ఇన్విజిలేటర్లే..అలా చేస్తున్నారా?!
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:18 AM
ఏలూరు రూరల్ మండలం శనివారపుపేట జడ్పీ హైస్కూలు పరీక్ష కేంద్రం రూమ్ నంబరు 5లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్విజిలేటర్ పనితీరుపై ఆరోపణలు రావడంతో డీఈవో వెంకట లక్ష్మమ్మ ఈ నెల 25న నోటీసు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జవాబుపత్రాలిచ్చి మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సాహం
శనివారపుపేట పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్‌కు డీఈవో నోటీసు
ఏలూరు అర్బన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఏలూరు రూరల్ మండలం శనివారపుపేట జడ్పీ హైస్కూలు పరీక్ష కేంద్రం రూమ్ నంబరు 5లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్విజిలేటర్ పనితీరుపై ఆరోపణలు రావడంతో డీఈవో వెంకట లక్ష్మమ్మ ఈ నెల 25న నోటీసు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23న జరిగిన గణితం పరీక్షకు ఇక్కడి పరీక్ష కేంద్రంలోని రూమ్ నంబరు 5లో ఓ విద్యార్థి రాసిన జవాబు పత్రాలను అదే రూమ్‌లో పరీక్ష రాస్తున్న మిగతా విద్యార్థులకు ఇన్విజిలేటర్ అందజేస్తున్నారన్న అభియోగాలతో ఏలూరు సత్రంపాడు జడ్పీ హైస్కూలుకు చెందిన ఉపాధ్యాయినికి డీఈవో నోటీసు జారీచేశారు. బాధ్యతా రాహిత్యంగా విధులు నిర్వర్తించడంతో క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో జరిగే పరీక్షల విధుల నుంచి ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇస్తూ నోటీసుకు 3 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానమివ్వాలని ఆదేశించారు. కాగా ఇక్కడి పరీక్ష కేంద్రంలో పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు సబ్జెక్టుల పరీక్షలు జరిగిన రోజుల్లో సీసీ కెమెరాలు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఉండటాన్ని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు జిల్లా విద్యాశాఖకు సమాచార మిచ్చినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే కొత్త కెమెరాలను అమర్చినట్టు సమాచారం. కెమెరాల ధ్వంసం విషయాన్ని విద్యాశాఖాదికారులు అంగీకరించడం లేదు. మరోవైపు తెలుగు పరీక్ష రోజున ప్రశ్నపత్రాలు 1టి బదులుగా 3టి (సంస్కృతం) కొందరు విద్యార్థులకిచ్చిన సంఘటనలో ఇదే పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తి స్తున్న ఓ ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తప్పించగా, తాజాగా రూమ్ నంబరు 5లో మరో ఇన్విజిలేటరు స్వయంగా మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించడం శోచనీయం.
విద్యాశాఖాదికారుల వివరణలు
శనివారపుపేట జడ్పీహెచ్‌ఎస్ పరీక్ష కేంద్రంలో వరుస సంఘటనలపై డీఈవో వెంకట లక్ష్మమ్మను వివరణ కోరగా... రూమ్ నంబరు 5లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ఫుటేజీని స్వయంగా పరిశీలించా. విద్యార్థులకు జవాబుపత్రాలు అంది స్తున్నట్టు కెమెరాల ఫుటేజీలో రుజువు కాలేదు. అయినప్పటికీ ఇన్విజిలేటర్‌పై ఆరోపణలు రావడంతో వివరణ కోసం నోటీసు జారీచేశాం.’ అని వివరించారు. ఇక ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఆర్. ఆశ వివరణ ఇస్తూ... మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టుగా గుర్తుతెలియని వ్యక్తులు, ఆకాశ రామన్న ఉత్తరా లు పంపుతున్నారేతప్ప తగిన ఆధారాలు ఇవ్వడంలేదు. ఇక్కడి పరీక్ష కేంద్రంపై ఆరోపణలు రావడంతో గత నాలుగు రోజులుగా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను పంపడంతో పాటు, నేనే స్వయంగా ఈరోజు అక్కడే ఉన్నాను. చీఫ్ సూపరింటెండెంట్ పట్ల కొందరికి విభేదాలు ఉండటం వల్లే ఇలా జరుగుతోందని భావిస్తున్నాను.’ అని అన్నారు.
బయోలాజికల్ సైన్స్ పరీక్షకు 518 మంది గైర్హాజరు..
పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన బయోలాజికల్ సైన్సు పరీక్షకు ఏలూరు జిల్లాలో 23,114మంది హాజరు కాగా, 518 మంది గైర్హాజ రయ్యారని డీఈవో తెలిపారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య ఎస్‌ఎస్‌సీ హిందీ పరీక్షకు ఇద్దరు అభ్యాసకులు హాజరయ్యారని వివరించారు.