ఎన్నికలకు పటిష్ఠ భద్రత
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:08 AM
ఏలూరు రేంజ్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు.
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్
క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
జంగారెడ్డిగూడెం క్రైం/ఏలూరు క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి):ఏలూరు రేంజ్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో, ఏలూరులో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్‌తో కలసి ఐజీ పరిశీలించారు. జంగారెడ్డిగూడెంలో పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలు, మార్కెట్ యార్డు, వేగవరం నోవా కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. భద్రతా చర్యలు, కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత తదితర అంశాలపై సిబ్బందితో సమీక్షించారు.జంగారెడ్డిగూడెం డివిజనల్ పోలీసు కార్యాలయంలో సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏలూరులోని చేపల తూము పోలింగ్ కేంద్రం, సీఆర్‌రెడ్డి కాలేజ్ స్ర్టాంగ్ రూమ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఆర్‌రెడ్డి కాలేజీలోని స్ర్టాంగ్ రూమ్‌లను సందర్శించి, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ, ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ రోజున సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. వారివెంట జంగారెడ్డిగూడెం, ఏలూరు డీఎస్పీలు వెంకటేశ్వర్లు, శ్రావణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు టూటౌన్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్, త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, పోలీసు అధికారులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.