పాతాళంలో..జలం!
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:19 AM
జిల్లాలో భూగర్భజల మట్టాలు అధఃపాతాళంలోకి దిగజారి రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. సూపర్ ఎలినినో, వర్షాభావంతో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి.
భయపెడుతున్న భూగర్భ జలాలు
ఎల్‌నినోతో 23.51 మీటర్ల దిగువకు
వర్షాలు కురిస్తేనే నీటిమట్టాలు పెరిగేది
పెరుగుతున్న విద్యుత్ వినియోగం
రైతులకు రాబోయేది గడ్డు కాలమే
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో భూగర్భజల మట్టాలు అధఃపాతాళంలోకి దిగజారి రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. సూపర్ ఎలినినో, వర్షాభావంతో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. కొద్దినెలల క్రితం 19.26 మీటర్ల కు అడుగంటిన జలాలు తాజాగా జిల్లా సగటు 23.51 మీటర్లకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి జిల్లా సగటు 21.96 మీటర్లగా నమోదైంది. 1.55 మీటర్ల లోటు పెరిగింది. ఒకప్పుడు డార్క్ ఏరియా కింద నమోదైన ద్వారకాతిరుమలలో 53.8, కొయ్యలగూడెం 43.55 మీటర్లతో మళ్లీ పాతరోజులను గుర్తుకు తెస్తున్నాయి. ఇక్కడ అప్పట్లో బోర్లపై నిషేధం విధించారు. తాజాగా దెందులూరులో 46.02, కామవరపుకోట 41.77, మీటర్ల దిగువకు నీటిమట్టాలు పడిపోయాయి.
జిల్లాలో వర్షాకాలం వరుణుడు ముఖం చాటేశాడు. గత రెండు నెలలు కాలంలో కేవలం 34 శాతం వర్ష పాతం నమోదైంది. అల్పపీడనాలు, రుతుపవనాల కరు ణ చూపలేదు. దీంతో భూగర్భజలం మరింత అట్టుడగు స్థాయి దిగిపోయి రైతులకు ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చాయి. చుట్టూ ఏర్లు, కాల్వలున్నా నీటి జాడ లేక.. భూగర్భజలం ఇంకకపోవడంతో నీటి మట్టాలు ఆందోళనకరంగా పరిణ మించాయి. ఏ నియోజకర్గం సగటు చూసిన బెంబేలెత్తేలా ఉన్నాయి. ప్రధానంగా మెట్టప్రాంతం ఎక్కువ ఉండి బోర్లపైనే ఆధారపడే దెందులూరు 28.31, చింతలపూడి 25.64,నూజివీడు 23.61 తదితర మూడు నియోజకవర్గాల్లో అమాంతంగా పడి పోయాయి. ఈ లోటును ఎలా భర్తీ చేయాలన్న విషయంలో అఽధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏలూరులో 19.84, గోదావరి పక్కనే ఉన్న పోలవరంలో 14.62, ఉంగుటూరులో 14.53, కొల్లేరు పరిసరాల్లో ఉన్న కైకలూరులో 10.87 మీటర్ల నీటి మట్టాలు కలవర పాటుకు గురి చేస్తున్నాయి.
మండలాల వారీగా భూగర్భజల మట్టాలు
ఏలూరు అర్బన్ 19.84, చింతలపూడి 19.93, జంగా రెడ్డిగూడెం 15.31, కామవరపుకోట 41.77, లింగపాలెం25,56 దెందులూరు46.02, పెదపాడు 26.28, ఏలూరు రూరల్10.29, పెదవేగి30.76,, కైకలూరు1.10, కలిదిండి 1,55, మండవల్లి 19,.50, ముదినేపల్లి 21.31ఆగిరిపల్లి7.7 చాట్రాయి13.62, ముసునూరు55.45, నూజివీడు 17.67, బుట్టాయగూడెం8.48,జీలుగుమిల్లి 12.36, కొయ్యలగూడెం 43.55,, కుక్కునూరు6.27, పోలవరం 5.96, టి.నర్సాపురం 18.76, వేలేరుపాడు 6.98, భీమడోలు 16.01, నిడమర్రు 7.32, ఉంగుటూరు 20.28, ద్వారకాతిరుమల 53.8 మండలాల్లో మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి.
రీచార్జి బావులు నిర్మాణం
జిల్లాలో భూగర్భ జలాలు నీటి మట్టాలను వృద్ధ్ది చేయడానికి గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. లింగపాలెం మండలం ఆశన్నగూడెం, కొయ్యలగూడెం మండలం మంగపతి దేవిపేట, ముసునూరు మండలం గొల్లపూడిల్లో ఒక్కొక్కటి రూ.2.80 లక్షల వ్యయంతో రీచార్జి బావుల నిర్మాణం చేపట్టారు. భూమిపైకి వచ్చిన నీటిని బావు ల్లోకి పంపుతారు. భవిష్యత్‌లో మరింతగా విస్తరించే దిశగా కార్యాచరణ ప్రణాళికను అమలు చే స్తున్నారు.
జలధార– జలహారతే దిక్కు
జిల్లాలో వర్షపాతం లోటు 15 మండలాల్లో 50 శాతం తక్కువగా నమోదు కాగా నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఎనిమిది మండలాల్లోను అంతంత మాత్రంగా వర్షపాతం నమోదైంది. ప్రభుత్వం ఈ ఏడాది ముందస్తుగానే మేల్కొని జలధార–జలహారతి కింద 100 రోజుల ప్రణాళికను అమలు చేసింది. ఈ కార్యక్రమంలో వాగులు, ఫీడ ర్ ఛానల్స్, వంకలు, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో పూడికలను తీశారు. ఇటీవల ఇరిగేషన్‌శాఖ ద్వారా ఓఅండ్‌ఎం పనులు జరిగాయి. తద్వారా భారీగా నీటి నిల్వలు చేసుకోవడానికి భూగర్భజలం ఇంకించడానికి ఆస్కారం ఏర్పడింది. అయితే వరుణుడు కరుణిస్తేనే జలధార–జలహారతి పనులకు సాంత్వన చేకూరనుంది. రాబోయే డిసెంబరు వరకు కురిసే వర్షాలతో భూగర్భజలం ఉబికి పైకి వస్తేనే రైతులకు విద్యుత్ వినియోగం తగ్గనుంది. పంట కాలాలు సజావుగా సాగుతాయి.