ఎండ ప్రచండం
ABN , Publish Date - May 26 , 2026 | 12:19 AM
రోహిణీ కార్తె ప్రభావం జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తొలిరోజే సెగ చూపించింది.
అధిక ఉష్ణోగ్రతలకు తోడు రోహిణి సెగ
మండుతున్న ఎండలు
అల్లాడిపోతున్న ప్రజలు
ఇళ్లకే పరిమితం
మందగించిన వ్యాపారాలు
రోహిణీ కార్తె ప్రభావం జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తొలిరోజే సెగ చూపించింది. ఎండల తీవ్రత మరింత పెరిగింది ఉదయం 7గంటలకే భానుడి ప్రతాపం కనిపించింది. జిల్లాలో వడగాడ్పులు, ఉక్కబోతతో తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. రాబోయే ఐదు రోజులూ భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బతో జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.
భీమవరం టౌన్, పాలకొల్లు అర్బన్, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, అత్తిలి, మే 25(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో 45 డిగ్రీల వరకు నమోదైంది. వారం రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న స్థాయిలో సోమవారం ఉక్కపోత లేకపోవడం కొంత ఉపశమనం. తణుకు, తాడేపల్లిగూ డెం, గణపవరం ప్రాంతాలల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది.
ఉదయం 9గంటల నుంచి వడగాడ్పులకు భయపడి ప్రజలు బయటకు రావడం లేదు. పాలకొల్లు పట్టణంలో చాలామంది వ్యాపారులు 11 గంటలకు షాపులు మూసి వేసి ఇళ్లకు వెళ్లిపో యారు. తిరిగి సాయంత్రం 4గంటల తరువాత షాపులు తెరిచారు. శీతల పానీయాలకు గిరాకీ వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు ఉదయం 10 గంటలకే నిర్మానుషంగా మారుతున్నాయి. ఎండ తీవ్రతకు భయపడి అత్యవసర పని ఉంటే తప్ప జనం బయటకు రావడం లేదు. ఇళ్లకే పరిమిత మవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్ నిర్మానుష్యంగా మారింది. చిన్నపాటి వీధుల్లో కూడా జనసంచారం లేదు. తణుకులోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఆచంటలో ఎండ తీవ్రతకు తోడు అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు అపసోపాలు పడ్డారు. వడగాడ్పు, ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. అత్తిలి మండలంలో నిప్పుల కొలిమి వంటి ఎండకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే హడలి పోతున్నారు.
చిరు వ్యాపారులకు కష్టాలు
గణపవరం, మే 25(ఆంధ్రజ్యోతి): ఎండలు సుర్రుమంటున్నాయి. పది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలకు తోడు సోమవారం రోహిణికార్తె ప్రారంభం కావడంతో భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 8 గంటలకు కాలు బయటపెట్టలేని పరిస్థితి. రోడ్డు పక్కన చిరు వ్యాపారుల అవస్థలు వర్ణాణాతీతం. బొప్పాయి, మామిడి, జీడిమామిడి, తాటి ముంజలు, నిమ్మకాయలు, నేరేడు, కొబ్బరి బొండాలు, చెరుకు రసం, చేపలు, పీతలు, రొయ్యలు విక్రయించుకునే వారు ఎండలో మాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు ఉక్కబోత, వడగాడ్పులు తట్టుకోలేకపోతున్నాం. మరోవైపు ఎండ తీవ్రతకు కొనుగోలు దారులు రాకపోవడంతో వ్యాపారం సాగడం లేదు. గణపవరం, పిప్పర ప్రధాన కూడలిలో రహదారి పక్కన చిరు వ్యాపారులు వ్యాపారం లేక దినసరి కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని, తెచ్చిన సరుకులు మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వడదెబ్బకు ఇద్దరి మృతి
భీమవరం క్రైం, మొగల్తూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామానికి చెందిన జంగం శివశంకర్రావు (35) భీమవరం మండలం రామాయణపురంలో బ్రిడ్జి నిర్మాణ పనులకు వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఎండ వేడి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరుడు నాగ వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమవరం రూరల్ ఎస్‌ఐ వీర్రాజు తెలిపారు. మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధి సీతారామపురం సౌత్ పంచాయతీ కొత్తపేటకు చెందిన దొండపాటి రత్నంరాజు (38) సోమవారం నాటి వడదెబ్బతో మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.