ప్రజల భద్రతే ముఖ్యం
ABN , Publish Date - May 27 , 2026 | 12:44 AM
ప్రజల భద్రతే పరమావధిగా పోలీసులు పనిచేయాలని, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు.
ప్రజల భద్రతే ముఖ్యం : ఐజీ అశోక్‌కుమార్
భీమవరం క్రైం, మే 26 (ఆంధ్రజ్యోతి) : ప్రజల భద్రతే పరమావధిగా పోలీసులు పనిచేయాలని, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పుష్ఫగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యాలయ రికార్డుల నిర్వహణ, క్రమశిక్షణ, సిబ్బంది హాజరు, పరిపాలనాపరమైన ఫైళ్ల కదలికలు వంటి కీలక అంశాలపై సమీక్షించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాల గుర్తింపు, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. డీఎస్పీలు రఘువీర్ విష్ణు, ఎం.సుధాకరరావు, విశ్వనాథ్, సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.