డిగ్రీకి కష్టకాలం
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:17 AM
ఉన్నత చదువులకు వెళ్లే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒకప్పుడు డిగ్రీయే ప్రధాన గమ్యం.
భర్తీ కాని సీట్లు
తొలి విడత కౌన్సెలింగ్‌లో 75 వేల సీట్లకు భర్తీ అయింది 14 వేలే
ప్రొఫెషనల్, సాంకేతిక కోర్సుల వైపే విద్యార్థుల మొగ్గు
ఆదికవి నన్నయ వర్సిటీ పరిధిలో వెలవెలబోతున్న కళాశాలలు
మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా మార్పులు తప్పనిసరి
తణుకు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి)ఉన్నత చదువులకు వెళ్లే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒకప్పుడు డిగ్రీయే ప్రధాన గమ్యం. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సుల్లో ప్రవేశం లభించడమే గగనంగా ఉండేది. కానీ కాలక్రమంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగ మార్కెట్ అవసరాలు, విద్యార్థుల ఆలోచనా ధోరణి మారడంతో సంప్రదాయ డిగ్రీలపై ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం డిగ్రీ ప్రవేశాల తొలి విడత కౌన్సెలింగ్‌లో భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ, ఎయిడెడ్, పైవ్రేటు కళాశాలల్లో వేలాది సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కొన్ని ప్రైవేటు కళాశాలల్లో తరగతి గదులున్నా విద్యార్థులు లేని దుస్థితి నెలకొంది.
75 వేల సీట్లకు పద్నాలుగు వేలే భర్తీ
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాల్లో 299 ప్రభుత్వ, ఎయిడెడ్, పైవ్రేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అన్ని విభాగాల్లో కలిపి సుమారు 75 వేల సీట్లు అందుబాటులో ఉండగా, తొలి విడత కౌన్సెలింగ్ ముగిసే సమయానికి కేవలం 14 వేల సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు సమాచారం. దీంతో యాజమాన్యాలు తదుపరి విడత కౌన్సిలింగ్‌పైనే ఆశలు పెట్టుకున్నాయి. అసలు సంప్రదాయ డిగ్రీలు చదివేందుకు మారిన పరిస్థితులే ప్రధాన కారణం.
ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణాలు
గతంలో సాధారణ డిగ్రీతో ఏదో ఒక ఉద్యోగం లభిస్తుందనే నమ్మకం ఉండేది. ఇప్పుడు మూడు, నాలుగేళ్లు చదివినా ఉపాధి లభించడం లేదు. మళ్లీ ప్రత్యేకంగా కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ ప్రావీణ్యం, డిజిటల్ నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్ అనుభవం వంటి అంశాలు అవసరం అవుతున్నారు.
ఇంటర్మీడియట్ పూర్తికాగానే విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్, పారా మెడికల్‌తోపాటు బీబీఏ, బీసీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వైపు పయనిస్తున్నారు. ప్రత్యేకించి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక రంగాలు యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
బోధనాంశాల పట్ల విముఖత ఏర్పడుతోంది. బీఏలో హిస్టరీ, బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి ప్రాథమిక సబ్జెక్టులు చదివేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. వీటి స్థానంలో నేరుగా ఉద్యోగం, అధిక వేతనం అందించే ప్రత్యామ్నాయాలనే విద్యార్థులు ఎంచుకుంటున్నారు.
ఫీజుల భారంగా మారాయి. ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు, వసతి, రవాణా ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించినా భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు సంప్రదాయ డిగ్రీలకు మొగ్గు చూపడం లేదు.
ఇంటర్ తర్వాతే విదేశీ ఉన్నత విద్య కోసం అర్హత పరీక్షలు రాస్తూ ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.
ఆధునిక కోర్సుల రూపకల్పన అవసరం
ఉద్యోగ విపణిలో కేవలం మార్కుల పత్రం ఉంటే సరిపోని పరిస్థితి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్ ప్రావీణ్యం, ఇంటర్న్‌షిప్ అనుభవం తప్పనిసరి అయ్యాయి. విద్యార్థుల ఆదరణ లేని సంప్రదాయ కోర్సుల స్థానంలో డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, అగ్రి బిజినెస్ వంటి సరికొత్త నైపుణ్య ఆధారిత కోర్సులను డిగ్రీ స్థాయిలో తక్షణమే ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
మార్గదర్శకత్వం లోపించింది
డిగ్రీ కోర్సుల ప్రాధాన్యంపై సరైన అవగాహన, మార్గదర్శకత్వం లేకపోవడమే ప్రవేశాలు తగ్గడానికి ప్రధాన కారణం. డిగ్రీ అనంతరం అందుబాటులో ఉండే పోటీ పరీక్షలు, ఉద్యోగావకాశాలపై విద్యార్థులకు స్పష్టతనివ్వాలి. నైపుణ్య ఆధారిత కోర్సులపై మొగ్గు పెరగడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలలో జాప్యం, ప్రవేశాల నోటిఫికేషన్ ఆలస్యం వంటి అంశాలూ విద్యార్థులు ఇతర రంగాల వైపు మళ్లడానికి దారితీశాయి.
