Share News

ఖరీఫ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:21 AM

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు రైతాంగానికి అవసరమైన సాగునీటిని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశించారు.

ఖరీఫ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు
సమావేశంలోమాట్లాడుతున్న కలెక్టర్‌ నాగరాణి.. పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌

సాగునీటి సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలి

నీటిపారుదల సలహా మండలి సమావేశంలో కలెక్టర్‌ నాగరాణి

భీమవరం రూరల్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు రైతాంగానికి అవసరమైన సాగునీటిని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనుల పురోగతిపై ఇరిగేషన్‌ సర్కిల్‌ వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, ముఖ్యంగా షట్టర్ల మరమ్మతులను అత్యవసరంగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 18 ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు గుర్రపుడెక్కను ఉపయోగించి కంపోస్ట్‌ తయారీ చేపట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రైతులకు నిరంతర సాగునీటి సరఫరా కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యన్నారు. మునిసిపల్‌ డ్రెయినేజీ నీటిని నేరుగా పంట కాలువల్లోకి వదలడం అత్యంత ప్రమాదకరమని దీనివల్ల తాగునీటి వనరులు, పర్యావరణం కలుషితమవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ చైౖర్మన్‌ కె.మురళీకృష్ణంరాజు, వైస్‌ ఛైర్మన్‌ గుబ్బల మార్రాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ దేవప్రకాష్‌, ఈఈ రమేష్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, డీఈలు నారాయణ, శ్రీనివాస్‌, కె.ధర్మజ్యోతి, భీమవరం డ్రెయిన్స్‌ ఈఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈవీఎం గొడౌన్ల తనిఖీ

భీమవరంటౌన్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోడౌన్స్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్‌ నాగరాణి గురు వారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి మూడు నెలలకి ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపుతామని తెలిపారు. డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, ఎలక్షన్‌ సెక్షన్‌ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ శేఖర్‌, పార్టీ నాయకులు శ్యాంబాబు, జయశివ, కె.సురేంద్ర ఉన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 12:21 AM