నవజాత శిశువు మృతి.. బాధితుల ఆందోళన
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:40 AM
ఆ దంపతులు ఎంతో ఆశతో పండంటి బిడ్డ కలుగుతోందని ఆనంద పడ్డారు. ఆనంద ఘడియల కోసం నవమాసాలు మోసిన ఆ యువతి ఎదురు చూసింది. కానీ ఆ దంప తుల ఆశలు అడియాశలయ్యాయి.
విచారణకు ఆదేశించిన మెడికల్ సూపరింటెండెంట్
ఏలూరు క్రైం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఆ దంపతులు ఎంతో ఆశతో పండంటి బిడ్డ కలుగుతోందని ఆనంద పడ్డారు. ఆనంద ఘడియల కోసం నవమాసాలు మోసిన ఆ యువతి ఎదురు చూసింది. కానీ ఆ దంప తుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఘటనతో ఆ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. నడిపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి(21) బాలింత కావడంతో భర్త ఉండ్రు శ్రీనివాసరావుతో కలిసి ప్రతి నెలా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటోంది. ఈనెల 10న నొప్పులు రావడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. నార్మల్ డెలివరీ కాకపోవడంతో బుధవారం ఉదయం సిజేరియన్ చేసి మగ శిశువును తీశారు. శిశువు ఏడుపు లేకపోవడంతో వెంటనే వైద్యులు ఎన్‌ఐసీయూ విభాగానికి తరలించారు. 10.30 గంటల సమయంలో శిశువు మరణించిందని వైద్యులు ధృవీకరించి కుటుంబ సభ్యులకు చెప్పారు. తాము ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులు, నర్సులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఈసడించుకుని అవమానంగా మాట్లాడారంటూ నాగలక్ష్మి తోటి కోడలు అయిన నాగజ్యోతి, వారి కుటుంబ సభ్యులు ఆరోపించి ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు డాక్టర్ ఎంఎస్ రాజుకు ఫిర్యాదు చేయడంతో విచారణ కమిటీని నియమించారు
వైద్యురాలు ఏమన్నారంటే..
ఆసుపత్రి ఎంసిహెచ్ బ్లాక్ ఇన్‌ఛార్జి డాక్టర్ భవానీ, ఎన్‌ఐసియు ఇన్‌ఛార్జి డాక్టర్ సుజాతలను వివరణ కోరగా నార్మల్ డెలివరీ చేయ డానికి ప్రయత్నించామన్నారు. అవకాశం లేకపోవడంతో బుధవారం ఉదయం 8.25గంటలకు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీసినట్టు తెలిపారు. శిశువుకు ఏడుపులేకపోవడంతో వెంటిలేటర్‌పై వైద్యసేవలు అందించడానికి ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదన్నారు. విచారణ కమిటీ వేయడంతో ఆందోళన విరమించారు.