గుడ్లు పెట్టని కోళ్లు..!
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:55 AM
పౌల్ర్టీ పరిశ్రమ గడిచిన రెండేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో బర్డ్ ఫ్లూ కారణంగా గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి.
చనిపోతున్న కోళ్లు.. నష్టాల్లో రైతులు
భారంగా మారిన పౌల్ర్టీల నిర్వహణ
తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన ధరలు
హోల్‌సేల్‌గా వంద రూ.670.. రిటైల్ మార్కెట్‌లో ఒకటి రూ.8
వంద గుడ్లు ధర పెరిగిన తీరు (రూ.ల్లో)
తేదీ ధర
జూలై 1 625
4 630
5 635
9 645
10 655
11 665
12 670
(తణుకు–ఆంధ్రజ్యోతి):
పౌల్ర్టీ పరిశ్రమ గడిచిన రెండేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో బర్డ్ ఫ్లూ కారణంగా గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఫలితంగా దాదాపు కోట్లాది రూపాయల నష్టం వచ్చింది. కొన్ని నెలలపాటు గుడ్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీని నుంచి కోలుకుని గుడ్ల ఎగుమతులు వేగం పుంజుకున్నాయి. ఈ దశలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతల తారస్థాయికి చేరాయి. ఎండ వేడిమి తట్టుకోలేక కోళ్లు తలలు వాల్చేశాయి. గుడ్ల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. కోళ్లను చల్ల బర్చేందుకు ప్రతిరోజు స్పింక్లర్ల ద్వారా వాటరింగ్ చేయడం, ఫ్యాన్ లు అమర్చడం వంటి చర్యలు చేపట్టారు. ఈ నెల గడిస్తే కాస్త వానలు పడితే వాతావ రణం చల్లబడి కోళ్లు కోలుకుం టాయని, గుడ్ల ఉత్పత్తి బాగుం టుందని రైతులు భావించారు. కాని జూన్, జూలై మాసాలు వచ్చినప్పటికి చినుకు జాడలేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపో వడం వల్ల ఎండ వేడి, అధిక ఉష్ణోగ్రతలు, తేమ వల్ల ఇప్పటికీ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 350కు పైగా కోళ్ల ఫారాలు వున్నాయి. ఒక్కో ఫారంలో పది వేలకు పైగా కోళ్లు వుంటాయి. ఒక్కో ఫారంలో రోజుకు 90 శాతం రావాల్సిన గుడ్లు.. ప్రస్తుతం 65 నుంచి 70 శాతం మాత్రమే వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. మొత్తం పౌల్ర్టీల్లో కోటీ 20 లక్షల కోళ్లు వుండగా రోజుకు 70 లక్షల వరకు మాత్రమే గుడ్లు పెడుతున్నాయి. ఉత్పత్తి అయిన వాటిలో స్థానిక అవసరాలు పోనూ కోల్‌కతా మార్కెట్‌కు 35 లారీలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.
పెరిగిన మేత ధరలు
ఆరోగ్యంగా పెరిగి, నాణ్యమైన గుడ్లు ఉత్పత్తి చేయాలంటే కోళ్లకు పౌష్టికాహారం సమృద్ధిగా పెట్టాలి. సోయాబీన్, మొక్క జొన్న, వేరుశెనగ పిండి వంటి మేతలు ఇవ్వాలి. అదే సమ యంలో తెగుళ్లు సోకకుండా వివిధ రకాల మందులు వినియోగించాలి. రెండు నెలలుగా మేత ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సోయాబీన్ క్వింటాకు 35 వేల నుంచి 70 వేలకు, మొక్కజొన్న 2 వేల నుంచి 2 వేల 500, నూకలు 1,900 నుంచి 2,400 వరకు, మందులు వందల్లో ఉండే ధరలు వేలల్లో పెరిగింది. విద్యుత్ చార్జీల విషయంలోను ఆర్థిక భారం పడుతోంది. ఎండల కారణంగా స్పింక్లర్లు ద్వారా నిరంతరం నీళ్లతో తడపడంతో విద్యుత్ వినియోగం అధికమైంది. కార్మికుల జీతభత్యాలు, మందులు, పౌష్టికాహారం ధరలు, నిర్వహణ ఖర్చులు మొదలైనవి పెరగడం వంటి కారణాలతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. దీనివల్ల గుడ్ల ధరలను పెంచాల్సి వచ్చినట్టు రైతులు చెబుతున్నారు. గుడ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్లు పెద్ద ఎత్తున చనిపోవడంతో పౌలీ్ట్ర రైతులకు లక్షల్లో నష్టాలను చవిచూశారు.
ఇతర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి
ఇది ఒక్క ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి వుంది. గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ముందంజలో వుండేవి. పైన చెప్పిన కారణాల రీత్యా గుడ్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉత్పత్తి తగ్గడం వల్ల వంద గుడ్లు 670 రూపాయలకు చేరింది. రిటైల్‌గా గుడ్డు ఒకటి ఎనిమిది రూపాయలకు విక్రయిస్తున్నారు.
మేత ధరలు పెరగడంతో ఇబ్బంది
పౌల్ర్టీ రంగానికి భారీగా పెరిగిన మేత ధరలు తీవ్ర ఇబ్బందిగా ఉంది. కాస్త గుడ్డు ధర పెరిగినప్పటికి, పెరిగిన మేత ధరల వల్ల గిట్టుబాటు కావడం లేదు. మొక్కజొన్న, సోయాబీన్, నూకల ధరలు పెరిగాయి. రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని, పౌలీ్ట్ర రైతులను ఆదుకోవాలి.
– కొమాట్లపల్లి వెంకట సుబ్బారావు, రాష్ట్ర పౌలీ్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు