నీరు లేక.. బీడు వారి..
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:31 AM
ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామంలో రైతులు తీవ్ర సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు.
చెరుకుమిల్లిలో సాగునీటి ఎద్దడి
పాత వయ్యేరులో పేరుకుపోయిన కర్రనాచు, తూడు
పొట్ట, ఈనిక దశలో నీటి అవస్థలు
15 రోజులుగా రైతుల పాట్లు
ఆకివీడురూరల్ మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామంలో రైతులు తీవ్ర సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. 15 రోజులుగా నీరందడం లేదు. వరి పొలాలు బీటలు వారుతున్నాయి. పాతవయ్యేరు కాలువ నుంచి పంట కాలువ ద్వారా దిగువ ప్రాంతంలో ఉన్న సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. చెరుకుమిల్లిలో వెంకయ్య వయ్యేరు కాలువ నుంచి వరి పొలాలకు నీరందించే పంటబోదె నీరు లేక అడుగంటింది. వెంకయ్యవయ్యేరు నుంచి పంట బోదెలోకి నీరు రావడం లేదు. నీటికోసం పంటబోదెలో మోటార్లు వేసుకుందామనుకున్నా నీరందే పరిస్థితి లేదు. ప్రస్తుతం పొలాలు పొట్ట, ఈనిక దశలో ఉన్నాయి. ఈ సమయంలో సాగునీరు అత్యవసరం. రైతులు లబోదిబో అంటున్నారు. వెంకయ్య వయ్యేరు కాలువలో నీరు తగ్గిపోయింది. ఎగువ ప్రాం తంలో వంతెనల వద్ద పేరకుపోయిన గుర్రపుడెక్క, తూడు వల్ల దిగువకు నీరు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
15 రోజులుగా ఇదే పరిస్థితి
15 రోజులుగా పంటబోదెలోకి నీరు రావడం లేదు. వచ్చిన కొదిపాటి నీరు ఎవరికీ చాలడం లేదు. పొలాలు బీటలు వారాయి. ప్రస్తుతం వరి పొలాలు పొట్ట ఈనిక దశలో ఉన్నాయి. నీటి లభ్యతను బట్టే దిగుబడులుంటాయి. ఇంజన్లతో నీటిని తోడుకోవడానికి నీరు అందడం లేదు. వీటికి ఖర్చు అదనంగా పెరిగిపోతున్నది.
బూరగ మార్కు, రైతు
పురుగుమందుల పిచికారీకిఇబ్బంది..
తగినంత నీరు లేకపో వడంతో పురుగు మందులు పిచికారీ చేసుకోవ డానికి కూడా వీలు లేకుండా పోయింది. నీటి సంఘం ముందుకొచ్చి వెంకయ్య వయ్యేరు కాలువ నుంచి నీటిని పంట బోదెలోకి తోడే ఏర్పాటు చేస్తే వరి పొలాలకు నీరందుతుంది.
కుంచాడ సూర్యనారాయణ, రైతు