Share News

గోదావడి.. వడిగా..

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:57 AM

గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువున తగ్గుతుండగా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెరుగుతోంది.

గోదావడి.. వడిగా..
కుక్కునూరు గ్రామ శివారులో పోటెత్తిన గోదావరి వరద

గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువున తగ్గుతుండగా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెరుగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను, అర్ధరాత్రి 12.15 గంటలకు 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం ఉదయానికి 54.8 అడుగులు, మధ్యాహ్నం 12 గంటలకు 56.10, సాయంత్రం ఐదు గంటలకు 57.50 అడుగులకు చేరి, రాత్రి 11 గంటలకు 53.10 అడుగులకు తగ్గింది. ఇక నరసాపురం వశిష్ఠకు నాలుగు లక్షల క్యూసెక్కులు వరద నీరు వచ్చింది. ఈ ఉధృతికి ఏడు స్లూయిస్‌లు మూసివేశారు. యలమంచిలి మండలం

కనకాయలంక కాజ్‌వే నీట మునిగింది. అధికారులు అప్రమత్తమయ్యారు.

వేలేరుపాడు/కుక్కునూరు/పోలవరం, ఆగస్టు 1(ఆంధ్ర జ్యోతి):భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినప్పటికి అక్కడ నుంచి వచ్చే వరద మొత్తం వేలేరుపాడు, కుక్కు నూరు మండలాలకు చేరుకోవడంతో 28 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడులో వరద నీరు ప్రవేశించడంతో ఇళ్లను ఖాళీ చేశారు. వరద చుట్టుముట్టిన గ్రామాలకు పడవలు, లాంచీల ద్వారా నిత్యావసర సరుకులు, కూరగాయలు, తాగునీరు, కొవ్వొత్తులు పంపిణీ చేశారు.

నీట మునిగిన రహదారులు

కుక్కునూరు నుంచి భద్రాచలం వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి వెంకటాపురం వద్ద పాములేరువాగు వద్ద రహదారి నీటమునిగింది. వేలేరు–బూర్గంపాడు మధ్య రోడ్డు నీట మునగడంతో కుక్కునూరు–భద్రాచలం వైపు వెళ్లే మార్గం మూసుకుపోయింది. సీతారామనగరం పంచాయతీరాజ్‌ రహదారి నీట మున గడంతో గ్రామానికి రాక పోకలు నిలిచి పోయా యి. కుక్కునూరు నుంచి కొండేటివాగు వైపు గోదా వరి వరద ముంచెత్తడం తో ప్రజలు అటువైపు వెళ్లకుండా పహారా కాస్తున్నారు. గొమ్ము గూడెం చుట్టూ గోదావరి వరద ముంచె త్తింది. ఆ గ్రామం నుంచి ఉదయం వరకు దాచారం పునరా వాస కాలనీకి ట్రాక్టర్లపై తరలి వచ్చారు. ఇంకా పదుల సంఖ్య లోనే గ్రామస్థులు గ్రామంలోనే ఉండిపోయారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వారిని బోటు ద్వారా ఇవతల వైపునకు తీసుకురావాలని నిర్ణయించారు. దాచారం పునరావాస కాల నీకి ఇప్పటి వరకు తరలివచ్చిన నిర్వాసితులకు తాగునీరు, విద్యుత్‌, ఇతర అవసరాలను, సౌకర్యాలను అధికారులు ఏర్పా టు చేస్తున్నారు.

కలెక్టర్‌, ఎస్పీ పర్యటన

ముంపు మండలాల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రేపాకగొమ్ము, రుద్రమ్మకోటల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. కూరగాయలు, నిత్యావసరాలు, టార్ఫాలిన్‌లను పంపిణీచేశారు. ముంపు మండలాల్లో కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ పర్యటించి పోలీస్‌ సిబ్బందిని, స్టేట్‌ డిజా ర్టర్‌ మేనేజ్మెంట్‌ అధికారులను అప్రమత్తం చేశారు. శుక్ర వారం రాత్రి నుంచి ఎస్పీ రేపాకగొమ్ము, తాట్కూరుగొమ్ముల్లో పర్యటించి ముంపు బాధితులను ఖాళీ చేయించేలా చర్యలు తీసుకున్నారు. నాటు పడవపై ప్రయాణించి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించారు. డీఎస్పీ జయకృష్ణ, బాల సురేశ్‌బాబు, ఎస్సై నవీన్‌కుమార్‌ ఉన్నారు. వేలేరుపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో జేసీ డాక్టర్‌ అభిషేక్‌గౌడ, ఎస్పీ ప్రతాప్‌శివకిశోర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి సమా వేశమై వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

వశిష్ఠకు నాలుగు లక్షల క్యూసెక్కులు

పశ్చిమ గోదావరిలో వశిష్ఠ గోదావరికి గంట గంటకు వరదపోటు పెరుగుతోంది. ఎగువ నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచి పెడుతుండటంతో ఆ ప్రభావం వశిష్ఠపై పడింది. శనివారం సాయంత్రానికి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో నరసాపురం వద్ద గోదావరి నిండుకుండను తలపిస్తోంది. రేవుల్లో స్నానాలకు అనుమతించడం లేదు. రెండో రోజు నరసాపురం – సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృత తీవ్రంగా ఉండటంతో గోదావరిలో వేటాడే సంప్రదాయ బోట్లన్ని ఒడ్డుకు చేరాయి.

ఏడు స్లూయిస్‌లు మూసివేత

ఎగువ నుంచి మరింత వరద నీరు చేరే అవకాశం ఉండటంతో అఽధికారులు అప్రమత్తమ య్యారు. పట్టణం నుంచి బియ్యపుతిప్ప వరకు ఉన్న ఏడు స్లూయిస్‌ తలుపులను మూసివేశారు. ఇటు గట్లు బలహీనంగా వున్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పరుస్తున్నారు. లాకుల వద్ద వున్న ఏటిగట్టుల శాఖ కార్యాలయం వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు. ఆర్డీవో దాసిరాజు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మాధవాయిపాలెం రేవులో పడవులు తిరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ సుధాకర్‌బాబు, సీఐ రఘు తనిఖీ చేస్తున్నారు.

మునిగిన కనకాయలంక కాజ్‌ వే

యలమంచిలి మండలంలోని కనకాయలంక కాజ్‌వే శనివారం నీటమునిగింది. శనివారం సాయంత్రానికి కాజ్‌ వేపై రెండడుగుల వరద నీరు ప్రవహిస్తోంది. స్థానికులు పడవల్లో ప్రయాణిస్తున్నారు. బాడవ, చించినాడ, యలమంచిలి, లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల గ్రామాల్లో పుష్కనఘాట్‌లు నీట మునుగుతున్నాయి.

Updated Date - Aug 02 , 2026 | 12:57 AM