Share News

మెడికల్‌ షాపు లైసెన్సు కోసం రూ.20 వేలు లంచం డిమాండ్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:41 AM

జంగారెడ్డిగూడెంలో మెడికల్‌ షాపు పెట్టుకోవాలని ఓ వ్యక్తి డ్రగ్‌ ఇన్‌స్సెక్టర్‌ను కలిస్తే రూ.20 వేలు లంచం అడిగాడు..

మెడికల్‌ షాపు లైసెన్సు కోసం రూ.20 వేలు లంచం డిమాండ్‌

డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, అతనికి సహాయం చేసిన వ్యక్తి అరెస్ట్‌

జంగారెడ్డిగూడెం,ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెంలో మెడికల్‌ షాపు పెట్టుకోవాలని ఓ వ్యక్తి డ్రగ్‌ ఇన్‌స్సెక్టర్‌ను కలిస్తే రూ.20 వేలు లంచం అడిగాడు.. బాధితుడి ఫిర్యాదు మేరకు జంగారెడ్డిగూడెం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కంపా సురేష్‌కుమార్‌, అతనికి సహాయం చేసిన స్థానిక మెడికల్‌ షాపు అసోసియేషన్‌ కోశాధికారి తడికమళ్ల శివరామకృష్ణను ఏసీబీ అధికారులు శుక్రవారం వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు తెలిపిన వివరాలివి..

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడుకు చెందిన అచ్యుత బాబా వెంకట దుర్గాసాయి అనే వ్యక్తి జంగారెడ్డిగూడెంలో శ్రీ సాయి మెడికల్‌ ఏజెన్సీస్‌ పేరుతో మెడికల్‌ షాపు పెట్టుకుందామని ఈనెల ఆరో తేదీన లైసెన్సు కోసం ఏలూరులోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ కార్యాలయానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్‌ తీసుకుని స్థానిక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కంపా సురేష్‌కుమార్‌ను కలవగా డాక్యుమెంట్స్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయించారు. అయితే రోజులు గడుస్తున్నా లైసెన్సు రాకపోవడంతో బాబా వెంకట దుర్గాసాయి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్‌ను కలవగా ‘లంచం ఇస్తేనే గాని నీ పని అవ్వదు’ అని చెప్పి స్థానిక మెడికల్‌ షాపు అసోసియేషన్‌ కోశాధికారి తడికమళ్ల శివరామకృష్ణను కలిస్తే లంచం ఎంత ఇవ్వాలో చెబుతాడని చెప్పాడు. దీంతో శివరామకృష్ణను కలవగా రూ.20 వేలు లంచం తనకు అందజేయాలన్నాడు. దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు. డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఫిర్యాదుదారుడు స్థానిక మురళీకృష్ణ మెడికల్‌ స్టోర్‌ వద్ద తడికమళ్ల శివరామకృష్ణకు రూ.20 వేలు నగదు ఇస్తుండగా ఏసీబీ అఽధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులు ఇద్దరిని రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:41 AM