Share News

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వస్తోంది..

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:52 AM

గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌) టీకా మందు పంపిణీ జిల్లాలో మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వస్తోంది..

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నిరోధక చర్యలు

14 ఏళ్ల బాలికలకు ఉచితం.. వారంలో పంపిణీ

పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు

భీమవరంటౌన్‌, మార్చి1 (ఆంరఽధజ్యోతి) :గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌) టీకా మందు పంపిణీ జిల్లాలో మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది.సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణ కోసం 14 ఏళ్ల వయసు ఉన్నబాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేసేందుకు అర్హులను గుర్తించే పనిలో వైద్య ఆరోగ్యశాఖ అఽధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. శనివారం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాకు సంబందించి ఇంకా ఖరారు కాలేదని, ఎంతమంది 14 ఏళ్ల బాలికలు ఉన్నారనే దానిపై గ్రామాల వారీగా సర్వే చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రూ.3,927 వ్యాక్సిన్‌ ఉచితం

హెచ్‌పీవీ నుంచి రక్షణ కల్పించే గార్డాసిల్‌–4 వ్యాక్సిన్‌ ఒక డోసు ధర బహిరంగ మార్కెట్‌లో ధర రూ.3927. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. తొలివిడతగా జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, అర్బన్‌ పీహెచ్‌సీల్లో ఈ వ్యాక్సిన్‌ను 14 ఏళ్ల బాలికలకు అందజేయనున్నారు. జిల్లాలో 14 ఏళ్ల బాలికలు ఎంతమంది ఉన్నారో నిర్ధారించుకునేందుకు మూడు రోజులుగా సర్వే పూర్తిచేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఆధార్‌కార్డులో నమోదైన వయసు ప్రాతి పదికగా వ్యాక్సిన్‌కు అర్హుల సంఖ్యను గుర్తించారు.

పంపిణీకి మూడు నెలలు

జిల్లాలో 34 పీహెచ్‌సీలు, 18 అర్బన్‌ పీహెచ్‌సీ ఉన్నాయి. వీటిలో వ్యాక్సిన్‌ పంపిణీకి కోల్డ్‌చైన్‌ సౌకర్యాలున్న సెంటర్లను గుర్తించేందుకు వివరాలు సేకరిస్తున్నారు.ప్రభుత్వం వ్యాక్సిన్‌ను అందజేసిన వెంటనే గుర్తించిన (పీహెచ్‌సీ/ యూపీహెచ్‌సీ) నిర్దేశిత బాలికలకు టీకా మందు పంపిణీని ప్రారం భించనున్నారు. సర్వేలో గుర్తించిన బాలికలందరికీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడానికి మూడునెలల గడువును పెట్టుకున్నారు. ఆతర్వాత ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోని బాలికలు ఎవరైనాఉంటే రొటీన్‌ ఇమ్యు నైజేషన్‌ ప్రోగ్రాం కింద అంటే ప్రతీ బుధ, శనివారాల్లో టీకా మందు వేస్తారు. వ్యాక్సిన్‌ తీసుకున్న బాలికల వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే యువిన్‌ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

నాలుగు రకాల వైరస్‌ల నుంచి రక్షణ

సింగిల్‌ డోసుగా అందజేసే వ్యాక్సిన్‌ ప్రధానంగా నాలుగు రకాల హెచ్‌పీవీ వైరస్‌లైన టైప్‌–6, 11, 16, 18 నుంచి రక్షణ కల్పిస్తుందని వైద్య వర్గాలు వివరించాయి. సుమారు 70–80 శాతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు ఈ వైరస్‌లే కారణమవు తాయని పేర్కొన్నాయి. ఈ వ్యాక్సిన్‌ శరీరంలోకి ప్రవేశించి వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీ బాడీస్‌ను తయారు చేస్తుందని, భవిష్యత్‌లో క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుందని వైద్యులు వివరించారు.

భయం అవసరం లేదు

ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన సమర్ధవంతమైన రోగ నిరోధక టీకాగా గుర్తించారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ను 70 నుంచి 90 శాతం వరకు తగ్గించగలదని అనేక పరిశోధనల ద్వారా నిర్ధారణ అయింది. కొన్నిరకాల క్యాన్సర్‌లను కూడా నివారించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే వేస్తారు. 0.5 మిల్లీ మోతాదు ఇంజక్షన్‌ ఇస్తారు. కండరంలో ఎడమ భుజానికి చేస్తారు.కొంత మందిలో సూదివేసిన ప్రాంతంలో నొప్పి, ఎరుపు, వాపు, జ్వరం, తలనొప్పి, అలసట, వాంతులు, వంటి స్వల్ప లక్షణాలు ఉంటాయి. మూడు రోజుల్లో తగ్గిపోతాయి.

Updated Date - Mar 02 , 2026 | 12:52 AM