Share News

ఇంకెన్నాళ్లో..

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:52 AM

భీమవరం గొల్లవానితిప్ప రోడ్డులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ఇంకెన్నాళ్లో..
భీమవరంలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనం

మూడేళ్లుగా నిర్మాణ పనులు

ఇప్పటికి 50 శాతం మాత్రమే పూర్తి

పూర్తయితే మెరుగైన

వైద్యసేవలు, సదుపాయాలు

8 మండలాల ప్రజలకు ప్రయోజనం

భీమవరం క్రైం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : భీమవరం గొల్లవానితిప్ప రోడ్డులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడేళ్లుగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణం కోసం సుమారు 8 మండలాల ప్రజలు వేచిచూస్తున్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే అన్ని రకాల వసతులు అందుబాటులోకి వస్తాయి. అత్యాధునిక వైద్యం చేరువవుతుంది. భీమవరం మండల ప్రజలే కాకుండా ఆకివీడు, కాళ్ళ, ఉండి, పాలకోడేరు, వీరవాసరం, మొగల్తూరు, కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలాలకు కూడా భీమవరం ఎంతో అనువుగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పాత ఆసుపత్రిలో 50 పడకలు అందుబాటులో ఉన్నాయి. సుమారు రోజుకు 250 మంది వరకు ఇక్కడ వైద్యం పొందుతున్నారు. 5 నుంచి 8 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. వంద పడకల ఆసుపత్రి పూర్తయితే వైద్యులతో పాటు మరిన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

రూ. 38 కోట్ల నిధులు

వంద పడకల ఆసుపత్రికి నాబార్డు నిధులు రూ. 10 కోట్లు మంజూరయ్యాయి. మరో రూ. 28 కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు రూ. 38 కోట్ల నిధులు ఆసుపత్రి నిర్మాణానికి వచ్చాయి. మొత్తం నాలుగు బ్లాక్‌లుగా నిర్మాణ పనులు చేస్తున్నప్పటికీ ఇప్పటికి రెండు బ్లాక్‌లు జీ+1 పూర్తయ్యాయి. ఇంకా రెండు బ్లాక్‌ల జీ+1 పూర్తికావలసి ఉంది. విద్యుత్‌ లెన్లు, టైల్స్‌, సీలింగ్‌ పనులు కూడా జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

వసతులు అందుబాటులో

భీమవరం శివారు సుమారు మూడు కిలో మీటర్లు దూరంలో ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. రహదారికి అర కిలోమీటర్‌ లోపలికి ఆసుపత్రి నిర్మాణం చేస్తూ ఉండటంతో కొంత మంది ఆసుపత్రి దూరమవుతుందని చెబుతున్నారు. కిడ్నీ రోగులకు డయాలసిస్‌ సెంటర్‌, అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు, ఎమర్జెన్సీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని కొందరు అంటున్నారు.భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రి ఎంతో అవసరమని చెబుతున్నారు.

ఇక్కడ.. వైద్యుల కొరత

భీమవరం ప్రభుత్వ ఏరియా పాత ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తూనే ఉంది. ఎప్పటి నుండో ఆర్థోపెడిక్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులను ఏలూరు, విజయవాడ, గుంటూరుకు రిఫర్‌ చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లల వైద్యులు కూడా పూర్తిస్థాయిలో లేరు. సుమారు 8 మండలాల ప్రజలతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ శాతం మంది భీమవరం ప్రభుత్వ ఆసుపత్రినే ఎంచుకుంటారు. అలాంటి ఆసుపత్రిలో వైద్య సేవలు అంతంత మాత్రంగా అందటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకం లేకపోవడంతో కొంత మేర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అయినప్పటికీ ఇప్పటి వరకు అభివృద్ధి కమిటీ ఊసే ఎత్తడం లేదు.

Updated Date - Feb 11 , 2026 | 12:52 AM