ముంచెత్తిన ఎర్ర కాలువ
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:38 AM
ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన వర్షాలకు ఎర్రకాలువ పొంగి పంటపొలాలను ముంచేస్తోంది.
గోదారిని తలపిస్తున్న ఆయకట్టు
జలదిగ్బంధంలో గ్రామాలు
చాలా గ్రామాలకు రవాణా బంద్
తాడేపల్లిగూడెం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన వర్షాలకు ఎర్రకాలువ పొంగి పంటపొలాలను ముంచేస్తోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పరివాహక ప్రాంతాలైన బంగారుగూడెం, వీరంపాలెం, పట్టింపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాధపురం, మారంపల్లి, నందమూరు గ్రామాలపడింది. ఈ గ్రామాల్లోని పంటపొలాల్లోకి ఎర్రకాలువ నీరు చొర బడింది. ఈ ఆయకట్టు అంతా గోదారిని తలపిస్తున్నది. నందమూరు అక్విడెక్ట్ వద్ద గురువారం సాయంత్రానికి 39 అడుగులకు చేరింది. ఇక్కడ ఏర్పాటు 40 అడుగులు దాటిన తరువాత కొత్త అక్విడెక్ట్ మీదుగా ఎర్రకాలువ ప్రవాహం ఉంటుంది. శుక్రవారం అర్థ్దరాత్రికిగాని, తెల్లవారేసరికి గాని ఎర్రకాలువ నుంచి మరింత నీరు వచ్చే అకాకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరాటం జలాశయం నుంచి 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. మారంపల్లి, నందమూరు, జగన్నాధపురం, మాధవరం ఆయకట్టులో ఉన్న వరిపొలాలు ఎర్రకాలువ నీటితో గోదారిని తలపిస్తున్నాయి.
ఇంకా జలదిగ్బంధంలోనే..
తాడేపల్లిగూడెం పట్టణంలోను, రూరల్ మండలంలోని కొన్నిగ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అండర్‌పాస్‌ల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలన్నా, పట్టణాలకు రావాలన్నా ప్రజలు నరకయాతన పడుతున్నారు. కెఎన్ రోడ్డులో ఉన్న అండర్‌పాస్, చినతాడేపల్లి గ్రామానికి వెళ్లే అండర్‌పాస్, కుంచనపల్లి వద్ద ఉన్న అండర్‌పాస్‌లోకి ఎగువ నుంచి వర్షం నీరు చేరింది. దీంతో రోడ్డుమీద మోటారుసైకిల్లు, సైకిళ్లు వెళ్లాలంటే కష్టంగా మారింది. కడియద్ద నుంచి నీలాద్రిపురం వెళ్లే దారిలో ఉన్న చాకళ్ల చెరువుకు గండి పడటంతో రోడ్డుమీదకు నీరు చేరడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెదతాడేపల్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్ జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. రాంచెరువుకు గండిపడటంతో ఆ నీరు సబ్‌స్టేషన్‌లోకి వచ్చిపడ్డాయి. నీరు కదిలే మార్గం లేక మేకల సంత కూడా నీటమునిగింది. తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌లో ముంపు పరిస్థితి మారలేదు. మెట్టప్రాంతాల నుంచి పట్టణంలోకి వర్షం నీరు ఇంకా చొరబడుతుంది. సత్యవతి నగర్‌రోడ్డు కూడలి పూర్తిగా మునిగింది. ఇక్కడ నుంచి మోటారు సైకిళ్లు, కార్లు వెళ్లడం కష్టంగా మారింది. తాడేపల్లి చెరువు వద్ద నీటి ప్రవాహ ఉధృతి బుధవారంతో పోల్చుకుంటే తగ్గింది.మసీద్ సెంటర్‌లోని కొన్ని వీధులు నీటిలోనే ఉన్నాయి. కడకట్ల ప్రాంతంలోని యానాదుల కాలనీ, కడకట్ల లోతట్టు ప్రాంతాలు ఇప్పటికి వర్షం నీరు వెళ్లడం లేదు. దీంతో మురుగునీరులోనే తిరగాల్సి వస్తుంది.
