Share News

సంక్షామం

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:27 AM

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తిష్ఠ వేశాయి. చాలాచోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతు న్నాయి. కొన్నిచోట్ల భవనాలు శిథిలావస్థలో ఉండి స్లాబ్‌లు నీరు కారుతున్నాయి.

సంక్షామం
కైకలూరు ఎస్సీ బాలికల వసతి గృహం

సంక్షేమ హాస్టళ్లలో సమస్యల తిష్ఠ

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తిష్ఠ వేశాయి. చాలాచోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతు న్నాయి. కొన్నిచోట్ల భవనాలు శిథిలావస్థలో ఉండి స్లాబ్‌లు నీరు కారుతున్నాయి. ప్రహరీలు, మంచినీరు, మరుగుదొడ్లు తదితర సమస్యలు పరిష్కారం కావడం లేదు. ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం విజిట్‌ చేయగా పలు సమస్యలు వెలుగు చూశాయి.

వర్షం వస్తే నీరంతా ఇక్కడే..

దెందులూరు : దాత స్థలం అందించడంతో ప్రభుత్వం రూ.168.00 లక్షలు ఖర్చు చేసి 400 మంది విద్యార్థుల కోసం 2013లో నిర్మించిన కొవ్వలి ప్రభుత్వ సమీకృత బాలుర వసతి గృహం, నేడు కనీస సౌకర్యాలు లేక అసౌకర్యాలకు నిలయంగా మారిందనే అరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఒకప్పుడు 320 విద్యార్థులతో కిటకిటలాడిన ఈ భవనంలో ఇప్పుడు 47 మంది పిల్లలు మాత్రమే ఉండగా వారికి కనీస భద్రత కరువైంది.వసతి గృహం చూట్టు రెండు వైపుల పొలాలు ఉన్నాయి. దీంతో రాత్రివేళ అపరిచితుల సంచారం, విషకీటకాల బెడద ఉందని విద్యార్థులు భయపడుతున్నారు. వసతి భవనం నిర్మాణం పల్లం ప్రాంతంలో ఉండడం వల్ల చిన్న వర్షం పడినా వసతిగృహం చుట్టూ చేరి పారిశుధ్యం అధ్వానంగా మారుతోంది. విద్యార్థులకు వేడినీటి స్నానం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2019 పాడై సోలార్‌ వాటర్‌ హీటర్‌ వ్యవస్థ ఏడేళ్లుగా పని చేయడం లేదు. మరుగుదొడ్లు 20 ఉన్నప్పటికి అందులో ఏడు ప్రస్తుతం పని చేయడం లేదు. వసతి గృహంలో రోజుకు 8 గంటల చొప్పున 3 ఉద్యోగులు విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు వారికి రక్షణగా ఉండాల్సి ఉన్నప్పటికి ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వసతిగృహం చుట్టూ మెరక పనులు,ప్రహరీ నిర్మాణం ,వేడి నీటి సోలార్‌, మరుగుదొడ్ల మరమ్మతులు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సురక్షితమైన తాగునీరు లేక..

కైకలూరు : సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో తాగేందుకు సురక్షితమైన నీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరు నెలల క్రితం ప్రభు త్వం నుంచి రక్షిత మంచినీటి ఆర్వో ఫిల్టర్‌ అందించినా మంచినీటి ట్యాంక్‌ అందుబాటులో లేక నిరుపయోగంగా మారింది. విద్యార్థులు కుళాయిల్లో వచ్చిన నీటినే నేరుగా తాగుతున్నారు.

శిథిలావస్థలో భవనం

కలిదిండి : కలిదిండి బీసీ బాలికల హాస్టల్‌ భవనం శిథిలావస్థలో ఉంది. స్లాబు పగుళ్లు ఇవ్వడంతో కొద్దిపాటి వర్షానికే స్లాబ్‌ లీకేజీ కావడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల క్రితం వేసిన రంగులు పూర్తిగా వెలిసిపోయాయి. హాస్టల్‌లో పలు గదులకు డోర్లు, కిటికీల తలుపులులేవు. నూతన టాయిలెట్లు నిర్మించారు. డ్రెయినేజీ సౌకర్యం లేక మురుగునీరు హాస్టల్‌ ఆవరణలోనే నిలిచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు.

కొద్దిపాటి వర్షానికే గదుల్లోకి నీరు

ముసునూరు: ముసునూరు బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరింది. స్లాబ్‌ పెచ్చులూడి ఐరన్‌ బయట పడింది. కొద్దిపాటి వర్షానికి స్లాబ్‌ నుంచి గదుల్లోకి నీరు చేరతోందని విద్యార్థులు చెబుతున్నారు. గోడలు సైతం బీటలువారాయి. సెప్టిక్‌ ట్యాంక్‌పై ఉన్న మూత ధ్వంసమై దుర్వాసన వెదజల్లుతోంది. నాలుగేళ్ల క్రితం ఈ భవనం మరమ్మతులకు నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపిన నేటికీ నిధులు మంజూరు కాలేదు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ లేక హాస్ట్టల్‌లో ఉన్న బోరు నీటిని తాగుతు న్నారు. ఇటీవల స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా వచ్చిన నిధులతో నూతనంగా మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు పాత మరగుదొడ్లుకు మరమ్మతులు చేశారు.

