సాగునీటికి ఆక్వా గండి
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:30 AM
వ్యవసాయానికి నీరందక అష్టకష్టాలు పడుతుంటే ఆక్వా చెరువులకు మోటార్లుతో నీటిని తోడేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోటార్లుతో ఇష్టారాజ్యంగా నీటి తోడకం
నీరందక ఎండిపోతున్న వరి పొలాలు
పట్టించుకోని అధికారులు, నీటి సంఘాలు
ఆకివీడురూరల్ జూలై 19 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయానికి నీరందక అష్టకష్టాలు పడుతుంటే ఆక్వా చెరువులకు మోటార్లుతో నీటిని తోడేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో సార్వాసాగుకు ఆదిలోనే చుక్కెదురైంది. అయినప్పటికీ రైతులు వెదజల్లే పద్ధతి ద్వారా సాగు ప్రారంభించారు. అయితే పొలాలకు ఎగువభాగంలో ఉన్న ఆక్వా చెరువుల యజమానులు మోటార్లు పెట్టి ఇష్టారాజ్యంగా నీటిని యఽథేచ్చగా తోడేస్తున్నారు. దీంతో వ్యవసాయానికి నీరందంక నారుమడులు, వెదజల్లిన పొలాలు బీటలు వారి ఎండిపోతున్నాయి.
ఇష్టారాజ్యంగా మోటార్లు
ఆకివీడు మండలం చినిమిల్లిపాడు ఆయకట్టుకు నీరందించే గేదెలకోడు ప్రారంభంలో ఆక్వాచెరువులు యజమానులు తమ చెరువులకు మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. దీంతో దిగువకు నీరు వెళ్ళక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజులపేట నుంచి అగ్రహారానికి నీరందించే గోపరాజుకోడులో ఎగువున చెరువులకు ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తున్నారు. దీంతో దిగువకు నీరు వెళ్లక పంటబోదెలు అడుగంటుతున్నాయి. సాగునీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు ఏర్పాటు చేసిన లస్కర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే సాగునీటి ఇక్కట్లు ఏర్పడుతున్నాయని ఆక్వాచెరువులుకు నీటిని తోడుతుంటే చోద్యం చూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పైగా ఫిర్యాదు చేసిన రైతుల పేర్లు ఆక్వాచెరువుల యజమానులకు తెలియజేసి వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోతుబరులదే రాజ్యం
చెరువులకు యధేచ్ఛగా నీటిని తోడేస్తున్నా లస్కర్లు పట్టించుకోవడం లేదు. చెరువులు మీద పనిచేసే గుమస్తాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తు బెదిరింపులకు దిగుతున్నారు. పన్ను కడుతున్నాం.. మేము తోడుకున్నాకే మీరు తోడుకోండి.. ఎవరికి చెప్పుకున్నా భయం లేదని మాట్లాడుతు న్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం.
–ఇందుకూరి గాంధీరాజు, రైతు, చినిమిల్లిపాడు