13,502 మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:21 AM
మహిళ ల్లో వేగంగా విస్తరిస్తోన్న గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్)క్యాన్సర్ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ టీకా మందును 14 ఏళ్ల బాలికలకు పంపిణీ చేసేందుకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
72 పీహెచ్‌సీలు/యూహెచ్‌సీలకు టీకా మందు నిల్వల పంపిణీ ప్రారంభం
ఏలూరు అర్బన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మహిళ ల్లో వేగంగా విస్తరిస్తోన్న గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్)క్యాన్సర్ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ టీకా మందును 14 ఏళ్ల బాలికలకు పంపిణీ చేసేందుకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా తొలివిడతగా జిల్లాకు 7,427 డోసుల గార్డాసిల్–4 వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పంపిణీ చేయగా, వీటిని జిల్లాలోని 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధేశిత వయసుగల బాలికలకు పంపిణీ చేసేందుకు వీలుగా కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబం ధించి అవసరమైన వ్యాక్సిన్‌ను ఏలూరు కేంద్రంగా పీహెచ్‌సీలు/యూహెచ్‌సీలకు పంపిణీని లాంఛనంగా శుక్రవారం ప్రారంభమైంది. రోజుకు రెండు రూట్లు చొప్పున ఉమ్మడి జిల్లా అంతటా టీకా మందు నిల్వల ను ప్లస్ 2 డిగ్రీల సెంటీ గ్రేడు స్థాయిలో పంపిణీచేసి, ప్లస్ 8 డిగ్రీల సెంటీగ్రేడ్ కోల్డ్ చెయిన్(సీసీ) సదుపాయం ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోని ఐఎల్‌ఆర్‌లో వీటిని భద్రపరచాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌కు మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశారు.
జిల్లాలో 13,502 మందికి టీకా పంపిణీ
సరైకల్ క్యాన్సర్ కారకమైన హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్)నుంచి రక్షణ కల్పించే గార్డాసిల్–4 టీకా మందు సింగిల్‌డోస్ ధర బహిరంగ మార్కెట్‌లో రూ.3927లుకాగా, దీనిని కేంద్రం బాలికలకు ఉచితంగా అందజేస్తారు. ఏలూరు జిల్లాలోని గ్రామ/వార్డు సచివా లయాల వద్దవున్న డేటా, పీహెచ్‌సీలు/ యూపీహెచ్‌ీ సల వారీగా వైద్య సిబ్బంది జరిపిన హెడ్ కౌంట్ డేటా ప్రకారం మొత్తం 13,502 మంది 14 ఏళ్ల బాలికలు న్నట్టు గుర్తించారు. వీరందరికీ సీసీ సదుపాయం ఉన్న 72 ప్రాథమిక/పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కరికి 0.5 ఎంఎల్ టీకా మందు వేయడానికి నలుగురు వైద్య బృందా లను పీహెచ్‌సీలు/యూహెచ్‌సీల వారీగా నియ మించారు. ఒక్కో టీం లో టీకా మందు వేయడానికి వ్యాక్సినేటర్ (ఏఎన్‌ఎం/ స్టాఫ్ నర్సు), ఆధార్ కార్డు సూపర్‌వైజ్ చేయడానికి వెరిఫయర్, బాలికలను టీకా మందు వేయించేందుకు తీసుకు రావడానికి ఆశా/అంగన్‌వాడీ వర్కర్, ఆరోగ్య కేంద్రం వద్ద వరుస క్రమం పాటించడానికి ఒక వలం టీర్ ఉంటారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు బాలిక తన తల్లిదండ్రు లతోసహా ఆరోగ్యకేంద్రానికి ఆధార్ కార్డుతోసహా రావాలి. నిర్ణీత ఫారంలో వివరాలను నింపిన తర్వాత వాటిని ఆధార్ కార్డుకు లింకైన ఫోన్ నంబరుతో యువిన్ పోర్టల్‌లో నమోదుచేసి ఆయుష్మాన్ భారత్ (అభా)ఐడీని ఇస్తారు. దీని ఆధారంగా బాలిక ఫోటోను నిర్ధారించుకుని టీకామందు వేస్తారు. ఆ వెంటనే వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా బాలికకు యువిన్ పోర్టల్‌లో సర్టిఫికెట్ జారీఅవుతుంది.
మంగళ లేదా బుధవారం నుంచి పంపిణీ
గార్డాసిల్–4 వ్యాక్సిన్ ప్రధానంగా 4 రకాల హెచ్‌పీవీ వైరస్‌ల (టైప్–6, 11, 16, 18)ల నుంచి రక్షణ కల్పిస్తుందని వైద్యవర్గాలు వివరించాయి. జిల్లా లోని 72 ఆరోగ్య కేంద్రాల్లో వచ్చే మంగళ లేదా బుధవారం హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించే అవకాశా లున్నాయి. బుధ, శనివారాల్లో చిన్నపిల్లలకు టీకా మందు పంపిణీ ఉన్నందున ఈ రెండు రోజుల్లో హెచ్ పీవీ వ్యాక్సినేషన్ ఉండదు. వరుసగా 90 రోజులపాటు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను నిర్ధేశిత బాలిక లందరికీ వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అప్పటికీ ఇంకా బాలికలెవరైనా టీకామందు వేయించు కోకపోతే వారిని రొటీన్ ఇమ్యునైజేషన్(ఆర్‌ఐ)లోచేర్చి సంబం ధిత రోజుల్లో వ్యాక్సిన్ వేస్తారు. వ్యాక్సిన్ వేయించు కున్న బాలికలు ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లకు గురికా లేదని నిర్దారించుకునేందుకు అరగంటపాటు ఆరోగ్య కేంద్రంలోనే ఉండాలి.
ఈ సూచనలు పాటించండి
–డాక్టర్ శోభ, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో
బాలికకు టీకా వేసేందుకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి తప్పనిసరి. ఆరోగ్య కేంద్రాలకు ఖాళీ కడుపుతో రావద్దు. చేతినొప్పి, స్వల్ప జ్వరం, వంటి చిన్నపాటి దుష్ప్రభావాలు తాత్కాలికంగా ఉండవచ్చు. జిల్లాలో 14 ఏళ్ల వయసున్న బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి.