ఇనుప ఖనిజం తవ్వకాలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:15 AM
కుక్కునూరు మండలం ఉప్పేరు పంచాయ తీలోని రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో మరో సారి అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాల వ్యవ హారం కలకలం రేపుతున్నది.
తరలింపునకు రంగం సిద్ధం..
రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో ఇనుప ఖనిజంపై అక్రమార్కుల కన్ను
కుక్కునూరు మండలం ఉప్పేరు పంచాయ తీలోని రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో మరో సారి అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాల వ్యవ హారం కలకలం రేపుతున్నది. ప్రభుత్వ అను మతులు లేకుండానే కొందరు వ్యక్తులు అడవి లో ఇనుప ఖనిజం తవ్వి లారీల ద్వారా తరలి ంచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఖనిజం నింపుకోవడానికి వచ్చిన లారీ అడవి మార్గంలో దిగబడటంతో అక్రమ రవాణా యత్నం తాత్కాలికంగా విఫలమైన ట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇనుప ఖనిజం తరలించే ప్రయత్నం చేసిన సంఘటనలు జరిగాయి.
కుక్కునూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కుక్కునూరు మండలంలోని రెడ్డిగూడెం గిరిజన గ్రామానికి దాదాపు 4కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టని స్థానికులు బల్లలగట్టు, ఇనుపగుండు గుట్టగా పిలుస్తారు. దాదాపు 10కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గుట్ట ఉంటుంది. ఈ గుట్టలో ఏ రాయిని పట్టుకుని చూసినా అత్యంత బరువుతో ఉక్కురాయిలా ఉంటుంది. ఈ గుట్టపై లభించే ఇనుప ఖనిజం అత్యంత నాణ్యత, సాంద్రత గల సామర్థ్యం గల ఖనిజంగా చెబుతారు. ఈ క్రమంలో 2, 3 సంవత్సరాలకు ఎవరో ఒకరు ఈ ఇనుప ఖనిజంపై దృష్టి పెట్టి అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
రీసెర్చ్ బృందాల పరిశీలన
రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలోని బల్లల గుట్టపై లభ్యమవుతున్న ఇనుపఖనిజంపై అనేక రీసెర్చ్ బృందాలు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించారు. వాటిని ల్యాబ్‌లలో పరిశోధన జరిపారు. చెన్నైలోని ఇంధిరాగాంధీ ఆటమిక్ రిసెర్చ్‌సెంటర్ బృందం సైతం పరిశోధన జరి పింది. అణువిద్యుత్ కేంద్రాల్లో రియాక్టర్లను భద్రపరిచేందుకు 4అడుగుల మందాన్ని కలిగిన బాక్సులు తయారు చేస్తారు. దానికి ఈ ఇనుప ఖనిజం వాడతారు. ఇక్కడ లభ్యమ వుతున్న ఇనుప ఖనిజానికి ఆ సామర్థ్యం ఉందని ఆ బృందం స్పష్టం చేసింది. అలాగే మైనింగ్ శాఖ కూడా ఏ గ్రేడ్ ఇనుప ఖనిజం కంటే పాతికరెట్లు సామర్థ్యం ఉన్న ఇనుప ఖనిజం ఇక్కడ ఉందని గుర్తించారు. ఇది ఇలా ఉండగా విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి సరుకు కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం కొన్ని ప్రాంతాలను గుర్తించింది. రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో దొరికే ఇనుప ఖనిజాన్ని ముడిసరుకుగా తరలించాలని ప్రతిపాదనలు కూడా చేసింది. అయితే ఆ తరువాత ఏమైం దో కానీ ఆ ప్రయత్నం ఆగిపోయింది. బ్రిటీష్ కాలంలో సైతం ఇక్కడ నుంచి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించినట్లు స్థాని కులు చెబుతారు. అటవీ ప్రాంతం నుంచి గోదావరి పరీవాహక ప్రాంతానికి ఇనుప ఖనిజం తీసుకొచ్చి అనంతరం పడవల ద్వారా ఆ ఇనుప ఖనిజాన్ని తరలించారని చెబుతారు. ఇప్పటికి ఉప్పేరు గోదావరి తీర ప్రాంతంలో కొన్ని టన్నుల ఇనుప ఖనిజం వదిలి వెళ్లిన ఆనవాళ్లు కనబడుతున్నాయి.
అక్రమార్కుల కన్ను
ఇనుప ఖనిజంపై అక్రమార్కుల కన్ను కొన్నినెలల క్రితమేపడింది. తెలంగాణలోని భద్రాచలం, విశాఖపట్నంకు చెందిన కొందరు వ్యక్తులు ప్రస్తుతం ఇనుప ఖనిజం తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతం కావడం, ఎవరి పర్యవేక్షణ లేకపో వడంతో గుట్టను తవ్వి ఇనుప ఖనిజాన్ని లారీల ద్వారా తరలించే ప్రయత్నాలు జరుగు తున్నాయి. రాత్రిపూట జరుగుతున్న ఈ వ్యవహారంపై సంబంధిత శాఖాధికారులు దృష్టిపెట్టి కోట్ల విలువైన ఖనిజ సంపదను కాపాడాల్సిన అవసరం ఉంది.