Share News

పార్కింగ్‌.. పాట్లు

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:49 AM

214 నంబరు జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా లారీలను నిలిపివేస్తుండటంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

పార్కింగ్‌.. పాట్లు
భీమవరం – ఉండి రహదారిలో రోడ్డు మధ్యలో నిలిపి వేసిన కంటైనర్లు

ఎన్‌హెచ్‌ 214పై అడ్డదిడ్డంగా లారీల నిలిపివేత.. కనిపించని హైవే పెట్రోలింగ్‌

ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు

రోడ్డుపైనే కంటైనర్లు.. ప్రయాణికుల అవస్థలు

భీమవరం క్రైం/మొగల్తూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): 214 నంబరు జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా లారీలను నిలిపివేస్తుండటంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. హైవే పెట్రోలింగ్‌ నిఘా కొరవడటంతో డ్రైవర్లు రాత్రి, పగలు తేడా లేకుండా వాహనాలను రోడ్డుపైనే ఇష్టానుసారంగా పార్క్‌ చేస్తున్నారు. మొగల్తూరు పాత కాలువ సమీపంలోని వై జంక్షన్‌ వద్ద అధికారిక పార్కింగ్‌ స్థలం ఉన్నప్పటికీ డ్రైవర్లు అక్కడికి వెళ్లడం లేదు. మొగల్తూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీతారామపురం, ముత్యాలపల్లి, దారితిప్ప, కుక్కలవారి తోట సమీపంలో ప్రధాన రహదారిపైనే లారీలను నిలిపివేసి నిద్రపోవడమో, సమీప హోటళ్లకు వెళ్లడమో చేస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే క్రమంలోనూ, ఇతర వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే సమయంలోనూ వేగంగా వచ్చే వాహనదారులు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలను ఢీకొంటున్నారు. నరసాపురం–మొగల్తూరు మార్గంలోని సీతారామపురం వద్ద ఇటీవల అనేక ప్రమాదాలు జరిగి పలువురు తీవ్రంగా గాయపడగా, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, నిర్ణీత ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపేలా సూచిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కంటైనర్లు.. జనం ఇక్కట్లు

జిల్లాలోని ప్రధాన పట్టణాలైన ఆకివీడు, ఉండి, గణపవరం వెళ్లే భీమవరం–ఉండి ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఆటోమొబైల్‌ షోరూమ్‌ల నిర్వాహకులు రోడ్డును ఆక్రమిస్తుండటంతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ మార్గంలో ఇటీవల కార్లు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల షోరూమ్‌లు భారీగా వెలిశాయి. ఇతర రాష్ట్రాల నుంచి కొత్త వాహనాలను తీసుకొచ్చే భారీ కంటైనర్లను రోడ్డుపైనే అడ్డంగా నిలిపి అన్‌లోడ్‌ చేస్తున్నారు. సగానికి పైగా రోడ్డును ఈ కంటైనర్లే ఆక్రమిం చడంతో తీవ్రమైన ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో వాహనాలను నిలిపి అన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, పోలీసులు, సంబంధిత అధికారులు చూసీచూ డనట్లు వ్యవహరిస్తుండటంతో షోరూమ్‌ నిర్వాహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రోడ్డుపై కంటైనర్ల నిలుపుదలను తక్ష ణమే అరికట్టాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

భీమవరంలో ట్రాఫిక్‌ జామ్‌

భీమవరం పట్టణంలో శుక్రవారం ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. నాలుగు గంటలపాటు ఈ రద్దీ కనిపించింది. ప్రకాశం చౌక్‌, అంబేడ్కర్‌సెంటర్‌, పోలీసు బొమ్మ సెంటర్‌, వెంకట్రామా థియేటర్‌ రోడ్‌, బైపాస్‌ రోడ్డులోని బీవీ రాజు విగ్ర హం సమీపంలోనూ వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం పాఠశాలలు, కళాశాలలు వదిలిపెట్టడంతో ఇదే పరిస్థితి పునరావృతమైంది. భీమవరంలో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐతోపాటుగా ఐదుగురు ఎస్‌ఐలు, ఒక ఏఎస్‌ఐ, ముగ్గురు హెచ్‌సీలు, 12 మంది కానిస్టేబుల్స్‌, ముగ్గురు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. ఆయా సమయాల ప్రకారం వారు విధుల్లో ఉంటారు. అయినా కొన్ని సమయాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ కష్టంగా మారుతోంది. గతంలో బైపాస్‌ రోడ్డు లేని సమయంలో ఇబ్బందులు ఉండేవి. బైపాస్‌ రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ సమస్య తప్పడం లేదు. దీనిపై అధికారులు స్పందించి దృష్టి సారించాలి.

Updated Date - Aug 29 , 2026 | 12:49 AM