Share News

పట్టణాలు జలదిగ్బంధం

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:48 AM

మురసు తుఫాను పశ్చిమ గోదావరి జిల్లాను వణికించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది.

పట్టణాలు జలదిగ్బంధం
తణుకులో రైల్వే ట్రాక్‌ వెంబడి ముంపు

మురసు తుఫానుతో అతలాకుతలమైన పశ్చిమ

నీట మునిగిన కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు..

ముంపులోనే సెల్లార్లు

మురసు తుఫాను పశ్చిమ గోదావరి జిల్లాను వణికించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నరసాపురం, భీమవరం, ఆకివీడు తదితర పట్టణాలతోపాటు పల్లెలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఈ ఏడాదిలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

తాడేపల్లిగూడెంలో మునిగిన కార్యాలయాలు

తాడేపల్లిగూడెం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూ డెంలో ఆర్టీసీ బస్టాండ్‌, గ్యారేజ్‌, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, ఆర్డీవో, తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతోపాటు సబ్‌ జైలు ప్రాంగణం పూర్తిగా నీట మునిగాయి. తాడేపల్లి చెరువు వద్ద రోడ్డుపైకి నీరు చేరడంతో కుంచనపల్లి వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు వేరే మార్గా ల్లో వెళ్లాల్సి వచ్చింది. సత్యవతినగర్‌, మహాలక్ష్మినగర్‌, మసీ దు సెంటర్‌, పాతూరు, కడకట్ల తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండ్రుప్రోలు, ఎల్‌.అగ్రహారం, కుంచ నపల్లి, కడియద్ద తదితర మెట్ట ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు పట్టణంలోని ప్రధాన డ్రైన్లలోకి చేరడంతో వాటి ని పారిశుధ్య సిబ్బంది తొలగిస్తున్నారు.

గర్భగుడికి చేరిన గోస్తనీ వరద

తణుకు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తణుకు పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పల్లపు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షం నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్‌ పూర్తిగా నీటితో చేరిపోయింది. ప్రయాణికులు కూర్చుండే కుర్చీల వరకు నీరు చేరడంతో వారు చాలా ఇబ్బందులు పడ్డారు. గోస్తనీ కాలువ పొంగడంతో పాతూరు శివాలయం లోని గర్బగుడిలోకి వర్షం నీరు చేరింది. హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఇరగవరం కాలనీతోపాటు పలు కాలనీలన్నీ వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జలదిగ్భంధంలో కాలనీలు, పేటలు

పాలకొల్లు అర్బన్‌ : పట్టణంలో మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. హౌసింగ్‌ బోర్డు కాలనీలో నాలుగడుగుల నీరు నిలిచిపోయింది. ఏవీఎస్‌ కాలనీ, ఎల్‌ ఆర్‌పేట, గణేష్‌ నగర్‌ కాలనీ, శంభునిపేట, బ్రాడీపేట, రామారావు పేట, కొత్తపేట, బద్దావాని పేట, గూడ్స్‌ షెడ్‌ వెనుక వైపున డ్రైయినేజీలు ఎగదన్నడంతో పాటు వర్షపు నీరు రోడ్లపైకి చేరుకుంది. రోడ్లన్నీ చిధ్రంగా మారాయి. వ్యాపారాలు లేక చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో పారిశుధ్య సిబ్బంది నీటిని మళ్లించారు. అపార్ట్‌మెంట్లలోని సెల్లార్లలో నిలిచిన నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపింగ్‌ చేస్తున్నారు.

ముంపులోనే తీర ప్రాంతం

నరసాపురం టౌన్‌: నరసాపురం తీర ప్రాంతంలో ముం పు తీవ్రత కొనసాగుతోంది. లాకుపేట, చలవపేట, భూపతి వారి వీధుల్లో వర్షపు నీరు ఇంకా బయటకుపోలేదు. ఇటు రహదారులు అధ్వాన్నంగా మారాయి. చేతికొచ్చిన పంటలు మోకాల్లోతు నీటిలో మునిగిపోయాయి. వ్యవసాయ అధికా రి జ్యోషి పంట పొలాలను పరిశీలించి, నీటిని బయటకు తోడేయాలని రైతులకు సూచించారు. సముద్రంలో అలల ఉధృతి తగ్గినా చలిగాలులు ఆగలేదు. 15 రోజులుగా వేటకు వెళ్లక మత్స్యకారులు, రోడ్లపై వ్యాపారాలు చేసుకోలేక చిరు వ్యాపారులు పస్తులుంటున్నారు. పలు గ్రామాల్లో వృక్షాలు నేలకూలడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. మనిసిపల్‌ మంచినీటి మోటార్లు చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:48 AM