Share News

కొండలను తవ్వేస్తున్నారు

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:21 AM

కొయ్యలగూడెం మండలంలో గ్రావెల్‌, మట్టి మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు.

కొండలను తవ్వేస్తున్నారు
గంగవరంలో కొండను తవ్వుతున్న ఎక్స్‌కవేటర్‌

గంగవరంలో గ్రావెల్‌ మాఫియా

అధికారులు నామమాత్రపు దాడులు

ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్న ప్రజలు

కొయ్యలగూడెం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి):కొయ్యలగూడెం మండలంలో గ్రావెల్‌, మట్టి మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. రాజవరం పంచాయతీలోని గంగవరం గ్రామ పరిధిలో ఉన్న కొండలన్నీ మటుమాయం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన కొండలు ప్రస్తుతం నేలమట్టం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం నుంచి అక్రమార్కులు ఈ కొండలను తవ్వేస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఈ అక్రమార్కులను అరికట్టలేకపోయారు. కూటమి ముఖ్యనాయకుల అండదండలు ఉండటం వలనే ఈ దందా కొనసాగుతుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. చెరువుల్లో మట్టి మాఫియా అనంతరం ఈ మాఫియా కొండల వైపు పడింది. రెండు నెలలుగా రాజవరం, గంగవరం ప్రాంతాల్లో యఽథేచ్ఛగా గ్రావెల్‌ తరలిస్తున్నారు. వేలాది రూపాయ లు చేతులు మారుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవస్తు న్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజవరం పంచాయతీలోని 312, 207 సర్వే నంబర్‌లలో ఉన్న ఈ కొండలన్నీ దాదాపు కనుమరుగయ్యాయి. అధికారులకు సమాచారం ఇస్తున్నా పట్టించు కోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మొక్కుబడిగా ఏదో ఒక లారీని పట్టుకున్నట్టు చూపించి మరలా వదిలేస్తు న్నారని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వాపోతున్నారు. గతంలో పవన్‌కల్యాణ్‌ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయనకు గ్రామ స్థులు ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికారులు స్పందించి కేసులు నమోదు చేశారు. కొంతకాలం ఆ ప్రాంతంలో తవ్వకాలు ఆగాయని మరలా ఇటీవల అక్రమార్కులు చెలరేగిపోతున్నారని ప్రజలు వాపోతున్నారు.

చర్యలు తీసుకోకుంటే పవన్‌ దృష్టికి తీసుకెళ్తాం : కూటమి నాయకులు

ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఒక వైసీపీ నాయకుడు ఈ తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తున్నాడంటూ కూటమి నాయకులు కొంతమంది ఇటీవల ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి, అక్రమ మైనింగ్‌ తవ్వకాలను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. అయినప్పటికీ తవ్వకాలు కొనసాగడం గమనార్హం. మంగళవారం మైనింగ్‌, రెవెన్యూ అధికారులు ఆప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. కేవలం తూతూమంత్రపు పరిశీలనతోనే సరిపెడుతున్నారే తప్పా చర్యలు తీసుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టా లని రాజవరం, గంగవరం గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉన్నతాధికారు లు స్పందించకపోతే ఈ సమస్యను ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లతామని కూటమి నాయకులు పేర్కొంటున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:21 AM