నిఘా నీడలో..
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:12 AM
ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, తదితర వైద్య విద్య కోర్సులు, బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఆదివారం జరగనున్న నీట్–యూజీ పునఃపరీక్ష నిర్వహణకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరులో 12 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు గేట్లు క్లోజ్.. 2 గంటల నుంచి సాయంత్రం 5.15 వరకు పరీక్ష
ఏలూరు అర్బన్/ ఏలూరు క్రైం/దెందులూరు/తాడేపల్లిగూడెం రూరల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, తదితర వైద్య విద్య కోర్సులు, బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఆదివారం జరగనున్న నీట్–యూజీ పునఃపరీక్ష నిర్వహణకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏలూరు జిల్లాలోని ఏలూరు సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో 312 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 288 మంది, కస్తూర్బా నగర పాలక బాలికోన్నత పాఠశాలలో 288 మంది, గాంధీనగర్ నగర పాలకో న్నత పాఠశాలలో 240 మంది, దెందులూరు మండలం గోపన్నపాలెం కేంద్రీయ విద్యాలయంలో 354 మంది, గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 192 మంది కలిపి మొత్తం 1,674 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు నీట్–యూజీ జిల్లా నోడల్ ఆఫీసర్ భూర్‌సింగ్ మీనా పేర్కొన్నారు. పశ్చిమలోని భీమవరం డీఎన్‌ఆర్ కళాశాలలో రెండు కేంద్రాల్లో 1154 మంది, తణుకు బాయిస్, గరల్స్ హైస్కూల్స్‌లోని రెండు కేంద్రాల్లో 656 మంది, తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ఆవరణలోని రెండు కేంద్రాల్లో 673 మంది కలిపి మొత్తం 2,483 మంది పరీక్షలకు హాజరు కానున్నట్టు ఎన్‌టీఏ జిల్లా నోడల్ ఆఫీసర్ నక్కా జయరాం వెల్లడించారు.
నిబంధనలు కఠినతరం
ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒంటి గంటన్నరకు ప్రధాన ప్రవేశ ద్వారాలను మూసివేస్తారు. 24 మంది విద్యార్థులకు ఒక గది కేటాయించారు. ప్రతీ 12 మందికి ఒక ఇన్విజిలేటర్, ప్రతీ సెంటర్‌కు ఇద్దరు అబ్జర్వర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరేసి చొప్పున సీఆర్‌పీఎఫ్ భద్రతా సిబ్బందితోపాటు, స్థానిక పోలీసులు పహారా కాస్తారు. పరీక్ష కేంద్రాల నుంచి వంద మీటర్ల పరిధిలో ఎవరూ గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఎన్టీఏ జారీచేసిన అడ్మిట్ కార్డుల్లో ముద్రించిన సూచనలను అభ్యర్థులు పాటించాలి. అడ్మిట్ కార్డుతోపాటు, ఏదైనా ఫొటో ఐడీ కార్డును అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పెన్నులు, డిజిటల్ వస్తువులు, చేతి గడియారాలు తీసుకు రాకూడదు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రత్యేక హెల్ప్‌లైన్ డెస్క్‌ను ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాలకు చేరుకునే క్రమంలో అభ్యర్థులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్ల పరిశీలన
ఏలూరులో పరీక్ష జరిగే నాలుగు కేంద్రాలను కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిశోర్, తదితరులు సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. నీట్ పరీక్ష సజావుగా పారదర్శంగా జరిగేలా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష జరిగే సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా, నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పరీక్షకు సంబంధించి ఏదైనా చిన్నపాటి ఘటన లేదా అనుమానాస్పద సమాచారం వున్నా 112కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబరు 83329 59175, పోలీస్ వాట్సాప్ నంబరు 95503 51100లకు తెలపాలని కోరారు. నకిలీ గుర్తింపు కార్డులు, ఫోటోలతో ఒకరి తరఫున వేరొకరు పరీక్షరాసేందుకు వచ్చినట్టు తనిఖీల్లో గుర్తిస్తే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసు దర్యాప్తు చేస్తారని కలెక్టర్ హెచ్చరించారు. కాగా పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల గురించి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గోపన్నపాలెంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేంద్రీయ విద్యాలయ రెండు చోట్ల నిట్ పరీక్షలను డీపీవో మల్లికార్జునరావు తహసీల్దార్ సుమతి, ఎంపీడీవో వీరప్రతాప్, దెందులూరు ఎస్‌ఐ డి.వెంకట కుమార్‌లతో కలిసి శనివారం పరిశీలించారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు
నీట్–యూజీ పరీక్షను సజావుగా నిర్వహించే క్రమంలో ఏలూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ వై.వి.లక్ష్మీకుమారి నేతృత్వంలో నిర్వహించే కంట్రోల్ రూమ్ నంబర్లు 94910 41433, 81432 38754, 99899 06424, 91105 14516, 93466 55299, 99638 06596లకు పరీక్షకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా ఇవ్వవచ్చు.