Share News

43 కేంద్రాల్లో 540 మందికి..

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:07 AM

మహిళల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌) రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ 2030 నాటికి అందరికీ వేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయని కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే, పీఏసీ కమిటీ చైర్మన్‌ పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు.

43 కేంద్రాల్లో 540 మందికి..
భీమవరం ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ పరిశీలిస్తున్న కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు

బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన

కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం క్రైం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మహిళల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌) రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ 2030 నాటికి అందరికీ వేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయని కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే, పీఏసీ కమిటీ చైర్మన్‌ పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ టీకా మందు పంపిణీ సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. సోమవారం భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. జిల్లాలో 43 కేంద్రాల్లో 540 మందికి వ్యాక్సిన్లు వేసినట్టు ఆరోగ్య వర్గాలు తెలిపాయి. డీఎంహెచ్‌వో గీతాబాయి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లక్ష్మణ్‌ ఆనంద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అర్హత ఉన్న వారికే..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు, యూహెచ్‌సీలకు ఏలూరులో ఏర్పాటు చేసిన జిల్లా వ్యాక్సిన్‌ స్టోర్‌ (డీవీసీ) నుంచే పంపిణీ చేస్తున్నారు. తొలివిడతగా అందిన నిల్వల నుంచి ఏలూరు జిల్లాకు 7,427 డోసులు, పశ్చిమ గోదావరి జిల్లాకు 6,421 డోసులు అందజేశారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ దుర్వినియోగం లేదా అనర్హులకు వేయకుండా నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. 14 నిండి 15 ఏళ్ల వయసున్న బాలికలకు వ్యాక్సిన్‌ వేస్తారు. ఆ ప్రకారం బాలిక వయసును నిర్ధారించు కునేందుకు ఆధార్‌ కార్డుపై ముద్రితమైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించింది.

Updated Date - Mar 10 , 2026 | 12:07 AM