లెక్క తేల్చారు
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:50 AM
జిల్లాలో జాతీయ మైనర్ ఇరిగేషన్ వనరుల గణాంకాల సర్వే ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. జిల్లాలో ఓవరాల్‌గా మైనర్ ఇరిగేషన్ వనరులదే పైచేయి అయినప్పటికి గొట్టపుబావులు (లోతు ఎక్కువ, తక్కువ) ఉన్న వాటి సంఖ్య 68,256గా నిర్థారించారు.
జిల్లాలో మైనర్ ఇరిగేషన్ వన రులదే పైచేయి
గొట్టపు బావులు 68,256
చిన్ననీటి చెరువులు 1799
కొలిక్కి వచ్చిన మైనర్ ఇరిగేషన్ గణన
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
జిల్లాలో జాతీయ మైనర్ ఇరిగేషన్ వనరుల గణాంకాల సర్వే ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. జిల్లాలో ఓవరాల్‌గా మైనర్ ఇరిగేషన్ వనరులదే పైచేయి అయినప్పటికి గొట్టపుబావులు (లోతు ఎక్కువ, తక్కువ) ఉన్న వాటి సంఖ్య 68,256గా నిర్థారించారు. చిన్ననీటి తరహా చెరువుల సంఖ్య 1,799గా లెక్కతేలింది. ఓవరాల్‌గా 70,005 మైనర్ ఇరిగేషన్ నీటి వనరులుగా నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ ఏడో మైనర్ ఇరిగేషన్ సెన్సస్‌ను జిల్లా ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబరు నుంచి చేపట్టగా, ఇటీవల లెక్కలు తేలాయి. 2021లో ఈ గణన జరగాల్సి ఉండగా, కరోనాతో వాయిదా పడింది. 2023–24 లెక్కల ప్రామాణికంగా గ్రామాల్లో గణాంక అధికారులు (ఏఎస్‌వో)లు సర్వే పూర్తి చేశారు. జిల్లా పునర్విభజన నేపథ్యంలో కొన్ని మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లడం, కృష్ణా జిల్లా నుంచి కొన్ని మండలాలు ఏలూరులో కలవడం వల్ల సాగునీటి వనరుల సర్వే రాబోయే కాలంలో మరమ్మతులు, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ఈ గణాంకాలు ఉపయుక్తం కానున్నాయి.
మెట్టలో గొట్టపుబావుల హవా
జిల్లాలో 15 మండలాల్లో గొట్టపుబావులు సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. జిల్లాలో అత్యధికంగా గొట్టపు బావులు పెదవేగి మండలంలో 7,570 ఉన్నట్లు నిర్ధారించారు. టి.నర్సాపురం 6,783, చింతలపూడి 6,130, జంగారెడ్డిగూడెం 5,587,లింగపాలెం 5,135, నూజివీడు 4,692, ద్వారకాతిరుమల 4,134, చాట్రాయి 3,841, ముసునూరు 3,811, కామవరపుకోట 3,332, కొయ్యలగూడెం 3,389, ఆగిరిపల్లి 2,428,జీలుగుమిల్లి 2462, బుట్టాయగూడెం 2,390, దెందులూరు 2,127 గొట్టపుబావులు ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ చెరువుల పరంగా కుక్కునూరులో 278, కామవరపుకోట 182, ద్వారకాతిరుమల 180,చింతలపూడి 174, చాట్రాయి 115, ఆగిరిపల్లి 97 చెరువులున్నాయి. మిగతా మండలాల్లో 40 నుంచి 70 వరకు చెరువులున్నట్టు సర్వేలో తేల్చారు.