Share News

ముంపు.. ముప్పు

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:27 AM

తణుకు మండలం తేతలి నుంచి పైడిపర్రు, మండపాక మీదుగా ప్రవహించే సత్యవాడ మురుగునీటి కాలువ పలుచోట్ల పూడుకుపోయి మురుగు నీరు ముందుకు పారడం లేదు.

ముంపు.. ముప్పు
తణుకు మండలం తేతలిలో పూడుకుపోయిన సత్యవాడ డ్రెయిన్‌

మురుగునీటిలో వరి నాట్లు

పది రోజులుగా నానుతున్న పొలాలు

ఎరువులు, కలుపు మందులు వేసేదెలా ?

తణుకు రూరల్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): తణుకు మండలం తేతలి నుంచి పైడిపర్రు, మండపాక మీదుగా ప్రవహించే సత్యవాడ మురుగునీటి కాలువ పలుచోట్ల పూడుకుపోయి మురుగు నీరు ముందుకు పారడం లేదు. ఫలితంగా ఆ నీరు పంట పొలాల్లోకి చేరి వరి నాట్లను నాశనం చేస్తోంది. ఉండ్రాజవరం మండ లం కాల్దరి, సత్యవాడ, వడ్లూరు గ్రామాల పొలా ల్లోని మురుగునీరు దిగువకు పంపించేందుకు 200 ఏళ్ల క్రితమే సత్యవాడ డ్రెయిన్‌ను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఈ డ్రైన్‌ చాలాచోట్ల ఆక్రమణలకు గురైంది. కొన్నిచోట్ల పూడుకుపో యింది. అక్కడక్కడ తూడు, గుర్రపు డెక్క కిక్కిస కాడ పెరిగి అడవిలా మారి మురుగు నీటిపారుదలకు ఆటంకంగా మారింది. డ్రైన్‌లో పెరుగుతున్న గుర్రపు డెక్క, తూడు నివారణకు ఎప్పటికప్పుడు కలుపు మందు పిచికారి చేస్తున్నా, ఎండిన గుర్రపు డెక్కను తొలగించక పోవడం, కిక్కిస కాడ పెరిగిపోవడంతో తూరల వద్ద అడ్డుగా నిలిచిపోతోంది. గోదావరి నదికి ఎగువన విస్తారంగా వర్షాలు కురవడంతో కాలువల నీటితో జిల్లాలోని పలు మండలాల్లో నాట్లు పూర్తిచేశారు.

ముందస్తు సాగులో భాగంగా తేతలి, ఉండ్రాజవరం మండలంలోని పలు గ్రామాల్లో వరి నాట్లు పూర్తి చేసి 10 రోజులు దాటినా మురుగునీటి ముంపు కారణంగా తేతలి, వడ్లూరు గ్రామాల్లోని 200 ఎకరాల్లోని నాట్లు మునిగిపోయాయి. దీనితో ఎరువులు, కలుపు మందులు వేసేందుకు ఇది ఆటంకంగా మారింది. చేలల్లో ఈ నీరు ఎక్కువ రోజులు నిలిచిపోతే నాట్లు దెబ్బ తింటాయనే రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం కురిస్తే నష్ట తీవ్రత మరింత ఎక్కువ వుంటుంది. వేల్పూరులో జరిగిన జన్మభూమి గ్రామసభలో అప్పటి సీఎం చంద్రబాబు సత్యవాడ డ్రైన్‌ ప్రక్షాళనకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హామీ మేరకు నిధులు విడుదల చేసి, టెండర్లు ఖరారైనప్పటికీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రక్షాళన ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది కాబట్టి ఈ కాల్వపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

నాట్లు వేసి పది రోజులైనా..

నాట్లు పూర్తి చేసి పది రోజులైనా మురుగు నీరు కారణంగా ఎరు వులు, కలుపు మందు వేసే అవకాశం లేదు. ఈ నీరు ఇలాగే వుంటే వరి పంట పెరగదు. నష్టం తప్పదు.

– గాజుల దానయ్య, రైతు, తేతలి

పూడిక తీయిస్తా...

సత్యవాడ డ్రైన్‌ పూడిక తీసేందుకు డిస్ర్టి బ్యూటరీ కమిటీ దృష్టిలో పెట్టాం. త్వరలోనే డ్రైన్‌లో పూడిక తీత పనులు చేపడతాం.

– పి.వివేకానంద, డ్రైనేజీ ఏఈ, తణుకు

Updated Date - Jul 23 , 2026 | 12:27 AM