌లు పూర్తి కాలేదు. ఇంకా కొన్ని బస్సులు మరమ్మతులు చేస్తున్నారు. అలాగే అనుభవం లేని, పదవీ విరమణ పొందిన డ్రైవర్లతో కొన్ని యాజమాన్యాలు బస్సులను నడుపుతున్నారు. దీంతో చాలాసార్లు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అలాంటి డ్రైవర్లకు జీతాలు తక్కువ ఇవ్వవచ్చన్న ఆలోచనతో యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు.

గతంలో కాలం చెల్లిన బస్సులు

గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని ప్రైవేట్‌ స్కూల్‌, కళాశాలల యాజమాన్యాలు నిబంధనలు తుంగలోకి తొక్కారు. కొన్నిచోట్ల కాలం చెల్లిన బస్సులకు రంగులు వేసి రోడ్లపై తిప్పారు. ఆ బస్సుల్లోనే విద్యార్థులను తరలించేవారు. అలాంటి బస్సులకు కూడా అప్పట్లో రవాణా శాఖ ఫిట్‌నెస్‌లు జారీ చేసిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవల రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న లోపం బస్సులో ఉన్నా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు. దానిని మరమ్మతులు చేసుకుని రావాలని మళ్లీ అలాంటిది పునరావృతం అయితే బస్సులు సీజ్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అందువల్లే ఇంకా 45 శాతం బస్సులకు ఫిట్‌నెస్‌లు పూర్తి కాలేదని చెబుతున్నారు.

డ్రైవర్‌కు, బస్సుకు నిబంధనలు

బస్సులు నడిపే డ్రైవర్‌కు 60 సంవత్సరాలు మించకూడదు. 20 సంవత్సరాలలోపు ఉండకూడదు.

ప్రతి డ్రైవర్‌కు హెవీ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. కంటి పరీక్షలు ప్రతి రెండు నెలలకు ఒకసారి చేయించుకోవాలి.

బస్సు డ్రైవర్‌ వెనుక భాగంలో తప్పనిసరిగా డ్రైవర్‌ ఫొటోతో కూడిన వివరాలు, సీనియారిటీ, లైసెన్స్‌ వివరాలు పొందుపర్చాలి.

బస్సు వెనుక, రెండు వైపులా స్కూల్‌, కళాశాల పేర్లు నమోదు చే సి ఉంచాలి.

ప్రతి బస్సులో కండక్టర్‌ తప్పనిసరిగా ఉండాలి.

బస్సు ఫుట్‌పాత్‌ వద్ద రవాణా శాఖ నిబంధనలు ప్రకారం యారో మార్క్‌ వేసి ఉంచాలి.

బస్సు వేగం 60 కిలోమీటర్లు మించకూడదు.

15 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ : కృష్ణారావు, జల్లా రవాణా శాఖాధికారి

ప్రతి బస్సు ఫిట్‌నెస్‌తోనే రోడ్డుపై నడవాలి. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవు. అలాంటి బస్సులను వెంటనే సీజ్‌ చేస్తాం. అలాగే జరిమానాలు కూడా విధిస్తాం. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక బృందాల ద్వారా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ఇంకా ఫిట్‌నెస్‌లు పొందని బస్సులకు కొంత గడువు ఇచ్చాం. అవి వెంటనే ఫిట్‌నెస్‌లు చేయించుకోవాలి.

Updated Date - Jun 13 , 2026 | 12:59 AM