మృత్యువేగం
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:41 AM
అద్దంలా మెరిసే బాడీ.. విద్యుత్ కాంతులతో తలతలలాడే అలంకర ణతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రాత్రి వేళ బస్సులో ఎక్కితే హాయి గా నిద్రపోతూ తెల్లారేసరికి గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న భావనతో ప్రయాణికులు టిక్కెట్లకు అధిక ధరలు చెల్లిస్తారు.
పెరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు
భయాందోళనలో ప్రయాణికులు.. తనిఖీలు జరుగుతున్నా అడ్డుకట్టేది?
యజమానుల లాభాపేక్ష.. డ్రైవర్ల నిర్లక్ష్యం.. బస్సుల వేగం..
రెగ్యులర్ డ్రైవర్లు లేకపోవడం.. ఇలా కారణాలు అనేకం
అద్దంలా మెరిసే బాడీ.. విద్యుత్ కాంతులతో తలతలలాడే అలంకర ణతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రాత్రి వేళ బస్సులో ఎక్కితే హాయి గా నిద్రపోతూ తెల్లారేసరికి గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న భావనతో ప్రయాణికులు టిక్కెట్లకు అధిక ధరలు చెల్లిస్తారు. కానీ ఆ మెరుపుల వెనుక మృత్యువు దాగి వుందని భయాందోళనలు వరుస ప్రమాదాల నేపథ్యంలో వ్యక్తమవు తున్నాయి. ఇందుకు ప్రధానంగా చాలా బస్సుల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం.. యాజమాన్యాల లాభాపేక్ష.. నిబంధనల అమలులో లోపాలు.. అధికారులు తూతూమంత్రపు తనిఖీలు ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు తర్వాత వదిలేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం క్రైం, ఆగస్టు 26(ఆంధ్ర జ్యోతి):ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు నిత్యం వందలాది ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణిస్తుంటాయి. ఇటీవల కాలంలో పలు బస్సులు ప్రమాదానికి గురై ఎంతోమంది మృత్యు వాత పడ్డారు. మరింత మంది గాయాలపాల య్యారు. ఇవే కాకుండా ఈ ఏడాది ఏలూరు, చింతలపూడి తదితర ప్రాంతాల్లోనూ పలు ప్రమాదాలు సంభవించాయి. ఇలా వరుస ప్రమాదాల నేపథ్యంలో అసలు లోపం ఎక్కడ ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. బస్సుల కండీ షన్‌లో లోపమా? డ్రైవర్ల నిర్లక్ష్యమా? యాజమా న్యాల ఒత్తిడా? లేక నిబంధనల అమలులో లోపమా? అనే చర్చ జరుగుతోంది. అదనపు ఆదాయం కోసం బస్సుల్లో ఇరుకైన సీట్లను ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అద్దాలతో పూర్తిగా మూసివేసిన బస్సుల డిజైన్ కొన్ని సందర్భాల్లో భద్రతాపరంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురికావడంతోపాటు, అత్యవసరంగా బయటకు రావడానికి తగినంత అవకాశం లేకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
తొందరగా వెళ్లాలని..
ప్రైవేట్ ట్రావెల్ బస్సులు మార్గ మధ్యలోని వివిధ పట్టణాలు, స్టాప్ లలో ప్రయాణికులను ఎక్కించుకో వడం, దించడం కోసం వేగాన్ని తగ్గించాలి. ఈ ప్రక్రియలో ఆలస్యమైన సమయాన్ని తిరిగి అందుకోవడానికి మిగిలిన గమ్యానికి బస్సులను అధిక వేగంతో నడుపుతు న్నారు. వేగంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్న ప్రయాణికుల ఆకాంక్ష పోటీకి కారణమవుతోంది. ప్రైవేట్ బస్సు అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్‌లో బస్సు ఎక్కినా తెల్లారేసరికి జంగారెడ్డిగూడెం వచ్చేస్తున్నారు. హైస్పీడ్‌తో నడిచే బస్సులనే ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు శాశ్వత డ్రైవర్లు కాకుండా అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఆప్టింగ్ డ్రైవర్లను తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్ అనుభవం, విశ్రాంతి సమయం, వాహన పరిజ్ఞానం వంటి అంశాలపై తగిన పర్యవేక్షణ లేకపోతే ప్రమాదాలకు అవకాశం పెరుగు తుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులు సాధా రణంగా నిర్ణీత వేగ పరిమితుల్లోనే ప్రయాణిస్తాయి. వేగం మరింత పెరగకుండా వాహనాల్లో పరిమితులు ఉంటాయి. ఇదేవిధంగా ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లోనూ ఏర్పాటు చేయాలి.
వరుస ప్రమాదాలతో హడల్
ఈ నెల మొదటి వారంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వద్ద హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డు మార్జిన్ దిగి ప్రమాదానికి చేరువైంది. డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేసి, బస్సును తిరిగి రోడ్డుపైకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ నెల 12న జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది.
ఈ నెల 19న జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జవగా, డ్రైవర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.
2025 మార్చి ఆరో తేదీన హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఏలూరు సమీపంలోని మెయిన్ బైపాస్ రత్నస్ హోటల్ వద్ద ఆగి ఉన్న లారీని తెల్లవారుజామున బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
2025 మార్చి ఎనిమిదో తేదీన ఆశ్రం సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారం గడపకు ముందే రెండు ఆర్టీసీ బస్సులు మెయిన్ బైపాస్ లో రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో వేర్వేరు చోట్ల ప్రమాదాలకు గురయ్యాయి.
తనిఖీలు జరుగుతున్నా..
రెండు జిల్లాల్లోనూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. బస్సు కండీషన్, భద్రత, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారం, వాహన పత్రాలు, డ్రైవర్ కండీషన్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అంశాలను పరిశీలి స్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నామని చెబుతున్నారు. తనిఖీలు జరుగుతున్నా ప్రమాదాలు నియంత్రణలోకి రావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది ? దీనిపైనే అధికారులు సమీక్ష చేయాలి.