హాస్టల్స్‌కు రండి
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:17 AM
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధనతోపాటు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో వెనుకబడిన వారిపై దృష్టి పెట్టింది. ప్రణాళిక సబ్జెక్టులకు హాజరు కాని వారిని గుర్తించి విద్యాబోధన విధానంలో మార్పులపై విద్యా శాఖ అడుగులు వేస్తోం ది.
వెనుకబడిన టెన్త్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ
జిల్లాలో సక్రమంగా హాజరుకాని విద్యార్థులు 247 మంది గుర్తింపు
భీమవరం, నరసాపురం సబ్ డివిజన్‌ల వారీగా చేర్చే ఏర్పాటు
విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం.. వారి నిర్ణయం బట్టి నిర్ణయం
నూరు శాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయుల ప్రత్యేక బోధన
భీమవరం రూరల్, ఫిబ్రవరి 5(ఆంధ్ర జ్యోతి):పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధనతోపాటు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో వెనుకబడిన వారిపై దృష్టి పెట్టింది. ప్రణాళిక సబ్జెక్టులకు హాజరు కాని వారిని గుర్తించి విద్యాబోధన విధానంలో మార్పులపై విద్యా శాఖ అడుగులు వేస్తోం ది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 12,777 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సక్రమంగా హాజరు కాని 247 మంది విద్యార్థులను గుర్తించారు. నరసాపురం సబ్ డివిజన్‌లో 109 మంది, భీమవరం సబ్ డివిజన్‌లో 138 మంది ఆయా ప్రాంత సీజనల్ హాస్టల్స్‌లో చేర్పించి బోధించాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు గురువారం సమాచారం అందించారు. వారి నిర్ణయం బట్టి ఈ నెల 9న హాస్టల్స్‌కు పంపించనున్నారు. హాస్టల్స్‌లో భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయి. ఉపాధ్యాయులతో ప్రత్యేక విద్యాబోధన చేస్తారు. ఇలా చేయడం ద్వారా వారు ఉత్తీర్ణులు అవుతారని ప్రభుత్వం భావిస్తోంది.
100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. 2025–26 సంవత్సరం టెన్త్ విద్యార్థులపైన అయితే 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దానిలో వంద రోజుల ప్రణాళిక మార్పులు విద్యార్థులకు ఉత్తీర్ణతలో ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రతిరోజు విద్యాబోధన అయ్యాక ఆయా సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష వివరాలు యాప్‌లో పొందుపరచడం ద్వారా విద్యాశాఖకు ప్రభుత్వ విద్యార్థుల సామర్థ్యం తెలుస్తుంది. దీనిలో వెనుకబడుతున్న వారిని హాస్టల్స్‌కు పంపేలా వారిని ప్రతిభావంతులుగా మార్చేలా ప్రణాళిక పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో 50 శాతం ఉత్తీర్ణతతో సరిపెడితే కూటమి ప్రభుత్వంలో గత ఏడాది 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2025–26 విద్యా సంవత్సరంలో 100 శాతం టార్గెట్ ఉపాధ్యాయులకు పెట్టారు. అదేబాటలో ఉపాధ్యాయులు వెళ్తున్నారు.
ఇన్విజిలేషన్‌లో కొత్త విధానం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలు పెంచేలా జిల్లా విద్యా శాఖ ప్రతిపాదనలు పంపింది. 128 పరీక్షకేంద్రాలతోపాటు నాలుగు పరీక్ష కేంద్రాలు పెంచేలా కోరింది. ఇప్పుడు పరీక్షలకు ఇన్విజిలేషన్ చేసే వారి ఏర్పాటులో ప్రభుత్వం కొత్త విధానం తీసుకురానుంది. జిల్లా విద్యా శాఖను ప్రతి ఏడాది ఇన్విజిలేటర్‌లను ఏర్పాటు చేస్తూ వచ్చింది. అలా కాకుండా లీప్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఎవరితో సంబంధం లేకుండా యాప్ ద్వారానే ఉపాధ్యాయులు సెంటర్‌కు ఎంపికైనట్లు తేలుతోంది. జిల్లాలో దాదాపు 1950 మంది ఇన్విజిలేటర్లను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.