Share News

అదనపు బాధ్యత

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:22 AM

గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యనందించాలనే ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సాధారణ విద్య కూడా అందించలేని దుస్థితిలో ఉంది.

అదనపు బాధ్యత

ఆర్‌జీయూకేటీలో అంతా ఇన్‌చార్జిలే..!

పూర్తిస్థాయి ఉద్యోగులు అత్యల్పం

కాంట్రాక్ట్‌ సిబ్బందిపై ‘ఇన్‌చార్జి’ భారం

ఒకవైపు బోధన మరోవైపు పాలనా విధులు

నాణ్యమైన విద్య అందేదెలా?

విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం

గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యనందించాలనే ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సాధారణ విద్య కూడా అందించలేని దుస్థితిలో ఉంది. యూనివర్సిటీ చాన్సలర్‌ నుంచి ప్రధాన విభాగాల్లో అదనపు బాధ్యతలు మోస్తున్న వారే అధికం. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అదనపు బాధ్యతలు మోయడం యూనివర్సిటీ విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్యాంపస్‌లలో పూర్తిస్థాయి సిబ్బంది అత్యల్పం కాగా వారు కూడా అదనపు బాధ్యతలు వద్దని గగ్గోలు పెడుతున్నారు. ఉత్తమ సాంకేతిక విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటైన యూనివర్సిటీపై పాలకులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

(నూజివీడు టౌన్‌ – ఆంధ్రజ్యోతి)

గ్రామీణస్థాయి విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) ఏర్పాటైంది. జీవో నెంబర్‌ 18 ద్వారా 2008లో ఏర్పాటైన సంస్థలో రెగ్యులర్‌ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో మెంటార్లు, అనంతరం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్లను నియమించారు. ఆర్‌జీయూకేటీ పరిధిలో నూజివీడు, ఆర్కే వ్యాలీ, బాసర క్యాంపస్‌లను పర్యవేక్షించేందుకు చాన్సలర్‌గా గవర్నర్‌కు బదులు ప్రభుత్వం ప్రత్యేకంగా చాన్సలర్‌ను ఏర్పాటుచేసింది. యూనివర్సిటీ ఏర్పడి న తొలినాళ్లలో చాన్సలర్‌, డైరెక్టర్లు అందరూ పూర్తిగా అదనపు బాధ్యతలతోనే నియమితులయ్యారు. 18 ఏళ్ల తర్వాత కూడా యూనివర్సిటీ బాలారిష్టాలను దాటలేదు. రాష్ట్ర విభజన నేప థ్యంలో బాసర క్యాంపస్‌ తెలంగాణకు వెళ్లిపోగా నవ్యాంధ్రలో ట్రిపుల్‌ ఐటీలలో సీట్ల సంఖ్య పెంచాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. సీట్ల సంఖ్య పెంపునకు బదులు ఒంగోలు, శ్రీకాకుళం లో మరో రెండు క్యాంపస్‌లను ఏర్పాటుచేస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాల కల్పన జరిగే వరకు ఒంగోలు క్యాంపస్‌ను ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం క్యాంపస్‌ను నూజివీడులో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకు న్నారు. తదనంతరం బాధ్యతలు స్వీకరించిన వైసీపీ ప్రభుత్వం ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌ల ఏర్పాటు దిశగా అడుగులు వేసినా పాక్షికంగా తరలించారు.

యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్‌ బోధన సిబ్బంది పాక్షికం. నేటికి కీలక స్థానాల్లో కాంట్రాక్ట్‌ విధానంలో నియమితులైన వారే ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ క్యాంపస్‌లో కీలక మైన ఫైనాన్స్‌ ఆఫీసర్‌, పరిపాలన అధికారి, ఎగ్జామినేషన్‌ సెల్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సెల్‌, డీఎస్‌డబ్ల్యూవో, సెక్యూరిటీ చైర్మన్‌, పీఆర్వో, మెస్‌ ఇన్‌చార్జి, వార్డెన్‌ బాధ్యతల్లో స్థానికంగా ఉన్న బోధన సిబ్బంది అదనపు భారం మోస్తున్నారు. బోధన పై దృష్టి పెట్టాలా లేక అదనపు బాధ్యతలపై దృష్టి పెట్టాలో తెలియని పరిస్ధితి నెలకొంది. రెండేల్ల క్రితం యూనివర్సిటీ యాజమాన్యం తమపై పని ఒత్తిడి పెంచుతుంది తప్ప వేతన పెంపు, అదనపు వేతనం లేకుండా అదనపు భారం మోపుతున్నారని, అదనపు బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలుకుతామని సిబ్బంది లేఖలు సమర్పించారు.

ఉద్యోగులు యూనివర్సిటీకి భారమా?

యూనివర్సిటీ పరిధిలో క్యాంపస్‌కు 25 మంది చొప్పున కీలక అధికారులు లేకుండా కేవలం అదనపు బాధ్యతలతో ప్రపంచస్థాయి ఉత్తమ విద్య అందించడం ఎలాగనేది పాలకులే చెప్పాలి. సెంట్రల్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌, తదితర పోస్టులతో పాటు వార్డెన్‌ కూడా లేకుండా క్యాంపస్‌ నిర్వహణ ఎలా సాధ్యమనేది పాలకులు గుర్తించాలి. వేతనాలకు పైసా విదల్చకుండా అదనపు బాధ్యతలో యూనివర్సిటీని లాగడం ద్వారా విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెతుతున్నాయి.

చాన్సలర్‌, వీసీ కూడా అదనం

యూనివర్సిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉన్నతా ధికారులు సైతం అదనపు బాధ్యతలు మోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ మధుమూర్తి ఆర్జీయూకేటి చాన్సలర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైస్‌ చాన్సలర్‌ మద్దాలి లక్ష్మీనారాయణరావు నూజివీడు క్యాంపస్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిసున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ అమరేంద్ర కుమార్‌ ఒంగోలు క్యాంపస్‌ డైరెక్టర్‌గా, అడ్మిషన్స్‌ కన్వీనర్‌గా ఇచ్‌చార్జి బాధ్యతలు నిర్వరిస్తున్నారు. బోధనా బాధ్యతలు కూడా నిర్వర్తించవలసి ఉంది.

నిర్వహణ అస్తవ్యస్తం

యూనివర్సిటీ పరిధిలోని అన్ని క్యాంపస్‌లలో ‘అదనపు’ అధికారులు విధి నిర్వహణలో పూర్తిస్థాయి దృష్టి సారించ లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తమైంది. గత ఏడాది మెస్‌లలో ఆహార నాణ్యత, మాంసాహారం, కోడిగుడ్డు అందిం చడంలో సమస్యలతో తీవ్ర విమర్శలు వచ్చాయి. పీయూసీ విద్యార్థులకు పాఠ్యప్తుకాలు, లాప్‌టాప్‌లు, యూనిఫామ్‌ పంపిణీలో సమ స్యలు తప్పలేదు. ఇటీవల సెక్యూరిటీ గార్డు, సూపర్‌వైజర్ల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. దానిని నియంత్రించడంలో నూజివీడు క్యాంపస్‌ డైరెక్టర్‌ వైఫల్యం, తదితర సమస్యలకు కారణం ఇన్‌చార్జిల పాలన అని సిబ్బంది, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీ పరిధిలో ఇన్‌చార్జిల పాలనలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న గవర్నమెంట్‌ కౌన్సిల్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి. జీవో 18 సవరించి ఆర్జీయూకేటీని సైతం గవర్నర్‌ పరిధిలోకి (ఇతర యూనివర్సిటీల మాదిరి) తీసుకురావడం తో పాటు కీలక స్థానాలో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలని విద్యావంతులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:22 AM