జిల్లా ప్రగతిపై ఎమ్మెల్యేలతో కార్యాచరణ
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:35 AM
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులంతా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై సీఎంకు నివేదిక
జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులంతా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో కలసి కలెక్టర్ ఆయన సమీక్షించారు. వ్యవసాయం, ఉద్యాన, పారిశ్రామిక ప్రగతిపై ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. పెండింగ్ పనులకు నిధులపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక రూపొందించి సీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
ఏలూరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులంతా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన పంటల అభివృద్ధిలో ఐదో స్థానంలో ఉన్న జిల్లాను మూడో స్థానంలో నిలిపామని, జిల్లాలో టెంపుల్ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధిపై ఒక సమగ్ర నివేదికను సిద్ధంచేసి సీఎం చంద్రబాబుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను గాడిన పెట్టేందుకు నిధుల లభ్యతపై చర్చించామన్నారు. ఏలూరు నగరంలో వేసవిలో పారిశుధ్య పనులను చేపట్టేందుకు ప్రత్యేకంగా 50 మందిని నియమిస్తామన్నారు.
వేసవిలో తాగునీటి కొరత నివారణ చర్యలతో పాటు జల్‌జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్లు, అన్న క్యాంటీన్లు నిర్వహణ, పెన్షన్ నమోదు, పాఠశాలలు, వసతిగృహాల్లో మెరుగైన వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులతో చర్చించినట్లు మనోహర్ తెలిపారు. సాగునీటికి సంబంధించి పంట కాల్వ లు మరమ్మతులు, నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. పాపికొండల ప్రాంతంలో రోడ్లు, ఐఎస్ జగన్నాథ పురం లక్ష్మీనరసింహాస్వామి ఆలయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. రిజర్వ్ ఫారెస్టు భూమల అభివృద్ధితో పాటు కోకో సిటీ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు భూసేకరణ, ఉపాధి కల్పనకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు.
పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేసేవారిపై 6ఏ కేసుల నమోదు చేస్తున్నామని, ఎక్కువసార్లు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టును ప్రయోగిస్తున్నామని మనోహర్ తెలిపారు. గ్యాస్ కొరత ఎక్కడా లేదని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో వంటనూనెలు, టీ పొడుల కల్తీపై స్పందిస్తూ వాస్తవంగా వైద్యశాఖ నుంచి లీగల్ మెట్రాలజీకి తనిఖీ బాధ్యతలు బదలాయించామన్నారు. 59 పుడ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామన్నారు. దివ్యాంగుల పింఛన్ల మంజూరుకు సదరం క్యాంపులను నియోజకవర్గస్థాయిలోనే నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ మందల రవి, విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వడ్డీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
పింఛన్ల మంజూరు, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పింఛన్ల మంజూరు, ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టరేట్‌లో నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్ వెట్రి సెల్వి జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. అభివృద్ధి అంశాలపై నివేదిక సిద్ధం చేయాలని నాదెండ్ల సూచించారు.
ఏలూరు నియోజకవర్గంలో సమస్యలపై బడేటి రాధా కృష్ణయ్య మాట్లాడుతూ డిగ్రీ కళాశాలకు భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని, విలీనగ్రామాలకు ఉపాధి హామీ పథకం వర్తించే అవకాశం లేనందున ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయాలని, శనివారపుపేట కాజ్‌వే వద్ద ప్లై ఓవర్ నిర్మాణానికి వేసవిలో టెండర్లు పూర్తి చేయాలని, ఏలూరు ఆశ్రం నుంచి మాదేపల్లి మీదుగా మినీ బైపాస్ విస్తరణ పరిశీలించాలని కోరారు.
కైకలూరు నియోజక వర్గంలో చావలిపాడు వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు, గృహ నిర్మాణాలకు కేటాయించిన స్థలాలు మెరక చేయించాలని, జల్‌జీవన్ పథకం మైక్రో పిల్టర్లుకు నిధులు ప్రతీ గ్రామానికి ఇవ్వాలని, కోరుకల్లు, సింగరాయపాలెం వద్ద వంతెనల నిర్మాణం చేపట్టాలని కామినేని శ్రీనివాస్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కూడా ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రెయిన్లు అభివృద్ది చేయాలని కోరారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జల్‌జీవన్ మిషన్ కింద నియోజకవర్గంలో మంచినీటి సౌకర్యాలకు రూ.250 కోట్లు అవసరమని, పోలవరం కుడికాల్వ నుంచి న్యాయంపల్లి ఎత్తిపోతల పథకానికి నీరిచ్చేందుకు 100 కోట్ల నిధులు మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పలు అభివృద్ధి పనులు ప్రస్తావించారు.