భగభగలు
ABN , Publish Date - May 27 , 2026 | 12:26 AM
అధిక ఉష్ణోగత్రలతో జిల్లా భగభగ మండింది. ఉదయం 9 గంటల తర్వాత బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు
అత్యధికంగా కుక్కునూరులో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత
ఏలూరు సిటీ, మే 26(ఆంధ్రజ్యోతి): అధిక ఉష్ణోగత్రలతో జిల్లా భగభగ మండింది. ఉదయం 9 గంటల తర్వాత బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లలో ఉన్నప్పటికీ విపరీతమైన ఉక్కపోతతో అపసోపాలు పడ్డారు. చాలా మంది దూరప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. బస్సులు, ప్రైవేటు వాహనాలలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడి పోయింది. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు వడగాడ్పు తీవ్రతకు బస్సు నడపడం కష్టతరంగా మారింది. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్ర వేత్తలు చెబుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్వచ్ఛంద సంస్థల వారు ఎక్కడికక్కడ చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తి తీరుస్తున్నారు. రాబోయే 4 రోజులు కూడా భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరి కలు జారీ చేసింది. జిల్లాలోనే అత్యధికంగా కుక్కునూరు మండలంలో 45.1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆగిరిపల్లి మండలంలో 44.9, లింగపాలెం మండలంలో 44.6, ముసునూరు మండలంలో 44.4 చింతలపూడి మండలంలో 44.1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. రానున్న రెండు రోజుల్లో కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకు అవసరమయితే తప్ప బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
విద్యుత్ అంతరాయంతో విలవిల
జిల్లాలో వేడిగాలుల ప్రభావంతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు మొరాయించడం, సబ్ స్టేషన్లులో సాంకేతిక సమస్యలతో ఏలూరు నగరంతోపాటు జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తరచు అంతరాయం కలుగుతోంది. ఒక పక్క దారుణమైన ఎండ, మరో పక్క ఉక్కపోతను తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతు న్నారు. ఎండ తీవ్రతకు ఇంట్లో ఏసీలు కూడా మొరాయి స్తున్నాయి. ఇంట్లో ఉన్నా వడదెబ్బకు గురికావాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఎండ తీవ్రత కారణంగా బయటకు వెళ్లలేక విద్యుత్ అంతరాయంతో ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు.