బాగా తాగారు !
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:24 AM
ఎండలు మండిపోతున్నాయి. గొంతు తడారిపోతోంది. మంచినీరుకు బదులుగా అనేకమంది జిల్లాలో బీర్‌లు గటగటా తాగేస్తున్నారు.
ఎండలకు బీర్లు తెగ తాగేశారు..
రెట్టింపైన అమ్మకాలు
ట్టింపైన అమ్మకాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఎండలు మండిపోతున్నాయి. గొంతు తడారిపోతోంది. మంచినీరుకు బదులుగా అనేకమంది జిల్లాలో బీర్‌లు గటగటా తాగేస్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. గత ఏడాది కంటే బీర్‌ల అమ్మకాలు ఈసారి జిల్లాలో గణనీయంగా పెరిగాయి. ఒక దశలో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. మద్యం అమ్మకాల్లోనూ జిల్లాలో ఈ ఏడాది వృద్ధి కనిపించింది. గడచిన మే నెలలో 8 శాతం అధికంగా అమ్మకాలు సాగాయి. ఎక్సైజ్ అధికారులు కాస్త ఉపశమనం పొందారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తగ్గింది, రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మ కాల్లో పశ్చిమ గోదావరి జిల్లా వెనుకపడుతూ వచ్చింది. గత ప్రభుత్వంలోనే ఇదే జరిగింది. అందుకు గల కారణాలపై ఎక్సైజ్ శాఖలో పెద్దఎత్తున సమీక్ష నిర్వహించే వారు. అనుకున్న స్థాయిలో టర్నోవర్‌లో పెరుగుదల కానరాక జిల్లా అధికారులు తలలు పట్టుకునే వారు. టర్నోవర్ పడిపోవడానికి చెప్పే కారణాలతో ఉన్న తాధికారులు సంతృప్తి చెందే వారుకాదు. అనూహ్యంగా ఈ వేసవిలో ఎనిమిది శాతం వృద్ధి నమోదైంది. దాంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
రూ.141.66 కోట్లు టర్నోవర్
వైసీపీ హయాంలో జిల్లాలో పెద్దగా మద్యం అమ్మకాలు లేవు. భీమవరం ప్రాంతంలో బ్రాండెడ్ రకాలకు అలవాటు పడ్డారు. గత ప్రభుత్వంలో నాసి రకం మద్యం, బీర్‌లు సరఫరా అయ్యేవి. దీంతో భీమవరంలో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. మరోవైపు డూప్లికేట్ బ్రాండెడ్ రకాలు భీమవరం ప్రాంతానికి దిగుమతి అయ్యేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం అమ్మకాలను కట్టడి చేశారు. చెన్నయ్ నుంచి భీమవరం ప్రాంతానికి దిగుమతి అయ్యే జానీ వాకర్ నకిలీ మద్యం మాఫియాను అరెస్ట్ చేశారు. మరోవైపు యానాం తదితర ప్రాంతాల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం దిగుమతులను అరికట్టారు. కూటమి ప్రభుత్వంలో బ్రాండెడ్ రకాలను మళ్లీ తెరపైకి తెచ్చారు. కింగ్ ఫిషర్ వంటి బ్రాండెడ్ రకాల బీర్‌లను అమ్మకానికి పెట్టారు. ఇది కాస్త సత్ఫలితాలను ఇచ్చింది. మద్యం, బీర్‌ల అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. గత ఏడాది మే నెలలో జిల్లా వ్యాప్తంగా 1,70,404 కేసుల మద్యం అమ్మ కాలు జరిగాయి.ఈ ఏడాది ఎండలకు కాస్త తగ్గాయి,. మొత్తంపైన 1,61,742 కేసులు అమ్ముడు పోయాయి. బీర్‌ల విషయానికొస్తే గత ఏడాది 80,261 కేసులను విక్రయించారు. ఈ ఏడాది 1,18,033 కేసులు అమ్మారు. టర్నోవర్ విషయానికొస్తే గత సంవత్సరం మే నెలలో రూ. 131.06 కోట్లు విలువైన మద్యం, బీర్ అమ్ముడు పోయింది.ఈ ఏడాది రూ.141.66 కోట్లు టర్నోవర్ నమోదైంది. మొత్తంపైన ఎనిమిది శాతం వృద్ధితో అధికారులు ఉపశమనం పొందారు ఈ ఏడాది వరి, ఆక్వా రంగంలో వృద్ధి కూడా కలసి వచ్చిందని అంచనా వేస్తున్నారు.