ఆశలు.. ఆకాంక్షలు..
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:46 AM
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజల ఆశలు.. ఆకాంక్షల మేరకు మౌలిక వసతులపై జిల్లాలోని ప్రజాప్రతినిఽధులు అసెంబ్లీలో గళం విప్పుతారని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా కొల్లేరు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని కొల్లేరువాసులు ఆశిస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో కోకో సాగును మరింత ప్రోత్సహించేందుకు జిల్లాలో కోకో సిటీ ఏర్పాటు చెయ్యాలని సీఎం చంద్రబాబు సైతం ఆసక్తి చూపుతున్నారు. దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ సాగుదోంది. మరో వైపు ప్రతి నియోజకవర్గానికి ఎంఎస్‌ఎంఈ పార్కులు, జిల్లావ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల నిర్మా ణాల పురోగతి, అర్హులకు కొత్తగా ఇళ్ల పట్టాల మంజూరు, కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, చింతలపూడి ఎత్తిపోతల పథకం తదితర అంశాల పై ఎమ్మెల్యేలు సమావేశాల్లో గళం విప్పనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు, తాగు నీరు అంశంపై జిల్లాలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించనున్నారు.
దెందులూరుకు పోలవరం కుడి కాల్వ నీరివ్వాలి
పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా దెందులూరు నియోజకవర్గం మీదుగా వెళుతున్న గోదావరి జలాలకు మొదటి ఆయకట్టుదారు దెందులూరు నియోజకవర్గమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. తొలి ఆయకట్టుదారుగా హక్కులకోసం అసెంబ్లీ సమావేశాల్లో అనుమతుల కోసం మాట్లాడతాను. నియోజకవర్గంలో మూడు మండలాల మీదుగా పోలవరం కుడి ప్రధాన కాలువ వెళుతున్నప్పటికీ సాగునీటికోసం వెంపర్లాడాల్సి వస్తోంది. నియోజకవర్గంలో వేసిన పంటలకు నీరందక నేల బీటలువారుతోంది. భవిష్యత్‌లో ఎలాంటి విపత్కర పరిస్థితుల ఏర్పడినా సాగునీటికోసం అవస్థలు పడే పరిస్థితి రాకుండా పోలవరం కుడి ప్రధాన కాలువ నీటికి శాశ్వత హక్కును సాధిస్తాం.
– చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే, దెందులూరు
ఎకో సెన్సిటివ్ జోన్‌పై మాట్లాడతా
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కొల్లేరు ఎకోసెన్సిటివ్ జోన్‌పై మాట్లాడతా. ఎకోసెన్సిటివ్ జోన్ వర్తిస్తే కొల్లేరువాసులకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ ఇబ్బందులను రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. నియోజకవర్గ సమస్యలపై మాట్లాడతా.
కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే, కైకలూరు
సాగు, తాగునీరు అంశం ప్రస్తావిస్తా
ఎల్‌నినో ప్రభావం వలన వర్షాలు అంతంత మాత్రంగానే కురవడంతో కృష్ణా కెనాల్ నుంచి 500 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేయాలని ఆసెంబ్లీలో కోరతా. నియోజకవర్గ అభివృద్ధి కోసం పెండింగ్‌లో ఉన్న ఎన్‌క్యాప్ నిధులు రూ.10కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరతాను. అమృత్–2లో భాగంగా తాగునీటి కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తా.
– బడేటి చంటి, ఎమ్మెల్యే, ఏలూరు
పింఛన్లు, రేషన్ కార్డులు కోరతా
ఎంతో కాలంగా ప్రజలు ఎదురుచుస్తున్న కొత్తగా పింఛన్ల మంజూరుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. మూడేళ్ల నుంచి పింఛన్ల కోసం వితంతు, దివ్యాంగులు ఎదురుచుస్తున్నారు. రేషన్ కార్డు లేక పింఛన్‌కు అర్హత పొందలేక పోతున్నారు. కొత్తగా రేషన్ కార్డుల మంజూరుపై మాట్లాడతాను. నియోజకవర్గంలో మురుగు, సాగునీరు కాలువల ఆధునీకరణ, రోడ్లు నిర్మాణానికి నిధుల మంజూరుచేయాలని కోరతాను. కొల్లేరు సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాను.
– పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్యే, ఉంగుటూరు