మానవత్వం మరిచారు!
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:32 AM
కొట్లాట కేసులో తలకు దెబ్బతగిలి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రాగా వైద్యం చేసి సిటీ స్కాన్ రాశారు. మందులు, ఇంజక్షన్లు రాశారు.
విజయవాడ వెళ్లాలంటూ ఉచిత సలహా
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల తీరుపై విమర్శలు
ఏలూరు క్రైం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): కొట్లాట కేసులో తలకు దెబ్బతగిలి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రాగా వైద్యం చేసి సిటీ స్కాన్ రాశారు. మందులు, ఇంజక్షన్లు రాశారు. అయితే ఓపీ పేషెంటుగా ఇంటికి వెళ్ళిపోయిన తరువాత అతని పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి 108లో తీసుకొచ్చారు. అయితే అతడికి వైద్యం చేయడానికి వైద్యులు నిరాకరించారు. అసలే సెలవు రోజులు కావడంతో ఆసుపత్రిలో చేర్పించుకోలేదు. చివరకు వచ్చిన దారినే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శనివారం జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడ వైద్యులకు వార్నింగ్ ఇచ్చి పట్టుమని పది రోజులు గడవకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బాధితుడి వివరాల ప్రకారం.. హనుమాన్ జంక్షన్‌కు చెందిన పోగోలు మౌనీష్(37)కు ఒక ఘర్షణలో తలకు బలమైన గాయమైంది. ఈనెల 4న ఏలూరు ప్రభుత్వాసుపత్రి అత్యవసర విభాగానికి 108లో వచ్చారు. అత్యవసర విభాగపు వైద్యులు పరీక్షించి ఎనిమిది కుట్లు వేసి సిటీ స్కాన్, మందులు, ఇంజక్షన్లు రాశారు. అయితే ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోలేదు. సిటి స్కాన్ రిపోర్టు బట్టి ఆసుపత్రిలో చేరండంటూ సూచించారు. వైద్యులు సలహా మేరకు మౌనీష్‌ని ఇంటికి తీసుకెళ్లి వైద్యులు సూచించిన ఇంజక్షన్లు, మందులను వాడుతున్నారు. అయితే ఉన్నట్టు ఉండి వాంతులవడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యులు పరీక్షించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని సూచించడంతో శనివారం ఏలూరు ప్రభుత్వాసుపత్రి అత్య వసర విభాగానికి వచ్చారు. ఈనెల 4న తీయించుకున్న సిటీ స్కాన్ రిపోర్టును వైద్యులకు చూపించారు. న్యూరో సర్జన్‌కు చూపించాలని, 12ఏ రూమ్ నంబర్‌కు వెళ్లమన్నారు. తొలుత ఆపరేషన్ పడుతుందని చెప్పిన వైద్యులు ఆ తర్వాత అవసరం లేదని జనరల్ మెడిసన్, లేదా జనరల్ సర్జరీవారి ద్వారా వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ రెండు డిపార్టుమెంటు వైద్యుల వద్దకు వెళ్లగా వైద్యానికి నిరాకరించారు.
అత్యవసర విభాగానికి వెళ్తే విజయవాడ వెళ్లాలని సూచించారు. ఇలా ఉదయం 9 నుంచి సాయం త్రం 5 గంటల వరకు నరకం చూసిన మౌనీష్ అతని కుటుంబ సభ్యులు చివరకు ప్రైవేటు వైద్యం కోసం ఇంటికి వెళ్ళి పోయారు. అత్యవసర పరిస్థితిల్లో ఆస్పత్రికి వస్తే ఇలా ఇబ్బందులు పెట్టడంతో వైద్యానికి వచ్చిన వారు బిత్తర పోతున్నారు. ఈ ఘటనపై వివరణ కోరడానికి మెడికల్ సూపరింటెండెంట్ కోసం ప్రయత్నించగా ఆయన సెలవులో ఉన్నారని, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ వెల్లడించారు. న్యూరో వైద్యులు వైద్యం అందించాల్సి ఉందని, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటామంటూ వెల్లడించారు.