Share News

కొబ్బరిధరలు పైపైకి..

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:39 AM

కొబ్బరి ధర ఘనంగా పెరిగింది... దిగుబడి మాత్రం అథమస్థాయిలో ఉంది. ఇంకా ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

కొబ్బరిధరలు పైపైకి..
రిటైల్‌ మార్కెట్లో కొబ్బరి కాయ

కొబ్బరిధరలు పైపైకి..

ధర ఘనం.. దిగుబడి అథమం

నాలుగింట ఒక వంతుకు పడిన పంట

పాలకొల్లు/యలమంచిలి/ఆచంట/ద్వారకాతిరుమల, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): కొబ్బరి ధర ఘనంగా పెరిగింది... దిగుబడి మాత్రం అథమస్థాయిలో ఉంది. ఇంకా ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతువారీ వెయ్యి కాయల ధర గరిష్టంగా రూ.25వేలు పలుకుతోంది. రిటైల్‌ మార్కెట్లో కాయ ధర గరిష్టంగా రూ.40వరకు అమ్ముతున్నారు. కొబ్బరి దిగుబడి నాలుగింట ఒక వంతుకు పడిపోయింది. కొబ్బరి ధర పెరగడంతో ఆనందించాలో.. దిగుబడి గణనీయంగా తగ్గడంతో నిరాశ పడాలో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 2,000 కొబ్బరి కాయలు పడే రైతుకు నేడు 500 నుంచి 700 మాత్రమే దిగుబడి వస్తోంది. దీనికి ప్రధాన కారణం సుమారు పదినెలలుగా సరైన వర్షం పడకపోవడమేనని రైతులు చెబుతున్నారు. జూన్‌లో తొలకరి వానలు పడి.. జూలై, ఆగస్టు మాసాల్లో విస్తారమైన వర్షాలు పడటం పరిపాటి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జూన్‌లో తొలకరి వర్షం పడలేదు. జూలైలోనూ ఇంచుమించు అదే పరిస్థితి.. ప్రస్తుతం ఆగస్టులో వర్షపు జల్లులు పడుతున్నాయే తప్ప భారీ వర్షాలు పడలేదు. వర్షాలు పడితే కొబ్బరిచెట్టుకు వచ్చిన కచ్చు నిలబడి కాయలు తయారవుతాయని, సరైన వర్షాలు లేక కొబ్బరిచెట్టుకు కచ్చు నిలబడకపోవడంతో దిగుబడులు అథమస్థాయికి పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి దిగుబడి తగ్గిపోవడంతో ఎగుమతులకు సరిపడా కాయలు లేకపోవడంతో కొబ్బరి ధర అమాంతం పెరిగింది. దిగుబడి తగ్గినప్పటికీ, ధర పెరగడంతో రైతులు కొబ్బరిసాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కొద్దిపాటి వర్షాలు పడుతుండడంతో చెట్లకు ఎరువులు పెట్టడం, తోటల్లో కొబ్బరి మొక్కలు నాటి వాటిని సంరంక్షించేందుకు రైతాంగం ఆసక్తిని కనబరుస్తున్నారు. సాధారణంగా వినాయకచవితి, దసరా, దీపావళి, కార్తీకమాసం సీజన్లలో కొబ్బరికి డిమాండ్‌ ఉంటుంది. రానున్న మూడుమాసాల్లో కొబ్బరికి డిమాండ్‌ మరింత పెరిగి ధర రూ.30కు చేరే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

క్రమంగా పెరుగుతున్న ఎగుమతులు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 96,797 ఎకరాల్లో కొబ్బరిని సుమారు 34,227 మంది రైతులు సాగుచేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలుప్రాంతాలతో పాటు, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు కొబ్బరికాయలు ఎగమతులు అవుతాయి. ముఖ్యంగా కోనసీమ, పాలకొల్లు ప్రాంతాల నుంచి ప్రతీరోజూ సుమారు 70 నుంచి 90 లారీలు కొబ్బరికాయ ఎగుమతి అవుతాయి. గతంలో డిమాండ్‌ ఎక్కువగా ఉన్న కాలంలో 150లారీలకు పైబడి కొబ్బరికాయ ఎగుమతి అయ్యేవి. దిగుబడి తక్కువగా ఉండడంతో ప్రస్తుతం 100 లారీల కొబ్బరి ఎగుమతులు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు క్రమంగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.

ఫ ఉత్తరాది రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్న కొబ్బరికాయలు పాతకాయ ధర వెయ్యింటికీ రూ.26వేలు, ఢిల్లీ క్వాలిటీ ధర రూ.27వేలు, మహారాష్ట్రకు ఎగుమతయ్యే కాయ ధర రూ.22వేలు, నెంబరుకాయ(చిన్నవి) రూ.16వేలు ఉంది.

