వలపు వల..!
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:36 AM
‘హలో...! బాగున్నారా...! ఈ మధ్య అస్సలు కనిపించడం మానేశారేమిటి ? వాట్సప్‌లో ఒక ఫొటో పెట్టా... చాలా దూరం నుంచి వచ్చారు. కొత్త అమ్మాయిలు.. ఫొటోలు చూసి ఫోన్ చేయండి.. మీకు అనుకూలమైన రేటే తీసుకుంటా’ అంటూ యువతకు వలలు వేయడం సర్వసాధారణంగా మారింది.
వాట్సాప్‌లో శృంగార ఫొటోలు
పంపించి వల వేస్తున్న దళారులు
వేలల్లో దోచుకుంటున్న వైనం
జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత
‘హలో...! బాగున్నారా...! ఈ మధ్య అస్సలు కనిపించడం మానేశారేమిటి ? వాట్సప్‌లో ఒక ఫొటో పెట్టా... చాలా దూరం నుంచి వచ్చారు. కొత్త అమ్మాయిలు.. ఫొటోలు చూసి ఫోన్ చేయండి.. మీకు అనుకూలమైన రేటే తీసుకుంటా’ అంటూ యువతకు వలలు వేయడం సర్వసాధారణంగా మారింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు ఇలాంటి వ్యవహారాలకు పూనుకుంటున్నారు. తూర్పు గోదావరి, విశాఖ, అనకాపల్లి, విజయవాడ ప్రాంతాల నుంచి యువతులను ఉమ్మడి పశ్చిమలోని భీమవరం, ఏలూరు సహా పలు ప్రాంతాలకు తీసుకువచ్చి వ్యభిచారాలు నిర్వహిస్తున్నారు.
భీమవరం ఇందిరమ్మ కాలనీలో ఇటీవల ఒక మహిళ తూర్పు గోదావరి జిల్లా నుంచి 8 మంది యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తుండగా వన్ టౌన్ పోలీసులు దాడి చేశారు. ఇద్దరు విటులు, ఇద్దరు నిర్వాహకులు, ఎనిమిది మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం నరసాపురం ప్రాంతంలో ఒక నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తుండగా నలుగురు యువతులు, ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మసాజ్ సెంటర్ పేరుతో యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారన్న సమాచారంతో భీమవరం వంశీకృష్ణ నగర్ ప్రాంతంలోని ఒక నివాసం, స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మహిళలు, కొందరు యువకులు పట్టుబడ్డారు.
తణుకు శివారులో ఒక నివాసంపై పోలీసులు దాడి చేయగా పది మంది యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు యువతులు కూడా అందులో ఉన్నారు.
భీమవరం క్రైం/ఏలూరు క్రైం , మార్చి 28(ఆంధ్రజ్యోతి): వలపు వలకు విద్యార్థులు, యువతను ప్రధానంగా టార్గెట్ అవుతున్నారు. కొందరు నిర్వాహకులు యువత నెంబర్లను సేకరించి వారి మొబైల్ ఫోన్లకు అమ్మాయిల అసభ్యకరమైన ఫొటోలను పంపించి వల వేస్తున్నారు. దీంతో యువత, విద్యార్థులు ఆ ఫొటోలకు ఆకర్షితులై వారి నంబర్లకు ఫోన్ చేసి వేలల్లో ఖర్చు పెడుతున్నారు. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఎంతో ఆశ పడి కాయకష్టం చేసి వారిని చదివిస్తుంటే వారు మాత్రం ఇలాంటి అడ్డదారుల్లోకి వెళ్లి చదువును పక్కన పెట్టేస్తున్నారు. కొందరు మద్యం మత్తు లో ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఇదంతా ఒక ఎత్తయితే వ్యభిచార వృత్తిలోకి చిన్న వయస్సు వున్న విద్యార్థులు, యువతులు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. జీవితాలు నాశనం చేసుకోవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు.
పట్టణానికి దూరంగా నివాసాలు, అపార్ట్‌మెంట్లువి అద్దెకు తీసుకుని వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారు. కొంద రైతే వ్యభిచార గృహాలు నిర్వహిస్తామని, కావాల్సినంత అద్దె చెల్లిస్తామని మరీ చెప్పి తీసుకోవడం గమనార్హం. మరికొందరైతే స్పా సెంటర్ల ముసుగులో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి యఽథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఎన్నోసార్లు పోలీసులు స్పా సెంటర్లపై దాడులు చేసి చాలా మందిని అదుపులోకి తీసుకున్నా ఫలితం లేకపోతోంది. సాయంత్రమైతే చాలా కొన్ని ప్రాంతాల్లో హిజ్రాలుగా చెప్పుకునే కొందరు యువకులను పెడత్రోవ పట్టిస్తున్నారు. భీమవరం ఉండి రోడ్డు ప్రాంతంలో సాయంత్రం పూట రోడ్డు పక్కన నిలబడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు హిజ్రాలు అటుగా వెళ్లే వారిని ఇబ్బందులకు గురి చేసి వల వేస్తున్నా రు. తాడేపల్లిగూడెం, తణుకు హైవేపైన, పట్టణాల్లోను పలుచోట్ల రాత్రి వేళల్లో వ్యభిచారం జోరుగా సాగుతోంది. పోలీసులు అటువైపు చూడకపోవడం గమనార్హం. స్పా సెంటర్స్, బ్యూటీపార్లర్స్ ముసుగులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వాటిపై పోలీసులు గతంలో దాడులు చేసిన ఘటనలు ఏలూరు జిల్లాలో ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో స్పా సెంటర్ ముసుగులో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు.