హెల్ప్‌లెస్ హ్యాండ్స్ !
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:45 AM
పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులంతా ఏర్పాటు చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యాపార సంస్థగా మారింది. క్యాంపస్‌లో వంటా వార్పు కూడా రంగంలోకి దిగడంతో జీఎస్టీ, ఐటీల చెల్లింపుల వరకు వెళ్లింది.
వంటా వార్పుతో లాభనష్టాలెవరికి.. జీఎస్టీతో ఐటీ పరిధిలోకి సంస్థ
(నూజివీడు /నూజివీడు టౌన్ – ఆంధ్రజ్యోతి):
పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులంతా ఏర్పాటు చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యాపార సంస్థగా మారింది. క్యాంపస్‌లో వంటా వార్పు కూడా రంగంలోకి దిగడంతో జీఎస్టీ, ఐటీల చెల్లింపుల వరకు వెళ్లింది. విద్యార్థులకు సహాయ సహకారాలు అటుంచితే ఇందులో లాభనష్టాలకు ఎవ రు బాధ్యత వహిస్తున్నారు తదితర అంశాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
2008లో ఆర్జీయూకేటీ పరిధిలో ఏర్పాటుచేసిన నూ జివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 6600 మందితోపాటు ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు చెందిన పి.యు.సి విద్యార్థులు మరో 2200 మంది విద్యా భ్యాసం చేస్తున్నారు. వీరికి భోజనాలు అందించేందుకు క్యాంపస్‌లో నాలుగు మెస్సులు ఉండగా 2025 దసరా నుంచి మెస్ టెండర్లను రద్దు చేస్తూ భోజనం సదు పాయాల కల్పనను అక్షయ పాత్ర సోదర సంస్థ హరే కృష్ణ హరే రామ మూమెంట్‌కు ప్రభుత్వం అనుమ తింది. సదరు సంస్థ పూర్తిగా శాఖాహార భోజనం అందిస్తుండడంతో నిబంధనల ప్రకారం మాంసాహార భోజనం ఎలా అందించాలని ప్రశ్న తలెత్తింది. నెల రోజులపాటు మాంసాహారం, గుడ్లను అందించకపోవ డంతో హెల్పింగ్ హ్యాండ్స్‌ను వ్యూహాత్మకంగా ముందు కు తెచ్చి గుడ్లు, మాంసాహారాన్ని అందించారు. నిబం ధనల ప్రకారం భోజన సదుపాయాలు అందించే సంస్థకు క్యాటరింగ్ అనుభవం, జీఎస్టీ ఉండాలి. క్యాట రింగ్ చేపట్టిన నెల రోజులకు సరిగ్గా కోడిగుడ్లు అందక విద్యార్థులు రోడ్డు ఎక్కడం లోపాలను ‘ఆంధ్రజ్యోతి’ కథనం ద్వారా ఎత్తి చూపుతూ నాడు ప్రచురించడంతో ఈ సంస్థను జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు.
క్యాటరింగ్ అనుభవం ఏదీ..
నిబంధనల ప్రకారం మాంసాహారం అందించే సంస్థకు క్యాటరర్స్ అనుభవం ఉండాలి. ఈ సంస్థకు అనుభవం లేక తాత్కాలికంగా ఒక వంట వ్యక్తిని నియమించుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వా హకులైన ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు కొందరు పెట్టు బడులకు బయట నుంచి అప్పు తెచ్చి తాము సైతం అంటూ హౌస్ కీపింగ్ సిబ్బందిని వంటా వార్పుకు ఉపయోగించుకున్నారు. ఫలితంగా ట్రిపుల్ ఐటీ జీతభ త్యాలతోనే ఈ వంట కార్యక్రమం జరుగుతుండగా ట్రిపుల్ ఐటీకి ఆర్థిక భారం పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇటు బయటినుంచి తెచ్చిన పెట్టుబడులకు వడ్డీ, జీఎస్టీ చెల్లిం పులు, ఐటీ రిటర్స్న్, వీటిన్నింటిని పరిశీలిస్తే హెల్పింగ్ హ్యాండ్స్‌ను బలి పశువును చేశా రని ఆరోపణలున్నాయి. గుడ్లు, మాంసం అందించే క్రమంలో నష్టాలు ఎదురవుతుండడంతో బ్రాయిలర్ కోళ్ల స్థానంలో నాసిరకపు లేయర్ కోడి మాంసాన్ని వినియోగిస్తున్నా రనే ఆరోపణలు సైతం ఉన్నాయి. హెల్పింగ్ హాండ్స్ బాధ్యతలను నిర్వర్తించే ఇద్దరు మెంటార్లు తమ తరగతుల నిర్వహణను వదిలి పూర్తి సమయం దీనికి కేటాయించడంతో సమయానికి ల్యాబ్‌లు జరగక తాము నష్టపోతున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెల్పింగ్ హ్యాండ్స్ బైలా ప్రకారం సంస్థలో రెండేళ్ల అనుభవం ఉన్న వ్యక్తికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేప ట్టాలి. ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి గతంలో ఎప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ బాధ్యతలు నిర్వర్తించలే దు. వీటిని పట్టించుకోని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం బిల్లులు చెల్లింపులు చేపట్టింది. వీటిని పరిశీలిస్తే హె ల్పింగ్ హ్యాండ్స్‌కు నష్టం చేకూరుతుందని విద్యార్థులకు భోజన సదుపాయాలు అందించే క్రమంలో నెలకొన్న పరిస్థితులపై విచారణ నిర్వహిస్తే హెల్పింగ్ హాండ్స్ సంస్థను అడ్డం పెట్టుకుని కొందరు చేస్తున్న అక్రమా లు బయటకు వస్తాయని విద్యార్థులు అంటున్నారు.
మాంసం కొనుగోళ్లపై చర్యలు
ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గోపాలరాజును వివరణ కోరగా ‘మాంసాహార భోజనం నిర్వహణ ప్రభుత్వం నుంచి హెల్పింగ్ హ్యాండ్స్‌కు ఇవ్వాలని వచ్చిన సూచనల మేరకు దీనికి బాధ్యతలు అప్పగించాం. మాంసం కొనుగోళ్లు పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.