ఇంకా కరుణించని వరుణుడు
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:32 AM
సార్వా సాగు ఎలా అంటూ రైతులు సతమతమవుతున్నారు. చేలల్లో నాట్లు వేసేందుకు సరిపడా నీరు లేదు.
కాలువల నీటితోనే సార్వా నాట్లు
సరిపడా నీరందించేలా ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులు ప్రయత్నం
జిల్లాలో లక్షా 4 వేల ఎకరాల్లో నాట్లు పూర్తి
ఆగస్ట్ 10 నాటికి నాట్లు పూర్తయ్యే అవకాశం
భీమవరం రూరల్, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : సార్వా సాగు ఎలా అంటూ రైతులు సతమతమవుతున్నారు. చేలల్లో నాట్లు వేసేందుకు సరిపడా నీరు లేదు. వాన నీటికోసం ఆకాశం వైపు చూస్తేనే ఉంటున్నారు. మబ్బు లతో ఊరటే తప్ప నీటి చుక్క జాడ లేదు. పంట కాలువల నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాలువల దిగువ ప్రాంత ఆయకట్టుకు కాలువ నీరు అందే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.సాగునీరు ఇబ్బంది ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ కాలువల నీటి ప్రవాహం తీరు, చెత్త ఉన్న వాటిని తీయించే ప్రయత్నాలపై దృష్టి పెట్టారు. ఉపాధి హామీ పనుల్లో చెత్త తొలగింపు చేపట్టేలా చూస్తున్నారు.
లక్షా నాలుగు వేల ఎకరాల్లో నాట్లు పూర్తి
ముందుగానే నాట్లు వేయాలనే రైతుల ప్రయత్నాలు విఫలమవుతున్నా నాట్లు వేయడంలో వెనుకడుగు వేయడం లేదు. నారుమడుల దశలో రైతులు జూన్ నెలలో కురవవలసిన వర్షాలు లేకపోయినా వేగంగానే నారుమడులు వేశారు. వర్షాభావ పరిస్థితితో నాట్లు వేయడానికి ఆటం కాలు ఏర్పడుతున్నాయి. డెల్టా ప్రాంతం కావడంతో 90 శాతం సాగు కాలువల నీటి సౌకర్యం ఉంది. దీంతో నాట్లు వేస్తున్నారు. జిల్లాలో 2 లక్షల 20 వేల ఎకరాలకు గాను లక్షా నాలుగు వేల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. మిగిలినవి ఆగస్ట్ నెల 10వ తేదీకల్లా పూర్తవుతుందనే అంచనాలో జిల్లా వ్యవసాయ శాఖ ఉంది. నాట్లు వేయడానికి ఇబ్బంది లేకుండా రోజుకు కాలువలకు 7 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీనివల్ల అన్ని కాలువలకు నిండుగా నీరు సరఫరా అవుతోంది.
బెంగాలీ నాట్లతో లాభం
వరిసాగులో కొన్నేళ్లుగా బెంగాలీ నాట్లు వేస్తున్నారు. దానివల్ల దిగుబడి బాగుంటుంది. బెంగాలీ నాట్లు వల్ల సాగునీరు తక్కువ ఉన్నా నాట్లు ప్రక్రియకు అడ్డంకి లేదు. తక్కువ లోతు దమ్ము, తక్కువ నీరు ఉంటే చాలు. నారుమడి 18 రోజుల్లోపులోనే నాట్లు వేస్తారు. నాట్లు మునగకుండా నేలను సమానంగా ఉంచి అంగుళం లోతు నీరు మాత్రమే ఉంచుతారు. దీనివల్ల సాగునీటి వాడకం నాట్లు వేసిన 15 రోజుల వరకు పెద్దగా అవసరం ఉండదు.
అధిక ఉష్ణోగ్రతలతో ఎదుగుదల ఆలస్యం
ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. వర్షాలు లేవు. దీంతో సార్వా సాగుకు గడ్డు పరిస్థితి నెలకొంది. నాట్లు వేసిన ప్రాంతాల్లో వర్షాలు లేని లోటు కనిపిస్తుంది. నాట్లు రంగు మారుతున్నాయి. కొన్నిచోట్ల దెబ్బతింటున్నాయి. రైతులు సాగునీరు నిండుగా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నాట్లు ఎదుగుదల కొంత ఆలస్యం ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఎదుగుదల చాలా మందకొడిగా ఉంటుందని అంటున్నారు. రైతులు వర్షాల కోసం రోజూ ఎదురు చూస్తున్నారు.