Share News

ఇంజనీర్లు..కావలెను!

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:59 PM

జిల్లాలో జలవనరుల శాఖను ఇంజనీర్ల కొరత వెంటాడుతోంది. ఎస్‌ఈతో పాటు, ఏలూరు, కోట రామచంద్రాపురం డివిజన్లలో ఏఈ పోస్టులు భర్తీ కాకపోవడంతో ఈ భారం డీఈలపై పడుతోంది.

ఇంజనీర్లు..కావలెను!
ఏలూరు జల వనరుల శాఖ ఎస్‌ఈ కార్యాలయం

జలధారకు.. ఇంజనీర్ల కొరత!

ఉండాల్సింది 24 మంది.. జిల్లా అంతటికీ ఉన్నది ఐదుగురే!

వంద రోజుల ప్రణాళికలో ప్రతిపాదనలెలా?

జలవనరుల శాఖలో మల్లగుల్లాలు

ప్రశ్నార్థకంగా చెరువుల అభివృద్ధి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జలవనరుల శాఖను ఇంజనీర్ల కొరత వెంటాడుతోంది. ఎస్‌ఈతో పాటు, ఏలూరు, కోట రామచంద్రాపురం డివిజన్లలో ఏఈ పోస్టులు భర్తీ కాకపోవడంతో ఈ భారం డీఈలపై పడుతోంది. దీంతో ప్రభుత్వ పథకాలకు ప్రతిపాదనలకు ఆపసోపాలు పడుతు న్నారు. ఏఈల పరిధిలో డీఈలే అన్నింటికి పరుగులు పెడుతున్నారు. తాజాగా జలధార పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా.. వీటి ప్రతిపాదనలకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 24 మందికి ఐదుగురే వుండడం గమనార్హం.

జిల్లాలో సాగునీటి వనరులు ఒడిసిపడడం.. వాటిని అంద రికి సద్వినియోగ పరుచుకునేలా ప్రతిపాదనలు చేయడం... ఆపై పర్యవేక్షణ చేయడానికి విధిగా అసిస్టెంట్‌ ఇంజనీర్ల పాత్ర కీలకం. ఇలాంటిది ఏళ్ల తరబడి జలవనరులశాఖలో ఏఈల కొరతతో అభివృద్ధి సరిగ్గా ప్రతిబింబించడం లేదు. ఈ కారణంగా రైతుల సమస్యల తీరకపోవడంతో సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు.

24కు మందికి ఉన్నది ఐదుగురే..

ఉమ్మడి జిల్లాలుగానే జలవనరులశాఖ ఇంజనీరింగ్‌ విభా గం పనిచేస్తోంది. ఈ శాఖ ఎస్‌ఈ పోస్టు ఖాళీగానే ఉంది. తాడేపల్లిగూడెంలో పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కుడి ప్రధా న కాల్వ ఈఈగా ఉన్న సీహెచ్‌ దేవప్రకాశ్‌ పూర్తి అద నపు బాధ్యతలతో ఎస్‌ఈ ఏడాదిగా కొనసాగుతున్నారు. ఏలూరు ఇరిగేషన్‌ డివిజన్‌ పరిధిలో 15 మంది ఏఈలు పనిచేయాల్సి ఉండగా కేవలం నలుగురే పని చేస్తున్నారు. మరోవైపు కీలక మైన కోటరామచంద్రాపురం ఐటీడీఏ పరిధిలో డివిజన్‌లో తొమ్మిది ఏఈ పోస్టులకు ఒక్క ఏఈనే పనిచేస్తున్నారు. అంటే 24 మంది ఏఈలకు కేవలం ఐదుగురే జిల్లా అంతటా పర్యవేక్షిస్తున్నారు. దీంతో ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం చోటుచేసుకోవడంతో పాటు.. పూర్తి స్థాయిలో స్థానిక సమస్య లపై ప్రతిపాదనలకు చోటు దక్కకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

100 రోజుల ప్రణాళిక ఎలా..?

జలధార పథకం కింద 100 రోజుల ప్రణాళికలో జిల్లాలోని సాగునీటి కాల్వలు, మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాల్సి వుంది. ఈవారంలోనే క్షేత్రస్థాయిలోనే సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులతో కలిసి ప్రతిపాద నలను కార్యరూపంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఇంజనీర్ల పైనే ఉంది. ఈ వారంలోనే దాదాపుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి రావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

భారం తప్పదు

జిల్లాలో 1513 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు, గొలుసుకట్టు చెరువులున్నాయి. వీటి పరిధిల్లో ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయి. గట్టు బలహీనంగా ఉన్న చోట పటిష్ఠం చేయడం.. పూడుకుపోయిన చెరువులు ఎంతమేర మట్టి పూడికలు తీయాల్సి ఉంటుందనే అంశాలపై సమగ్రంగా ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంది. కనీసం అవుట్‌సోర్సింగ్‌ పరిధి కింద అయినా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉండగా. ఇప్పటి వరకు అతీగతీ లేదు. త్వరలో ప్రతిపాదనలు కలెక్టర్‌ పర్యవేక్షణలో కమిటీకి నివేదించాల్సి రావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. భారం తప్పడం లేదని అధికారులు నిట్టూర్చుతున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో ఓఅండ్‌ఎం పనులు చేపట్టాల్సి రావడంతో డీఈలపై అదనపు భారం తప్పేటట్టు లేదు. కాల్వకు నీటి విడుదల తేదీలు పెంపు.. మరోవైపు పంటలకు సాగునీటి పర్యవేక్షణతో జల వనరులశాఖ అధికారులకు ముచ్చె మటలు పడుతున్నాయి. ఏఈల కొరతపై జిల్లా కలెక్టర్‌ అయినా స్పందించాల్సిన అవసరం ఉంది.

గుర్రపు డెక్క, తూడు తొలగించండి : కలెక్టర్‌

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి) : నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టాల్సిన మరమ్మతులు, పూడికతీత, తదితర పనులు కాల్వలు, చెరువుల వివరాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఇరిగేషన్‌ శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఇరిగేషన్‌ శాఖాధికారులతో సమీక్షిస్తూ వర్షాకాలం సీజన్‌ ప్రారంభం వాటికి నీటి వనరులన్నింటినీ పూర్తి నిల్వ సామర్థ్యంతో సిద్ధం చేయాలన్నారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపుడెక్క, తూడు తొలగింపు, పూడికతీత, ఆక్రమణల తొలగింపు, చెరువు, కాల్వ గట్ల పటిష్ఠం, తదితర పనులకు అవసరమైన నిధుల వివరాలతో ప్రాథమిక ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్‌ శాఖ రిటైర్డ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్‌.సతీష్‌ కుమార్‌, ఇరిగేషన్‌ శాఖ ఏలూరు ఎస్‌ఈ దేవప్రకాశ్‌, భూగర్భ జల శాఖాధికారి కోదండరావు, ఇరిగేషన్‌శాఖ డీఈలు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:59 PM