పన్ను చెల్లింపుదార్లకు వడ్డీ రాయితీ
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:30 AM
నగరపాలక సంస్థ, మున్సిపాల్టిల పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
నెలాఖరు వరకు గడువు..
ఇప్పటికే చెల్లించిన వారికీ వర్తింపు
ఏలూరు టూటౌన్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ, మున్సిపాల్టిల పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బకాయిలపై వడ్డీ భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించాల్సిన వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31లోపు వడ్డీతో సహా బకాయిలన్ని ఒకేసారి చెల్లించే వారికి రాయితీ వర్తిస్తుంది. ఇప్పటికే వడ్డీతో సహా పన్ను చెల్లించినవారికి కూడా రాయితీ వర్తిస్తుంది. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి చెల్లించే పన్ను మొత్తంపై వడ్డీ రాయితీ అమలు చేస్తారు. ఇప్పటికే పన్ను చెల్లించినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది చెల్లించాల్సిన పన్నుపై 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు.
అంతంత మాత్రం వసూళ్లు
జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మున్సిపాల్టిల్లో పన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నాలుగు మున్సిపాల్టిల్లో 1,16,75 మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వారి నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.91.98 కోట్ల పన్నులు వసూలు లక్ష్యం. కేవలం రూ.41.12 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఆర్థిక సంవత్సరం 14రోజుల్లో ముగుస్తుండగా రూ.50.86 కో ట్లు వసూలు చేయాల్సి ఉంది. ఏలూరు నగర పాలక సంస్థ, 3మున్సిపాల్టీల్లో 44.70శాతం వసూలయ్యాయి. ఇంకా 55.30 కోట్లు వసూలు కావల్సి ఉంది.
పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతీరోజు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు టీమ్‌లుగా ఇంటింటికి తిరుగు తున్నాం. నాతోపాటు డిప్యూటీ కమిషనర్, రెవెన్యూ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది సచివాలయ సెక్రటరీలతో పన్ను వసూళ్లు ముమ్మరం చేశాం. మొండిబకాయిదారులకు రెడ్ నోటీసులు పంపుతున్నాం. అప్పటికి స్పందించక పోతే చట్టపరంగా ముందుకు వెళ్తాం. ఆస్తి పన్ను వడ్డీ రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మార్చి 31దాటితే వడ్డీరాయితీ వర్తించదు.
శ్రీనివాసరావు, అదనపు కమిషనర్, నగరపాలక సంస్థ