దర్యాప్తులో సాంకేతికతతో సత్వర న్యాయం
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:08 AM
సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత దర్యాప్తుతో బాధితులకు వేగవంతమైన న్యాయం అందిస్తూ నిందితులకు తగు శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు.
దర్యాప్తులో సాంకేతికతతో సత్వర న్యాయం
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్
ఏలూరు క్రైం, జూన్ 13(ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత దర్యాప్తుతో బాధితులకు వేగవంతమైన న్యాయం అందిస్తూ నిందితులకు తగు శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్ పోలీస్ శాఖ ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపును శనివారం కలెక్టరేట్‌లో ఏలూరు రేంజ్‌లో ఉన్న అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అశోక్‌కుమార్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఏఐ విని యోగం వల్ల త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయవచ్చునని అన్నారు. ఏఐ ఉపయోగించి వైట్ కాలర్ కేసుల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ తన మేధస్సుతో తయారు చేసిన ధర్మా యాప్ సత్ఫలితాలు ఇస్తోందని వివరించారు. ఎస్పీ కేపీఎస్ కిశోర్ మాట్లాడుతూ సాక్ష్యాలు ఏ విధంగా సేకరించాలి, ఛార్జి షీటును ఎలా దాఖలు చేయాలని అనే అంశాలను ఏఐతో విశ్లేషించడం వల్ల దర్యాప్తు ఖచ్చితత్వాన్ని సంతరించుకుంటుందని అన్నారు. ధర్మాయాప్ పోలీస్ విధి నిర్వహణలో ఏఐ ఆధారిత సహాయక వేదికగా పనిచేస్తుందన్నారు. కేసుల పరిష్కారంలో వేగం, సమర్ధవంతమైన పని తీరు వల్ల 2344 కేసుల వరకూ పరిష్క రించామన్నారు. ఏలూరు జిల్లాలో రూపొందించిన ప్రత్యేక ఏఐ టూల్స్‌ను అన్ని పోలీస్ స్టేషన్లలో అందించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు, ఐటి ఆర్‌ఎస్‌ఐ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.