– డాక్టర్ నామన కనకయ్య, సెక్రటరీ, ఏకేఎన్‌యూ మేనేజ్‌మెంట్ అసోసియేషన్
సాంకేతిక విద్యపైనే దృష్టి
మా కళాశాలలో 540 సీట్లకు గాను ఇప్పటివరకు 170 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లు తర్వాతి విడతల్లో భర్తీ అవుతాయని భావి స్తున్నాం. ప్రస్తుతం విద్యార్థులు చేతి వృత్తి లేదా సాంకేతిక విద్య ఉంటేనే తక్షణ ఉపాధి లభిస్తుందని నమ్ముతున్నారు. సాధారణ డిగ్రీ కంటే పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ వైపే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
– డాక్టర్ కె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, చిట్టూరి ఇంద్రయ్య డిగ్రీ కళాశాల, తణుకు
ఇంజనీరింగ్.. జోష్
90 శాతం పైగా సీట్ల భర్తీ..
ప్రధాన కళాశాలల్లో 100 శాతం
ఉమ్మడి జిల్లాలో 15 కళాశాలల్లో
కన్వీనర్ కోటాలో 8 వేలు భర్తీ
ఏపీఈఏపీ సెట్‌లో 10,978 ఉత్తీర్ణత..
వారందరూ ఇంజనీరింగ్ వైపే...
భీమవరం రూరల్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఇంజనీరింగ్ విద్య జోష్ కొనసాగుతోంది. మూడేళ్లుగా సాగుతున్న సీట్ల భర్తీ హవా కొనసాగుతోంది. కన్వీనర్ కోటా సీట్లు అయితే గతంలో మాదిరిగానే నిండాయి. కౌన్సెలింగ్ ఆలస్యం అయినప్పటికీ అనేక కళాశాలల్లో అనుకున్న విధంగా సీట్లు భర్తీ అయ్యాయి. గడిచిన మూడేళ్లుగా ఇంజనీరింగ్ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఏపీ ఈఏపీ సెట్‌లో 10,978 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి జిల్లాలో 23,712 మంది ఇంటర్ పూర్తి చేసుకున్నారు. వీరిలో సగం మందికి పైగా ఇంజనీరింగ్ వైపు వస్తున్నారు.
సీట్ల భర్తీలో అదే హవా
ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ ఈ ఏడాదీ హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 15 ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటే మేనేజ్‌మెంట్ సీట్లు 3,800 వరకు ఉండగా కన్వీనర్ కోటా సీట్లు 8,800 మొత్తం 12600 సీట్లు వరకు ఉన్నాయి. సీట్ల భర్తీలో కన్వీనర్ కోటా సీట్లు ముందుంటున్నాయి. ప్రధాన కళాశాలల్లో వంద శాతం సీట్ల భర్తీ అవుతుంటే మిగిలిన కళాశాలల్లో 90 శాతం వరకు సీట్లు భర్తీ అవుతున్నాయి. దీంతో కన్వీనర్ కోటా సీట్లు 8 వేల వరకు భర్తీ అయ్యాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో కొన్ని కళాశాలల్లో భర్తీలో మెరుగనిపించుకున్నా మరికొన్ని కళాశాలల్లో నిరాశ తప్పలేదు. కౌన్సెలింగ్ ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు ఏదో ఒక కళాశాలలో సీటు రావడంతో మేనేజ్‌మెంట్ వైపు వెళ్లేవారు తగ్గారు. దీనివల్ల మేనేజ్‌మెంట్ కోటా సీట్లు 70 శాతం లోపు సీట్లు భర్తీ అయినట్లు సమాచారం.
అన్ని కోర్సులపైనా ఆసక్తి
ఇంజనీరింగ్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ కోర్సులదే హవాగా కనిపించేది. ఈసారి ఆ విధానం మారింది. విద్యార్థులు ఏ కోర్సులోనైనా ఉద్యోగం సాధించవచ్చనే నమ్మకంతో ఉన్నారు. దీంతో రెండేళ్లుగా ఈఈఈ, మెకానికల్ కోర్సుల సీట్లు భర్తీ అయ్యాయి.ఐటీ, ఏఐ, డేటాసైన్స్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు మక్కువ చూపడంతో అవి ముందు వరుసలో ఉన్నాయి. మూడేళ్ళుగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించలేకపోయారు. ఉద్యోగాలు సాధించిన వారి సంఖ్య 50 శాతంలోపే ఉంది. గతంలో ప్రధాన కళాశాలల్లో 80 శాతం మందికి క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారానే ఉద్యోగాలు వచ్చేవి. ఈ విద్యా సంవత్సరంలో ఎలా ఉంటుందో చూడాలి.