మహిళా సంక్షేమంతో దేశం సుభిక్షం
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:53 AM
మహిళల సంక్షేమంతోనే కుటుంబం, సమాజం, దేశం సుభిక్షంగా ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు అన్నారు.
మహిళా దినోత్సవంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ
భీమవరం టౌన్, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మహిళల సంక్షేమంతోనే కుటుంబం, సమాజం, దేశం సుభిక్షంగా ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు అన్నారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఏ పథకం ప్రారంభించిన మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు. మహిళలు సామాజిక, ఆర్థిక పురోగతి సాధించడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మహిళల రక్షణ కోసం వన్ స్టాప్ సెంటర్, 181, 1098 హెల్ప్‌లైన్‌లు 24 గంటలు సేవలందిస్తున్నాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు 2025–26లో రూ.805.89 కోట్లు బ్యాంకు రుణాలు మంజూరు చేయగా, రికవరీ రేటు 99.89శాతం ఉండడం మహిళల క్రమశిక్షణకు నిదర్శనం అన్నారు. స్త్రీ నిధి, ఉన్నతి పథకాల ద్వారా కూడా మహిళ లకు ఆర్థిక సహాయం అందుతోందని తెలిపారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు విజయభారతి షైనీ, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత స్త్రీల హక్కులు, ప్రభుత్వాలు చేపడు తున్న కార్యక్రమాలు వివరించారు. సెర్ప్, మెప్మా సంస్థల ఆర్థిక ప్రోత్సాహంతో వివిధ వ్యాపారాలు, యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధించిన పారిశ్రా మికవేత్తలను కలెక్టర్ జ్ఞాపికలతో సత్కరించారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగినులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ డి.లక్ష్మి డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, సీపీవో కె.శివపార్వతి, డీఎస్‌వో ఎన్.సరోజ పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, డీఈవో ఇ.నారాయణ, మెప్మా పీడీ హెప్సిబా, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు మంత్రి నిమ్మల సత్కారం
పాలకొల్లు అర్బన్: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాల యంలో ఆదివారం పలువురు మహిళను సత్కరించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్దిలో మహిళల పాత్ర కీలకమని, మహిళల ఆర్థికాభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల తెలిపారు.