Share News

ఎర్ర కాలువ వరదకు చెక్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:34 AM

ఎర్ర కాలువ, యనమదుర్రు కాలువలోకి వచ్చే విధంగా శిథిలమైన ఇన్‌లెట్‌, అవుట్‌ లెట్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేశారు.

ఎర్ర కాలువ వరదకు చెక్‌

ఎర్ర కాలువ గట్లకు ఇన్‌లెట్‌, అవుట్‌ లెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు

ఎర్రకాలువ పరీవాహక ప్రాంత రైతుల చిరకాల కోరిక త్వరలో తీరనుంది

ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకుండా వున్న ఎర్రకాలువ పరీవాహక గ్రామాల్లోని పొలాల్లోకి వరద నీరు రాకుండా, పొలాల్లోని మురుగునీరు ఎర్ర కాలువ, యనమదుర్రు కాలువలోకి వచ్చే విధంగా శిథిలమైన ఇన్‌లెట్‌, అవుట్‌ లెట్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేశారు.

తణుకు రూరల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో వీటి అభివృద్ది, ఆధునికీకరణ పట్ల శ్రద్ధ వహించకపోవడంతో వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు ఎర్ర కాలువ వరద కారణంగా పంట పొలాలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారు. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎగువ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాల కారణంగా వివిధ జలాశయాల్లోకి చేరిన మురుగునీరు ఎర్రకాలువలో దిగువ ప్రాంతాల్లో వరదగా మారుతుంది. దీనివల్ల జిల్లాలోని పలు మండలాల్లోని పంట పొలాలు ముంపున గురై పంటలు మునిగి రైతులు పంటలు నష్టపోతున్నారు. ఏటా జరిగే ఈ నష్టాన్ని తగ్గించాలని ఎర్రకాలువ పరీవాహక ప్రాంత రైతులు కోరుతున్నారు. ఎప్పటికప్పుడు ఆచరణ సాద్యం కావడంలేదు. ఈ ఏడాది ఎర్రకాలువ వరదకు కట్టడి వేయాలని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మురుగు ముంపే ఎక్కువ

ఎర్ర కాలువ పంట చేలలో మురుగునీటి ప్రవాహానికి ఉద్దేశించిన కాలువ. కాలువ ప్రవహించినంత మేర పంట పొలాల్లోని భారీ వర్షాల కారణంగా పెరిగి పోయే మురుగు నీటిని ఎర్ర కాలువలోకి వచ్చేలా నిడదవోలు మండలం నందమూరు నుంచి భీమవరం వరకూ అనేక గ్రామాల్లో ఇన్‌లెట్‌, అవుట్‌ లెట్‌ల కాంక్రీట్‌ నిర్మాణాలు చేశారు. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరడంతో ఎర్రకాలువ వరద నీరు ఈ ఇన్‌ లెట్‌, అవుట్‌ల ద్వారా మురుగు కాలువుల్లోకి వచ్చి పంట పొలాలను వరద నీరు ముంచేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎర్ర కాలువ జిల్లా మధ్యన ప్రవహించడం తో రెండు గట్లకు 50చోట్ల ఈ ఇన్‌లెట్‌, అవుట్‌ లెట్లు నిర్మించారు. మొదట్లో ఇవి పొలాల్లోని మురుగునీటిని కాలువలోకి వచ్చేలా పనిచేసినా ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరడం, గ్రామాల్లోని మురుగు కాలువలు ఆక్రమణలకు గురికావడంతో ఈ మురుగు కాలువలే వరదకు ప్రధాన కారణంగా నిలిస్తున్నాయి. ఈ ఎర్రకాలువకు తూర్పు కాలువ గట్టు తణుకు ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ పరిదిలో, పశ్చిమ గట్టు తాడేపల్లిగూడెం ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో వున్నాయి. తూర్పు గట్టున 30 ఇన్‌లెట్‌, అవుట్‌ లెట్‌లు, పశ్చిమ వైపు 28 ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌ నిర్మాణాలు వున్నాయి. ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరి తలుపులు పాడైపోవడంతో కాలువలో ప్రవహించే వరద నీరు వీటి ద్వారా మురుగు కాలువల్లోకి చేరి పంటలను ముంచుతోంది. రైతులు వర్షాకాలంలో ఎర్ర కాలువ వరద నీరు పొలాల్లోకి రాకుండా ఇసుకు బస్తాలతో కట్టడి చేస్తున్నా వరద నియంత్రణలోకి రాకపోవడంతో పొలాలు వరద నీటలో మునిగిపోతున్నాయి. ఎర్రకాలువ తూర్పు, పశ్చిమ గట్లను వున్న ఇన్‌లెట్‌ల అభివృద్ధి చేయడం ద్వారా వరద నష్టాన్ని తగ్గించవచ్చు. దీనికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఇన్‌లెట్‌ల నిర్మాణానికి నిధులు మంజూరుచేసింది. పశ్చిమ గట్టు(కుడి గట్టు)న వున్న ఆరుళ్ల, కోనాల, ముద్దాపురం గ్రామాల పరిధిలో శిథిలమైన ఏడు అవుట్‌ లెట్‌, ఇన్‌లెట్‌ల నిర్మాణానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద వున్న ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే టెండర్ల ప్రకియ పూర్తి చేసుకుని పనులు ప్రారంభిచేందుకు వీలవుతుంది. ఈ పనులు ఈ నెలలో పూర్తైతే మేలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలవుతుంది.

ఖరీఫ్‌ నాటికి పూర్తి చేస్తాం

ఎర్రకాలువ వరద కారణంగా కుడి గట్టున వున్న దువ్వలోని పంటలు ఎక్కువగా దెబ్బ తింటున్నాయి. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వీటి అభివృద్ధి, పునర్నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధతో నిధులు రాబట్టి గత ఏడాది రెండు ఇన్‌లెట్‌లు నిర్మించాం. ఈ ఏడాది దువ్వ, వరిగేడు గ్రామాల్లోని నాలుగు ఇన్‌లెట్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి వీటి నిర్మాణం పూర్తి చేస్తాం.

– మైపాల నాగేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షుడు, దువ్వ

పశ్చిమన 8 పనులకు..

ఎర్రకాలువ కుడి గట్టున(పశ్చిమ) ఆరుళ్ల, కోనాల, ముద్దాపురం గ్రామాల పరిధిలో శిథి లావస్థకు చేరిన ఎనిమిది ఇన్‌లెట్‌, అవుట్‌ లెట్‌ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపిం చాం. ఒక్కో ఇన్‌ లెట్‌ నిర్మాణానికి రూ.45 లక్షల చొప్పున మంజూరయ్యాయి. నిధులు విడుదల కాగానే పనులు చేపడతాం.

– కిరణ్‌, ఇరిగేషన్‌ ఏఈ, తాడేపల్లిగూడెం

తూర్పున 4 పనులకు..

ఎర్రకాలువ ఎడమ(తూర్పున) వైపు దువ్వలో 2, వరిగేడులో 2 ఇన్‌లెట్‌ల నిర్మాణాలకు ఒక్కో నిర్మాణానికి రూ.45 లక్షల చొప్పున మంజూరయ్యాయి. గతంలో ఇదే గుట్టున ఉన్న 2 ఇన్‌లెట్‌ అవుట్‌లను రూ.70 లక్షలతో పునర్నిర్మాణం చేపట్టి పూర్తి చేసి ప్రారంభించాం. ఈ వేసవిలో నాలుగు పనులు పూర్తి చేస్తాం.

–హరికిషన్‌, ఇరిగేషన్‌ ఏఈ తణుకు

Updated Date - Feb 13 , 2026 | 12:34 AM