పుణ్యక్షేత్రాల్లో మహా డిమాండ్‌

శ్రావణమాసం రావడంతో పుణ్యక్షేత్రాల్లో టెంకాయలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఆకాశాన్నం టిన కొబ్బరి ధరలు వినియోగ దారులకు చుక్కలు చూపుతు న్నాయి. ప్రధానంగా ఆలయాల వద్ద కొబ్బరి కాయలను కొనుగోలు చేసే భక్తులు ఈ ధరలను చూసి బెంబేలెత్తుతున్నారు. రైతు వద్ద ముదురుకాయలు 22 నుండి 25 రూపాయలు కాగా నీటి బొండాం ధఽర 12 నుంచి 15 రూపాయలు పలుకుతోంది. అయితే ఆలయాల వద్ద ముదురుకాయలను రవాణా, ఒలుపు ఇతర ఖర్చులతో రూ. 40 నుంచి రూ.50 వరకూ సైజును బట్టి విక్రయిస్తున్నారు.

చేదెక్కుతున్న పంచదార

కిలో రూ.60.. అదేబాటలో బెల్లం

తాడేపల్లిగూడెం : పంచదార ధర ఆకాశాన్నం టింది. ఎన్నడూ లేనివిధంగా క్వింటా పంచదార హోల్‌సేల్‌ ధర రూ.5,800 నుంచి 5,900 మధ్య విక్రయిస్తున్నారు. ఇక రిటైలర్స్‌ కిలో రూ.60కు అమ్ముతున్నారు. బెల్లం ధర ఇదేవిధంగా పెరిగింది. రెండు నెలల కిందట క్వింటా పంచదార రూ.4,200 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.5,900కు చేరడం పట్ల సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు జనం పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని వినియోగిస్తున్నారు. దీని ధర కిలో బెల్లం రూ.70కు విక్రయి స్తున్నారు. బూరుగుపల్లి బెల్లం కిలో రూ.70కే విక్రయించడం కొసమెరుపు. బూరుగుపల్లి బెల్లానికి, సాధారణ రకం బెల్లానికి కిలోకు రూ.8 నుంచి రూ.10 వ్యత్యాసం ఉండేది. కాని ఇప్పుడు రెండు రకాల బెల్లాలు ఒకే ధరకు విక్రయిస్తున్నారు. పంచదార సాగువిస్తీర్ణం తగ్గడంతో పాటు విదేశాలకు ఎగుమతికి అనుమతి ఇవ్వడం ఒక కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాలసీ విధానంతో కూడా పంచదార ధర పెరిగిందని చెబుతు న్నారు. పంచదార ధరలను అదుపుచేసేది కేంద్రం కంట్రోల్లో ఉంటుదని, సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ధరలను అదుపు చేయాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.

మేమే కొనలేక పోతున్నాం

– మసిముక్కు గంగయ్య, వ్యాపారి, ద్వారకాతిరుమల

రైతు పొలాల్లో రూ. 22 వరకు కొనుగోలు చేస్తున్నాం. పెరిగిన రవాణా, ఒలుపు చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి రూ.35 నుంచి రూ.40 వరకు అమ్మాల్సివస్తోంది. లేకపోతే గిట్టుబాటు కావడం లేదు. లేత కాయలు ఉండడంతో ఈ ధరకు కొనేందుకు భక్తులు ఆలోచిస్తున్నారు. శని, ఆదివారాల్లోనే మంచి వ్యాపారం ఉంటోంది. మిగతా రోజుల్లో అంతంత మాత్రమే..

దిగుబడి తగ్గడంతో పెరిగిన డిమాండ్‌

– చివటపు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు, పాలకొల్లు కోకోనట్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌.

కొబ్బరి దిగుబడి తగ్గిపోవడంతో డిమాండ్‌ ఏర్పడి ధర పెరిగింది. ఎగుమతులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధరలు ఇదేవిధంగా నిలకడగా ఉంటే రైతులకు, వ్యాపారులతోపాటూ, కొబ్బరి కార్మికులకు మేలు జరుగుతుంది. దసరా, దీపావళి పండుగలకు ప్రతిఏటా కొబ్బరికి డిమాండ్‌ ఉంటుంది. కనీసం రెండు, మూడు నెలలు కొబ్బరి మార్కెట్‌ నిలకడగా ఉండే అవకాశం ఉంది.

Updated Date - Aug 20 , 2026 | 12:39 AM