సౌకర్యాలలో వెనకడుగు

నూజివీడు టౌన్‌: నూజివీడు గాంధీనగర్‌లో గల బీసీ బాలికల వసతి గృహం సమస్యలమయంగా మారింది. హాస్టల్‌ జి+ప్లస్‌ వన్‌గా ఉండగా పై అంతస్తు స్లాబ్‌ లీక్‌ అవ్వడంతో కళాశాల బాలికల హాస్టల్‌ను ప్రైవేటు భవనానికి మార్చారు. ప్రస్తుతం ఇక్కడ పదో తరగతిలోపు మొత్తం 15 మంది విద్యార్థినులు ఉన్నారు. ప్రహరీ ఒకవైపు కూలి పోవడంతో విద్యార్థినులకు రక్షణ కొరవడింది. మరోవైపు కోతుల బెడద తీవ్రంగా ఉంది. ప్రహరీ నిర్మాణం, స్లాబ్‌ మరమ్మతులకు ప్రతిపాదనలను అధికారులకు పంపినట్టు వార్డెన్‌ మాధురి కృష్ణ తెలిపారు.

భవనం శిథిలావస్థకు ..

మండవల్లి : మండవల్లి ఎస్సీ బాలికల వసతిగృహంలో గతేడాది 47 వరకు విద్యార్ధులు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో 10వ తరగతి విద్యార్థులు ఏడుగురు వెళ్లిపోగా కొత్తగా మరో 10 మంది చేరేందుకు అవకాశం ఉందని వార్డెన్‌ అనితా తెలిపారు. వసతి గృహంలో తాగునీరు, వాడిక నీరు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల రక్షణకు పోలీసులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బిల్డింగు కాస్త శిథిలావస్థకు చేరింది. సన్‌సైడ్‌లు నుంచి మొక్కలు మొలిచి పగుళ్లు ఏర్పడ్డాయి.

వసతి గృహాలను తనిఖీలు చేయాలి : కలెక్టర్‌

ఏలూరు రూరల్‌ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి సమగ్ర నివేదికలు అందించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అందించే ఆహారం, తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్య ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

వసతి గృహాల.. సమగ్రాభివృద్ధి ఎన్నడో ?

కూటమి పాలనలో సంస్కరణలు

హాస్టళ్లకు మరమ్మతులు.. అయినా వెనుకబాటే..

(ఏలూరు–ఆంధ్ర జ్యోతి):

జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ పరిధిలో 35 హాస్టళ్లు ఉండగా ఇందులో 12 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఓవరాల్‌గా మూడో తరగతి నుంచి పీజీ వరకు ఒక్కొ హాస్టల్‌లో 100 మంది వసతి ఉండడా నికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి రెండువేల మంది ఇక్కడ వసతి పొందుతూ చదువుకుంటున్నారు.అలాగే ఎస్సీ హాస్టళ్లు 53 ఉన్నాయి. జిల్లాలో హాస్టళ్లలో ప్రధా నంగా భవనాలు పూర్తిస్థాయిలో ఆధునీకరించాల్సినవే ఉన్నాయి. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన హాస్టళ్ల ల్లో కూటమి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి.. వసతులు పెంచే దిశగా అడుగులు వేసింది. కూటమి కొలువు తీరాక 2024–25 సంవత్సరంలో రూ.1.5 కోట్ల వ్యయంతో బీసీ హాస్టళ్ల భవనాల కు మరమ్మతులు చేపట్టారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద కలిదిండిలో రెండు యూనిట్లు కింద 12 టాయిలెట్లు నిర్మాణం చేపట్టారు. పుష్కరకాలం తర్వాత అన్ని హాస్టళ్లలో వంట పాత్రలను ప్రభుత్వం సమకూర్చింది. కాగా ఆర్వో వాటర్‌ ప్లాంట్లకు ఈ ఏడాది వాటర్‌ టెస్టింగ్‌ కిట్లును అమర్చు తున్నారు. మరోవైపు ఈ ఏడాదీ భవనాల ఆధునికీకరణకు రూ.రూ.1.16 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. సోషల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో త్వరలో దోమ తెరలు వసతి గృహాలకు అమర్చుతారు. 12 భవనాలు అద్దె భవనాలు నడుస్తున్నా వాటి స్థానంలో కొత్తగా నిర్మించడానికి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పౌష్టికాహారంతో కూడిన మెనూ ఇస్తున్న ప్పటికి.. వార్డెన్లు కొరత ఇబ్బందికరంగా మారింది.

Updated Date - Jun 18 , 2026 | 12:27 AM