రేపు చంద్రగ్రహణం
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:00 AM
శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణమి రోజు మంగళవారం పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగహణం దేశవ్యాప్తంగా కన్పిస్తుందని పంచాంగకర్తలు చెబుతున్నారు.
రేపు చంద్రగ్రహణం
ద్వారకాతిరుమల, మార్చి 1(ఆంధ్రజ్యోతి): శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణమి రోజు మంగళవారం పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగహణం దేశవ్యాప్తంగా కన్పిస్తుందని పంచాంగకర్తలు చెబుతున్నారు. దీనివల్ల చంద్రుడు చీకటిగా ఉంటాడు. రంగుల పండుగ హోలీ రోజునే ఈ సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుండడంతో గ్రహణ ప్రభావం హోలీ వేడుకలపై ఉంటుందని జోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఆలయాల మూసివేత, గ్రహణపట్టు, విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు వంటివి ఆచరించాల్సి ఉందని చెబుతున్నారు. దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుందని అందువల్లే దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పండితులు చెబుతున్నారు.
గ్రహణ సమయం మొత్తం 3.27 గంటలు అయితే దేశంలో సాయంత్రం 6.02 గంటలకు చంద్రోదయం అయిన తర్వాత 6.46 గంటల వరకు అంటే సుమారు 44 నిమిషాలు మాత్రమే కన్పిస్తుంది. గ్రహణ ప్రారంభ సమయం మార్చి 3న మధ్యాహ్నం 3.19 గంటలకు, మధ్యస్థ కాలం సాయంత్రం 5.03 గంటలకు, గ్రహణ మోక్ష కాలం సాయంత్రం 6.46 గంటలకు.
సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించే వారు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణ సమ యం పూర్తయ్యే వరకూ ఆహారం స్వీకరించ కుండా ఉండడం మంచిదని, ఈ గ్రహణం పుబ్బ నక్షత్రం సింహరాశిలో సంభవించడం వల్ల ఈ నక్షత్రజాతకులకు పూర్తిదోషం ఉంటుందని ఈ గ్రహణాన్ని చూడకూడదని, సింహ, కుంభ, కర్కాటక, మకర రాశి వారిపై చెడు ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మిగిలిన రాశుల వారికి మధ్యస్త, అనుకూల ఫలితాలు ఉంటాయని పండితులు సూచించారు.
రేపు ఆలయాలు మూసివేత
ద్వారకాతిరుమల/జంగారెడ్డిగూడెం రూరల్/భీమవరం టౌన్ : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 6.20 గంటల నుంచి మూసివేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు స్వామివారి దర్శనాన్ని రద్దు చేస్తున్నామని, ఆ మరుసటి రోజైన నాలుగో తేదీన అన్ని ఆర్జిత సేవలు, దర్శనాలు యథావిధిగా భక్తులకు లభిస్తాయని ఈవో భద్రాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం ఉదయం 8 గంటలకు మూసివేసి మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనం ప్రారం భమవుతాయని ఈవో చందన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయం ఉదయం 9 గంటలకు పూజలు పూర్తిచేసి ఆలయాన్ని మూసివేస్తామని, బుధవారం ఉదయం సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఈవో రామకృష్ణంరాజు తెలిపారు.
ఆచరించాల్సి నియమాలు.. పరిహారాలు
– కాశీభొట్ల పార్వతీశ్వరశర్మ ప్రముఖ పంచాంగకర్త, పోలసానిపల్లి.
సబ్బు, షాంపు లేకుండా గ్రహణానికి ముందు పట్టుస్నానం, తర్వాత విడుపుస్నానం చేయాలి. గర్భిణిలు అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని చూడకుండా భగన్నామస్మరణలో ఉండాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని పూజామందిరాన్ని, దేవతా విగ్రహాలను శుభ్రపరచుకోవాలి. నిల్వ పదార్థాలపై దర్భలు ఉంచడం శ్రేయస్కరం.