హమాలీ సొమ్ములేవి ?
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:22 AM
అన్నదాతలను కూలీ ఖర్చుల భారం వేధిస్తోంది. గత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం విక్రయించారు.
జిల్లాలో రూ.14.25 కోట్ల బకాయిలు
మూడున్నర నెలలుగా రైతుల ఎదురుచూపులు
తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలను కూలీ ఖర్చుల భారం వేధిస్తోంది. గత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం విక్రయించారు. ధాన్యం లోడింగ్, రవాణా చార్జీలు రైతులే భరించారు. ఆ సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేయాలి. కానీ నేటికీ జమ కాలేదు. జిల్లాలో 4 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు ప్రభుత్వానికి విక్రయిం చారు. ఆ ధాన్యానికి సంబంధించి కూలీ, రవాణా చార్జీలు టన్నుకు 8 కిలోమీటర్ల లోపు రూ.384 చెల్లించాలి. వీటికి సంబంధించి రైతులకు మొత్తం రూ.14.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం తూసిన 24 గంటలలోపే ధాన్యం సొమ్ము జమచేసిన ప్రభుత్వం ఈ హమాలీ, రవాణా చార్జీలు చెల్లించక పోవడంపై రైతులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చార్జీలు పెంచేందుకేనా ?
హమాలీ, రవాణా చార్జీలు పెంచి ఇద్దామనే ఆలోచనతోనే జాప్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే రవాణా, హమాలీ చార్జీలు కలిపి క్వింటాకు రూ.384 ఇస్తున్నారు. ప్రస్తుతం ధరల పెరుగుల నేపథ్యంలో ఆ చార్జీలు సరిపడవని రైతుల డిమాండ్ చేస్తుండటంతో పెంచేందుకు రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో ధర నిర్ణయించేందుకు అవకాశం ఉందని అందుకే ఖరీఫ్ సీజన్ సొమ్ములు జమచేయడంలో జాప్యం అయిందని జిల్లా అధికారులు చెబుతున్నారు.
గతంలో సొసైటీల పరం..
గతంలో ఈ రవాణా, హమాలీ చార్జీలు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు జమ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మును నేరుగా రైతుల ఖాతాలకే జమ చేస్తున్నారు. గతంలో జమ చేసే సొమ్ము రైతులకు చేరకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సొసైటీలు ఆ చార్జీలను రైతులకు ఇచ్చేవారు కాదు. నాలుగు సీజన్‌లుగా ఈ చార్జీలను రైతుల ఖాతాలకు పది రోజుల్లోపే జమ చేసేవారు. ఈ ఖరీఫ్ సీజన్ సొమ్ము మూడున్నర నెలలు గడిచినా నేటికి సొమ్ములు రాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు.
సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నాం
ఎకరానికి 40 బస్తాల చొప్పున 9 ఎకరాలకు 27 టన్నుల దిగుబడి వచ్చింది. ఆ ధాన్యం మిల్లుకు ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు రూ.10,368 ఖర్చయింది. హమాలీ చార్జీలు క్వింటాకు రూ.24 చొప్పున 6,480 రావాలి. మొత్తం రూ.16,848 రావాల్సి ఉంది. మూడున్నర నెలలుగా ఎదురు చూస్తున్నాం.
గజ్జరపు సత్యనారాయణ, రైతు కృష్ణాయపాలెం
ఎప్పుడూ జాప్యం లేదు
ఎప్పుడూ ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యం హామాలీ, రవాణా చార్జీల ఖాతాల్లో జమ చేసేవారు. రైతులంతా సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే చార్జీలు చెల్లించాలి. పెట్టుబడి ఖర్చులైనా వస్తాయని చూస్తున్నాం.
దేవళ్ల వెంకట సుబ్బారావు, రైతు కృష్ణాయపాలెం