ప్రమాద స్థాయిలో దువ్వ వయ్యేరు
తణుకు రూరల్ (ఆంధ్రజ్యోతి): తుఫాన్ కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎర్ర కాలువ వరద ప్రవాహం తణుకు మండలంలోని దువ్వ వయ్యేరుకు చేరడంతో దువ్వ వయ్యేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దువ్వ రెగ్యులేటర్ వద్ద ప్రమాద స్థాయిని మించిన వరద నీరు ప్రవహించడంతో వయ్యేరు గట్టున వున్న గుడిసెలు పూర్తిగా నీట మునిగాయి. అక్కడున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే వర్షాలకు నష్టపోయిన రైతులను ఎర్రకాల్వ వరద పూర్తిగా దెబ్బతీస్తుందంటున్నారు.
తణుకు పట్టణాన్ని ముంచిన గోస్తనీ
తణుకు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): గోస్తనీ నది ముంపుతో తణుకు పట్టణం రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీ, టీచర్స్ కాలనీ, సజ్జాపురంతోపాటు పాలిటెక్నిక్ కళాశాల, రాష్ట్రపతి రోడ్డు రెండు రోజులుగా ముంపులో ఉన్నాయి. పట్టణంలో ఉమా సిద్ధేశ్వరస్వామి ఆలయం గర్భగుడి సైతం ముంపులో ఉంది. పట్టణం మధ్యగా ప్రవహిస్తున్న గోస్తనీ నది గట్లపై నుంచి పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి పట్టణం జలమయం కాగా బుధవారం, గురువారం కొన్ని ప్రాంతాల్లో వరద మరింత పెరిగి రెండు అడుగులకు పైగా నీరు చేరింది. సంత మార్కెట్ వెళ్లే రోడ్డు, హౌసింగ్ బోర్డు కాలనీ, పట్టణంలో ప్రధాన రహదారి ముంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపార్ట్‌మెంట్‌ల సెల్లార్లలో చేరిన నీటిని పలువురు మోటార్లతో బయటకు తోడుతున్నారు. విద్యుత్, తాగునీటిపై అధికారులు దృష్టి సారించి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ముంపు తొలగించడంపై అధికారులు పట్టించుకోలేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు కాలనీల్లో మూడు రోజులుగా ఇళ్లకు పాల సరఫరా లేదు. పత్రికలు రావడం లేదు. బయటకు వెళ్లి తెచ్చుకునే వీలులేకుండా ఇళ్ల చుట్టూ నీరు. వరద నీటిలో మురుగు కలిసిపోయి దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా వరద అంతకంతకూ పెరగడంతో అధికారులు ఏమి చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
వరద బాధితులను ఆదుకుంటాం : ఆరిమిల్లి
భారీ వర్షాలు, గోస్తనీ నది పొంగడంతో పట్టణంలో పలు కాలనీలు నీట మునిగాయని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం పలు ప్రాంతాలను ఆయన అధికారులు, కూటమి నాయకులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. హౌసింగ్ బోర్డు కాలనీ, టీచర్స్ కాలనీ, పాలిటెక్నిక్ కళాశాల, రాష్ట్రపతి రోడ్డు ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు అడుగులు మేర వరద నీరు నిలిచిందన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో అన్ని వీధులు నీట మునిగాయన్నారు. బాధిత కుటుంబాలు మున్సిపల్ కార్యాలయం వద్ద పునరావాస కేంద్రానికి తరలివెళ్లాలని సూచించారు. కలెక్టర్, మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులతో కలసి సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
గోస్తనీ ప్రవాహం తగ్గితేనే..
గోస్తనీ ఉధృతితో పట్టణం ముంపు బారిన పడింది. ప్రవాహం తగ్గితేనే ముంపు తొలగుతుందని మునిసిపల్ కమిషనర్ రామ్‌కుమార్ అన్నారు. గోస్తనీలో వరద తగ్గడంతోపాటు చేలల్లో నీరు తగ్గితేనే పట్టణంలో ముంపు తొలగే అవకాశం ఉంది. హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రజలు ఇబ్బందులు దృష్ట్యా రెండు పూటలా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నాం. ముంపు తొలగే వరకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తాం.