Share News

మంత్రిగారు.. అనుమతిచ్చారట !

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:17 AM

నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఎన్నిసార్లు హెచ్చరించినా అక్రమ మట్టి తవ్వకందారులు మట్టి తవ్వకాలను ఆపడం లేదు.

మంత్రిగారు.. అనుమతిచ్చారట !
తుక్కులూరు మద్దుల చెరువులో మట్టి తవ్వకాలు

మద్దుల చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు

మంత్రి సారథి ఆగ్రహం.. నిలిచిన తోలకాలు.. కేసు పెట్టాలంటూ అధికారులకు ఆదేశం

నూజివీడు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి):నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఎన్నిసార్లు హెచ్చరించినా అక్రమ మట్టి తవ్వకందారులు మట్టి తవ్వకాలను ఆపడం లేదు. తాజాగా వాణిజ్య అవసరాలకు చెరువు నుంచి అక్రమంగా చేపట్టిన మట్టి తోలకాలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు మండలం తుక్కులూరు–రామన్నగూడెం గ్రామాల సరిహద్దులో ఉన్న మద్దుల చెరువులో గురువారం కొందరు తెలుగు తమ్ముళ్లు మంత్రి పేరు చెబుతూ చెరువులో అక్రమ మట్టి తోలకాలు ప్రారంభించారు. తుక్కులూరులో నిర్మించనున్న ఫ్యాక్టరీ భూమి మేరువాకు చెరువులో రెండు ఎక్స్‌కవేటర్ల సాయంతో గురువారం ఉదయం నుంచి మట్టి తోలకాలను ప్రారంభించారు. మంత్రి అనుమతితోనే మట్టి తరలిస్తున్నట్టు స్థానిక రెవెన్యూ అధికారులకు స్పష్టం చేయడంతో వారు మిన్నకుండిపోయారు. అయితే అనధికారికంగా జరుగుతున్న ఈ తోలకాలపై ‘ఆంధ్రజ్యోతి’ హైదరా బాద్‌లో ఉన్న మంత్రి దృష్టికి తీసుకెళ్లగా తాను ఎవరికి ఎలాంటి అను మతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అక్రమ మట్టి తోలకాలు చేపడు తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, వాహనాలను సీజ్‌ చేయాలని, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో చెరువు ప్రాంతానికి వెళ్లి రెవెన్యూ అధికారులు మట్టి తోలకాలను నిలిపివేశారు. ఒక ట్రాక్టర్‌, రెండు ఎక్స్‌కవేటర్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:17 AM