బజార్.. బేజార్ !
ABN , Publish Date - May 27 , 2026 | 12:12 AM
వారం రోజుల నుంచి భానుడి భగ భగలతో ఈ వ్యాపారాలన్నీ బేజారయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవువుతున్నాయి. ప్రజలు ఎండకు భయపడి బయటకు రావడం లేదు.
ఎండ వేడికి ప్రజలు ఇళ్ల వద్దే..
మధ్నాహ్నం షాపులు మూసివేత
సన్నగిల్లిన వ్యాపారాలు
చిరు వ్యాపారులకు భారీగా నష్టం
నరసాపురం, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా అన్ని రకాల వ్యాపారులకు పెట్టింది పేరు. బంగారం, వస్త్ర దుకాణాలు, పౌల్ర్టీ, కిరాణా, డెయిరీ, హ్యాండ్‌లూమ్ వంటి వ్యాపారాలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది.నరసాపురంలో రోజు రూ.10 కోట్లుపైనే పసిడి వ్యాపారం జరుగుతుంది. జిల్లా కేంద్రం భీమవరం వస్ర్తా లతో పాటు కార్పొరేట్ వ్యాపార సంస్థలకు, రెస్టారెంట్లకు పెట్టింది పేరు. తణుకు మెడికల్, పౌలీ్ట్రలకు, తాడేపల్లిగూడెం ఉల్లి, కిరాణా వ్యాపారాలకు, పాలకొల్లు ట్రాన్స్‌పోర్టు, కిరాణా, కొబ్బరి, ఆధ్యాత్మిక క్షేత్రాలకు పేరు.. ఇలా జిల్లాలోని ప్రతి ప్రాంతం ఏదో ఒక వ్యాపా రానికి కేరాఫ్‌గా నిలుస్తాయి. నిత్యం జిల్లావ్యాప్తంగా రూ.200 నుంచి రూ.150 కోట్లవరకు వ్యాపార లావాదేవీలు జరుగు తుంటాయి. ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు పట్టణ ప్రాంతాల్లో వ్యాపార సందడి కనిపిస్తుంది. గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే జనం కూడా ఎక్కువ. ఈ కారణంగా చిరు వ్యాపారాలు కూడా భారీగా జరుగుతాయి. అత్యధికంగా తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు, టిఫిన్ బండ్లపై జరిగే చిరు వ్యాపారం లక్షల్లో ఉంటుంది. వేలాదిమంది జీవనోపాధి పొందుతున్నారు. వారం రోజుల నుంచి భానుడి భగ భగలతో ఈ వ్యాపారాలన్నీ బేజారయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవువుతున్నాయి. ప్రజలు ఎండకు భయపడి బయటకు రావడం లేదు. ఇంట్లో ఫ్యాన్, ఏసీల కిందే ఉంటున్నారు. సాయంత్రం సమయాల్లో ఎండ తగ్గినా వేడిగాలులు తగ్గడం లేదు. దీంతో సాయంత్రమైనా మార్కెట్ వైపు చూడటం లేదు. దీంతో చిరు వ్యాపారుల నుంచి దుకాణాల స్కేల్స్ గణనీయంగా పడిపోయాయి. ఏదైనా అవసరం అయితే పది గంటల లోపు కొనుగోలు చేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. 11 దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వ్యాపారాలు లేక చాలామంది మధ్యాహ్న సమయాల్లో షాపులు మూసి ఇంటికి వెళ్లిపోతున్నారు. బజ్జీ, మిక్చర్ బండ్ల వ్యాపారులు కొనేవాళ్లు లేక వ్యాపారం మాని ఇంటి వద్దే ఉంటున్నారు. జ్యూయలరీ కొనుగోళ్లు కూడా భారీగా పడిపోయాయి. వస్త్ర దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. భీమవరం వంటి పట్టణంలో నిత్యం వస్త్ర దుకాణాలు కిటకిట లాడుతూ కనిపించేవి. అయితే ఎండవేడికి ప్రజలు బయటకు రాకపోవడంతో వ్యాపారాలు ఢీలాపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా కనీసం రూ.80 కోట్లు వ్యాపారం జరగడం లేదని వర్తక సంఘాలు వాపోతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్ల పరిస్థితి కూడా దయనీయంగా మారింది.
మార్కెట్‌లో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవు
–వన్నెంరెడ్డి శ్రీనువాస్, మిఠాయి వ్యాపారి
30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాం. మార్కెట్‌లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఉదయం 10 దాటితే ఎండకు బయపడి ఎవరూ బయటకు రావడం లేదు. సాయంత్ర సమయాల్లో కూడా మార్కెట్‌కు వచ్చే వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదు. దీంతో వ్యాపారాలు మందగించాయి. చిరు వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అత్యవసరం అయితే తప్ప రోడ్డు ఎక్కడం లేదు.
జిల్లా అంతటా వేడిగాలులు
భీమవరం టౌన్/ తణుకు/ ఇరగవరం/ ఆచంట/ వాసవి పెనుగొండ, మే 26 (ఆంధ్రజ్యోతి): రోహిణి కార్తె ఎండలు మంట పుట్టిస్తున్నాయి. మంగళవారం జిల్లా అంతటా వేడి గాలులు వీచాయి. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. వేడి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు అల్లాడు తున్నారు. జల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గణపవరం మండలంలో అత్యధికంగా 45.2 డిగ్రీలు, తాడేపల్లిగూడెంలో 44.6 డిగ్రీల నమోదయ్యాయి. కాళ్ళ, తణుకు, ఉండి, అత్తిలి, పాలకోడేరు మండలల్లో 43 డిగ్రీలకు చేరుకుంది. బయటకు అడుగు పెడితే చాలు శరీరం కాలిపోయేలా వేడిగాలుల సెగ తగులుతోంది. ఉదయం 9 గంటలకే సూర్యుడు తీవ్రతను చూపించడంతో రహదారులు జన సమాచారం లేక నిర్మాణ నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే తణుకు రహదారులపై 11 దాటితే జనసంచారం కనిపించలేదు. దుకాణదారులు షాపులను మూసి వేసి ఇళ్లకు చేరుకుంటున్నారు. వేల్పూరు సబ్‌స్టేషన్ పరిధిలో నాలుగు రోజులుగా పీటీఆర్ సమస్య కారణంగా తరచూ విద్యుత్ అంతరాయాలతో గ్రామస్తులు హడలిపోతున్నారు. మరికొన్ని చోట్ల లోవోల్టేజీ కారణంగా ఫ్యాన్లు కూడా సరిగా తిరగక రాత్రులు అవస్ధలు పడుతున్నారు. ఇంకా ఈ ఎండలు ఎన్నిరోజులా అని బెంబేలెత్తిపోతున్నారు.